బీసీ సాధికారత అనేది వైఎస్సార్‌సీపీలో లేదు. కేవలం మాటలకే పరిమితం అంటూ ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్సార్‌సీపీపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీలో అసలు లేదని దుయ్యబట్టారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న వైఎస్సార్‌సీపీ 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్‌లకు చైర్మన్‌లు, డైరెక్టర్‌లను ఏర్పాటు చేసింది. వారికి జీతాలు ఇస్తున్నది. బీసీ సాధికారత అంటే ఇదేనా? ఏ కార్పొరేషన్‌కైనా ఒక్కరూపాౖయెనా రిలీజ్ చేశారా? సంక్షేమ పథకాల అమలు అనేది బీసీ కార్పొరేషన్‌ల ద్వారా జరగాలి కదా అదెక్కడైనా జరిగిందా అంటూ ప్రశ్నించడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
బీసీ అధ్యయన కమిటీ నేతగా జంగా
జంగా కృష్ణమూర్తి మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీలో ఉంటూ బీసీలకు కావాల్సిన సాధికార న్యాయంపై స్పందించి పనిచేశారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షనిగా ఉంటూ బీసీలకు కావాల్సిన సామాజిక న్యాయం, వర్గాల వారీగా వారికి కావాల్సిన సౌకర్యాలు, గ్రూపుల వారీగా ఏయే కులాల పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై ఆయన ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్‌కు ఒక నివేదిక అందజేసిన వారిలో ప్రథముడు జంగా కృష్ణమూర్తి.
ఎందుకింత అసంతృప్తి
గురజాల నియోజవర్గం నుంచి గతంలో జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. అప్పట్లో జంగాకు వైఎస్సార్ ఎంతో గౌరవం ఇచ్చారు. రానురాను గురజాల నియోజకవర్గంలో కమ్మ, ఎస్సీ వర్గాల ప్రాబల్యం పెరుగుతున్నందున జంగాను పక్కకు నెట్టి గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కుమారుడు కాసు మహేష్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు వైఎస్ జగన్. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ వేవ్‌లో ఆయన గెలుపొందారు. అప్పటి నుంచి జంగాకు, మహేష్‌రెడ్డికి మధ్య వార్ మొదలైంది. 2014లో ఓటమి పాలైన జంగాకు ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ అవకావం కల్పించారు. అయితే గురజాల నియోకవర్గంలోని తన వెంట ఉండే పార్టీ వారు కానీ, తన అనుచరులకు కానీ ఏదైనా పనిపై అధికారులకు ఫోన్ చేసినా, లెటర్ ద్వారా చెప్పినా నావైపు నుంచి ఏ పనీ జరగకుండా ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఇప్పటికే అనేకసార్లు జంగా ప్రశ్నించారు. దీనిని కూడా అధిష్టానం పట్టించుకోలేదు.
బీసీల ఆత్మగౌరవ పోరాటం
వైఎస్సార్‌సీపీ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోందని జంగా కృష్ణమూర్తి సోమవారం మరోసారి బరస్ట్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్నదేమిటి? ఎక్కడుంది బీసీలకు సాధికారత, బీసీలకు సాధికరాత నేతి బీరకాయలో నెయ్యిలాంటిదని ఎద్దేవా చేశారు. బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. బీసీలు వైఎస్సార్‌సీపీకి దూరమవుతున్నారని, దీనిపై పునరాలోచించుకోవాలని స్పష్టం చేశారు. పదవులన్నీ ఒకే సామాజికవర్గం చేతిలో ఉన్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గౌరవం లేని చోట ఉండలేం..
వైఎస్సార్‌సీపీలో బీసీలకు కనీస గౌరవం లేదని, పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్న సీఎం ఏ ఒక్కరికీ అధికారం ఇవ్వలేదని బీసీలు చాలా మంది మండి పడుతున్నారు. బయటపడి మాట్లాడేందుకు ఇష్టపడని చాలా మంది నాయకులు ఆక్రోశంతో ఉన్నారని జంగా చెప్పడం విశేషం. అందుకే బీసీలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారని, సీఎం నిరంకుశ విధానాలు సహించేందుకు ఇకపై ఎవ్వరూ మిగలరని చాలా మంది బీసీలు మాట్లడుతున్న మాట.
ఒక్కరోజైనా కార్పొరేషన్ చైర్మన్‌లతో మాట్లాడారా?
బీసీల కోసం 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన జగన్ ఐదేళ్లలో ఒక్కరోజైనా బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లతో మాట్లాడారా అంటే లేదని చెప్పాలి. కార్పొరేషన్‌లు అలంకార ప్రాయం. ఒక్క రూపాయి కూడా నిధులు కార్పొరేషన్‌లకు ఇవ్వలేదు. ఈ అంశాలపైనే జంగా గట్టిగా నిలదీశారు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా చచ్చిన పాములా ఉండటం చేతకాదనే అంశాన్ని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం ఆయన ఒక ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. మీడియాతో మాట్లాడకుండా తానే ప్రత్యేంగా వీడియో తీయించి రిలీజ్ చేయడం విశేషం. ఈ స్థాయిలో జంగా జగన్‌పై ధ్వజమెత్తిన తరువాత పార్టీలో ఆయన కొనసాగటం కష్టమనే వాదన కూడా తెరపైకి వచ్చింది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ జంగా ఎప్పుడు సస్పెండ్ అవుతాడోనని పలువురు చర్చించుకుంటున్నారు. జంగా విషయంలో ఇప్పటి వరకు అధిష్టానం మాటమాత్రమైనా స్పందించలేదు.
Next Story