కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. తాను బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాల్లో ధరించిన చీరలు, వాటి ప్రత్యేకతలు, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఈ చర్చ తాజాగా తెరపైకొచ్చింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన చీరలను తన బడ్జెట్ ప్రవేశపెట్ట సందర్భాల్లో నిర్మలా సీతారామన్ ధరించడంతో ఈ చర్చకు ప్రాధాన్యత నెలకొంది. తన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాల్లో ధరించిన చీరలన్నీ చేనేతన్నలు తయారు చేసినవే కావడం విశేషం. ఆ విధంగా చేనేత రంగం మీద తనకున్న అపారమైన మక్కువ, గౌరవాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. బంగారు వర్ణం అంచుతో కూడిన క్రీమ్ కలర్ రంగు కలిగిన చేనేత చీరను ధరించి మరో సారి చేనేత రంగంపై తనకు ఉన్న గౌరవం, మక్కువను ప్రదర్శించి ఆదర్శంగా నిలిచారు. ఈ చీరలో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మధుబని కళకు చెందిన చిత్రాలు కనిపిస్తుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కోడలు అనిపించుకున్నారు. మంగళగిరిలో ప్రత్యేకంగా తయారు చేసిన చీరను ధరించి ఆంధ్రప్రదేశ్ మీద తనకున్న ప్రేమను తెలియజేశారు. 2019లో ప్రవేశ పెట్టిన తన తొలి బడ్జెట్ ప్రసంగం నాడు మంగళగిరి గులాబీ రంగు చీరను నిర్మలా సీతారామన్ ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు. 2024లో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా తెలుపు రంగు, బంగారు మోటిఫ్స్‌తో కూడిన మెజంటో బోర్డర్ సిల్క్ చీరను ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా బులుగు రంగు చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. ఆ చీరపైన గోధుమ కలర్‌లో బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో నిండి ఉంది. అయితే ప్రత్యేకంగా చేనేతన్నలు తయారు చేసిన ఈ చీరను అయోధ్య బలరాముడి విగ్రహ ప్రతిష్టకు ప్రతీకగా తాను ధరించినట్లు నాడు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక 2023 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఎరుపు రంగు, టెంపుల్ బోర్డర్‌తో స్పెషల్‌గా తయారు చేసిన చీరను నిర్మలా సీతారామన్ ధరించారు.
అంతకు ముందు 2022 ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడు ఒడిశా రాష్ట్రానికి చెందిన చీరను ధర్మించారు. మెరూన్ రంగులో దీనిని చేనేతన్నలు ప్రత్యేకంగా తయారు చేశారు. దాని కంటే ముందు 2021లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో తెలంగాణ నేతన్న చీరను ధరించారు. రెడ్–బ్రౌన్ రెండు రంగులు కలగలిపిన భూదాన్ పోచంపల్లి చీరను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాని కంటే ముందు 2020లో ఆస్పిరేషన్ ఇండియా ఇతివృత్తంతో ప్రత్యేకంగా రూపొందించిన నీలి రంగు అంచులు కలిగిన పసుపుపచ్చ–బంగారు వర్ణం కలిగిన చీరను ధరించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన చీరలను ధరించడంలోను, అన్ని రాష్ట్రాల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పడంలోను, అన్నింటికి మించి తాను భారతీయ మహిళలను అని గర్వంగా చాటి చెప్పడంలోను, ఆ రాష్ట్రాలకు చెందిన చేనేత రంగంపై తనకున్న గౌరవాన్ని చాటి చెప్పడంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తనకు తానే సాటిగా నిలిచారు.