పోలవరం దెబ్బతినడానికి వైసీపీనే కారణం.. మండిపడ్డ మంత్రి నిమ్మల
x

పోలవరం దెబ్బతినడానికి వైసీపీనే కారణం.. మండిపడ్డ మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నీటిపారదుల ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని, వాటి ప్రాధాన్యత ప్రకారం యుద్దప్రాతిపదికన కంప్లీట్ చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.


‘‘పోలవరం ప్రాజెక్ట్‌లో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి వైసీపీ నిర్లక్ష్య ధోరణే కారణం. వైసీపీ సర్కార్ బాధ్యతతో పనిచేసి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తై ఉండేది’’ అని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ నూతన మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ఈరోజు ఆయన ఏపీ ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్ట్‌లు అన్నింటినీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఏ ప్రాజెక్ట్ విషయంలో కూడా జాప్యం, నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తామని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్‌లన్నింటినీ వాటి ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేస్తాం అని చెప్పారు.

గత పాలకుల చేతకాని తనమే

ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మళ్ళీ పాలన తెలిసిన నేత సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు అని చంద్రబాబును ఉద్దేశించి చెప్పారు నిమ్మల రామానాయుడు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ‘‘కానీ గత పాలకుల చేతకానితనం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది. గత పాలకులు ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకుని, దాని బాగోగులు పట్టించుకోకుండా మూలన పెట్టారు. సీఎంగా జగన్ పాల్పడిన విధ్వంసానికి పోలవరం ఒక సాక్ష్యం. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్‌కు పిలుపునిచ్చి, అధికారులను బదిలీలు చేసింది. జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం తీరులో మార్పు రాలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ విధ్వంసానికే కట్టుబడినట్లు వైసీపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

నీతి అయోగ్ స్వయంగా చెప్పింది

2020లో వచ్చిన వరదల వల్లే పోలవరం ప్రాజెక్ట్‌లోని డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని వివరించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం. ఈ విషయం మేము చెప్తున్నది కాదు. పోలవరం ప్రాజెక్ట్‌పై ఇచ్చిన నివేదికలో నీతి అయోగ్ స్వయంగా ఈ విషయాన్ని విశదీకరించింది. ఆఖరికి డ్రెయిన్‌లలో పూడికలు తీయించడానికి కూడా వైసీపీ ప్రయత్నించలేదు. వ్యవసాయ సీజన్ రాబోతున్న క్రమంలో ఈ పూడికలు తీయించడం ఛాలెంజ్ కానుంది. కానీ ఏది ఏమైనా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యేనాటికి పూడికతీతను విజయవంతంగా ముగించేలా అడుగులు వేస్తున్నాం’’ అని వివరించారు.

రైతులకు అన్యాయం జరిగింది

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని నిమ్మల రామానాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉంది. ముందుగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తున్నాం. ‘‘గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది. రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించింది. ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం.. వ్యవసాయ లాకులు, గేట్లకు కనీస మరమ్మతులు కూడా చేయించలేదు. గ్రీజు కూడా పెట్టిన పాపాన పోలేదు. వ్యవసాయ సీజన్ రానున్న క్రమంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం’’ అని వెల్లడించారు.

తుఫాన్‌లను ఎదుర్కొనేలా ఏర్పాట్లు

వైసీపీ హయాంలో వరదలు, తుఫాన్‌లు వస్తే ఎదుర్కోవడానికి కావాల్సిన ఇసుక బస్తాలు కూడా అందుబాటులో లేవని దుయ్యబట్టారు నిమ్మల. కానీ ఈసారి అన్నీ మారతాయని హామీ ఇచ్చారు. ‘‘భవిష్యత్తులో వరదలు తుఫానులు ఏమి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కావాల్సిన అన్ని వస్తువలను సమకూరుస్తున్నాం. వైసీపీ పాలనలో వ్యవసాయం తిరోగమన బాట పట్టింది. దాన్ని తిరిగి అభివృద్ధి బాట ఎక్కిస్తాం. రైతుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తాం. రైతులు నీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

Read More
Next Story