
గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ప్రారంభం
తిరుపతిలో కొలువైన ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో టీటీడీ నిత్యాన్నదానం ప్రారంభమైంది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్- తిరుపతి
తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆకలి అనే పదానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ప్రపంచంలో ఏ ధార్మిక సంస్థ నిర్వహించని రీతిలో టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తిరుమలలో 2000 మందికి అన్నదానం చేసే దిశగా ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం.. టీటీడీ అనుబంధ ఆలయాలకు కూడా విస్తరిస్తోంది.
అందులో భాగంగా ఈపాటికే తిరుచానూరు, ఆ తర్వాత కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం వద్దకు కూడా అన్నదాన పథకాన్ని టీటీడీ అమలు చేస్తోంది తాజాగా తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో కూడా ఈ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
గుర్తుకొస్తున్నాయి
"తన చిన్నతనంలో సాయంత్రం పూట శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్దకు అన్నప్రసాదం కోసం వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి" అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. "ప్రసాదాల కోసం వచ్చిన నేను ఇవాళ టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఈ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం" మనసుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఉన్న మ్యూజియంలో గురువారం టీటీడీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డి తో కలిసి పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గతంలో తాను టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. తిరుమలలో ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు రోజూ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అన్నదాన ప్రసాదం అందిస్తారనీ టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, శ్రీ చిన్న జీయర్‌స్వామి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ ఎ అండ్ సీఎఓ బాలాజీ, సీఇ శ్రీ నాగేశ్వరరావు, సీపీఆర్వో డా.టి.రవి, డెప్యూటీ ఈఓలు శ్రీమతి శాంతి, శ్రీ రాజేంద్ర కుమార్, విజిఓ శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2 వేల మంది కోసం ప్రారంభించి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తరువాత అన్నదాన సత్రంలో తీసుకునే ఆహారం ప్రసాదంగా భావిస్తారు. ఇక్కడ ఇక్కడ ఎలాంటి తరతమ భేదాలు ఉండవు. పండితుల నుంచి పామరుడి వరకు. పేదవాడి నుంచి బంగారు పళ్లెంలో భోజనం చేసే వారి వరకు.. అందరూ సహపంక్తిలో కూర్చొని విస్తరిలో భోజనం చేయడం ద్వారా ఆస్వాదిస్తారు.
శ్రీవారి ఇంట తమకు లభించిన ఆతిథ్యంగా ఆనందిస్తారు. తిరుమలలో 2000 మందికి అన్నదానం చేసే మహత్తర కార్యక్రమానికి 1982లో టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రం ద్వారా రోజు 60 నుంచి 70 వేల మంది భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేస్తున్నారు.
ఇదే కాకుండా తిరుమలలో పాత అన్నదాన ప్రసాద భవనంతో పాటు, పిఎసి- 1 పిఎసి- 2 కు కూడా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని విస్తరించారు. ఇవి కాకుండా రోజు.. పి ఏ సి- 1, రాంబాగీచా బస్టాండ్, సెంటర్ రిజర్వేషన్ ఆఫీస్ ( సీఆర్ ఓ) వద్ద కూడా రద్దీ రోజుల్లో ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేస్తూ ఉంటారు.
అనుబంధ ఆలయాలకు విస్తరణ
తిరుమలలో అన్నదాన కేంద్రాలను విస్తరించిన టీటీడీ అధికారులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయాన్ని రెండో భద్రాద్రిగా పరిగణించారు. ఇక్కడ ఏటా స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద కూడా అన్నదాన కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది.
Next Story