దసరాకు బోనస్ లేదు.. దీపావళికి జీతాల్లేవ్ !
కుతకుతలాడుతున్న విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదంటున్న కార్మికులు. ఉక్కు కర్మాగారం ఆర్థిక సంకటం ఫలితం.
ఒకప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అంటే ఎంతో గౌరవం ఉండేది. ఏ స్థాయి ఉద్యోగైనా 'నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్నాను' అని సగర్వంగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎంత త్వరగా ఆ కర్మాగారం నుంచి బయట పడతామా? అంటూ రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రైవేటీకరణ భూతం ఒకవైపు.. ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో తెలియని భయం మరోవైపు.. వెరసి దినదిన గండం.. దీర్ఘాయుష్షు మాదిరి కాలం గడుపుతున్నారు అక్కడి కార్మికులు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక సంకటంలో ఉంది. దీని ఫలితంగా ఈ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించినప్పట్నుంచి ఈ దుస్థితి దాపురించింది. క్రమంగా ఈ ప్లాంట్ భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది. నష్టాల ఊబిలోనూ కూరుకుపోతోంది. ఈ కర్మాగారం మళ్లీ మునుపటి స్థితికి చేరుకుంటుందన్న నమ్మకం, విశ్వాసం అందులో పనిచేస్తున్న
వారిలో ఏ కోశానా కనిపించడం లేదు.
నాలుగేళ్లరేళ్ల నుంచి ప్రైవేటీకరణ చేయొద్దు మొర్రో అంటూ కార్మికులు అంతెత్తున గొంతెత్తుతూనే ఉన్నారు. కానీ వారి ఘోష స్టీల్ ప్లాంట్ గోడలకే పరమితమవుతోంది. ప్రైవేటీకరణ చేయొద్దని, లేదంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలని చేస్తున్న నినాదాలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఏమాత్రం కదలించడం లేదు. రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు, పొంతన లేని మాటలు చెబుతున్నారు. ఒకరు ప్రైవేటీకరణ ఆగదని అంటే, మరొకరు అందుకు విరుద్ధంగా ఏంచేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నామని మరొకరు చెబుతూ వస్తున్నారు. రాష్ట్రానికి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి అయ్యారు.
దీంతో ఇక మన విశాఖ ఉక్కు చెక్కు చెదరదని అంతా సంబరపడ్డారు. కానీ మంత్రి అయ్యాక ఆయన వ్యవహార శైలిని చూసి అలాంటి అనుమానాలు, నమ్మకాలు సన్నగిల్లాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ముందు ఒకలా, ఇప్పుడొకలా మాట్లాడుతుండడం కార్మికుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఏది అవసరమో అది కాకుండా, ఈ ప్లాంట్ నిలదొక్కుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టకుండా ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ప్లాంట్ నష్టాల పాలవడానికి ముడి సరకు కొరత ప్రధాన కారణమని ఎప్పట్నుంచో అందరికీ తెలిసినా దానిపై దృష్టి సారించకుండా ఎలా ప్రైవేటీకరణ చేయాలన్న దానిపైనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోంది.
ఫలితంగా మూడు బ్లాస్ట్ ఫర్నేస్ చాన్నాళ్ల నుంచి ఒక్కటంటే ఒక్కటే నడిచే స్థితికి వచ్చింది. దీంతో రోజుకు 20 వేల టన్నులకు పైగా ఉక్కు ఉత్పత్తి జరిగే ఈ ప్లాంట్‌లో మూడో వంతుకు పడిపోయింది. దీంతో ప్లాంట్‌కు ఆదాయం క్షీణించింది. నిర్వహణ వ్యయం, సిబ్బంది జీత భత్యాలు పెరుగుతూ వస్తోంది. సవాలక్ష అవాంతరాలు, సవాళ్లను అధిగమించి మరో రెండు నెలలకు సరిపడినంత ముడి సరుకు (ఐరన్ ఓర్, బొగ్గు) నిల్వలను సంపాదించుకో గలిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరో బ్లాస్ట్ ఫర్నేస్ ను పునరుద్దరించింది. అయితే రెండు నెలల తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
ఇప్పటికే వదిలించుకునే ప్రయత్నాలు!
ఒకప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 20 వేల మందికి పైగా ఉద్యోగులు/కార్మికులు ఉండే వారు. ఇప్పుడా సంఖ్య 12,600కి పడిపోయింది. ఈ ఏడాది చివరికి 1025 మంది, వచ్చే ఏడాది ఆఖరుకి 1200 మంది, 2026 డిసెంబర్‌కి 1400 మంది పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే డిసెంబర్ నాటికి మరో 2500 మందిని వీఆర్ఎస్తో ఇంటికి పంపనున్నారు. చత్తీస్‌గఢ్ నాగర్నార్ లో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్‌కు ఇక్కడ నుంచి 500 మంది ఎగ్జిక్యూటివ్‌లను డెప్యుటేషన్ పేరిట తరలిస్తున్నారు. ఇవన్నీ చూస్తే రానున్న ఏడాదిన్నరలో ఈ ప్లాంట్‌లో కార్మికుల సంఖ్య ఎనిమిది వేలకు పరిమితం కానుంది. ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత ప్లాంట్‌లో ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లింపులు జరగడం లేదు. అధికారులకిచ్చే అలవెన్సుల్లోనూ యాజమాన్యం 6 శాతం కోత విధించింది. మరోవైపు 2021 నాటికి రూ.920 కోట్ల లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతేడాదికి రూ.4,500 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. ఈ నాలుగున్నరేళ్లలో రూ.20 వేల కోట్లకు పైగా అప్పుల పాలైంది.
బోనస్సే కాదు..జీతాలూ లేవు..
ఏటా దసరాకు విశాఖ ఉక్కు కార్మికులకు బోనస్ ఇచ్చేవారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఎంత ఇస్తే ఇక్కడ అంత బొనస్ చెల్లించేవారు. ఈ ఏడాది భిలాయ్ కర్మాగారం రూ.26 వేల చొప్పున దసరా బోనస్ ఇచ్చింది. అంటే క్యాడరుతో పనిలేకుండా వైజాగ్ స్టీల్స్టాంట్ కార్మికులకు కూడా రూ.26 వేలు ఇవ్వాల్సి ఉన్నా యాజమాన్యం ఇవ్వడం మానేసింది. అయినా ప్లాంట్ పరిస్థితిని బట్టి ఉద్యోగం ఉంటే చాలు.. అదే పదివేలు! అని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా దసరాకు బోనస్ లేదు.. దీపావళికి జీతాల్లేవు.. అంటూ ఉక్కు కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ఈ స్టీల్స్టాంట్ ఉద్యోగులకు నెలకు జీతాలకు సుమారు రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్లాంట్ సంక్షోభంలో ఉండడంతో ఈ మొత్తాన్ని చెల్లించలేని స్థితికి చేరుకుంది. 'ఇలాంటి పరిస్థితి ప్లాంట్ పరిస్థితిలో ఎప్పుడూ లేదు.. ఇళ్లు, వాహనాలకు చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర అవసరాలు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.. మా ఉద్యోగాలెన్నాళ్లుంటాయో కూడా తెలియడం లేదు.. కుటుంబ సభ్యులు కూడా ప్లాంట్‌తో పాటు మా భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు' అని సత్యనారాయణ అనే కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒక్క సత్యనారాయణ ఆవేదనే కాదు.. దాదాపు ఈ స్టీల్ ప్లాంట్‌లో అత్యధికులు ఇదే ఆందోళనతో ఉన్నారు. ఉక్కు ద్రవంలాగే లోలోన కుతకుతలాడుతున్నారు.