
KUPPAM | ఇది బాబు అడ్డా.. జగన్ వేడుకలకు నో ఛాన్స్
కుప్పంలో జగన్ జన్మదిన వేడుకలపై ఆంక్షలు విధించారు. ముందస్తు దరఖాస్తు చేసినా, పోలీసులు అనుమతించలేదు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ నేతలపై పెత్తనమే సాగుతుంది. అది కడప జిల్లా పులివెందుల. చిత్తూరు జిల్లా కుప్పం అయినా ఇదే పరిస్థితి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో మాత్రం పోలీసులు అందుకు అనుమతించలేదు. కుప్పం అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ వేడుకలు నిర్వహించడానికి వీలులేదని పోలీసులు ఆంక్షలు విధించారు.
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్. జగన్ జన్మదిన వేడుకలు కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ భరత్ పోలీసుల అనుమతి కోరుతూ లేఖ ఇచ్చారు.
"కుప్పంలో పరిస్థితి సున్నితంగా ఉంది. అందువల్ల బహిరంగంగా జన్మదిన వేడుకలకు అనుమతి ఇవ్వలేం" అని కుప్పం డీఎస్పీ పార్థసారథి వైసీపీ నాయకులకు సమాధానం ఇచ్చారు. "కుప్పంలో వైఎస్. జగన్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడానికి వీలు లేదు" అందుకు ఆయన చూపిన కారణం ఒకటే.
కుప్పం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎన్. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. దీంతో ఇక్కడ టీడీపీ నాయకుల శాసనాలు చెల్లుబాటు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో..
"సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన పూర్తయ్యే వరకు సంబరాలు నిర్వహించడానికి వీలు కాదు" అని డిఎస్పి వైసీపీ నాయకులకు ఇచ్చిన లేఖలో స్పష్టం చేశారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ప్రధానంగా కుప్పం పట్టణంలో తమ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వ్యక్తిగత కార్యదర్శి మురుగేష్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.
కుప్పం డఎస్పి పార్థసారథి తీరు ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. "టిడిపి ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును రోడ్డుపై కూర్చునేలా చేశారు" అని డి.ఎస్.పి గుర్తు చేశారని ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్ ఆరోపించారు.
తిప్పలు తెచ్చిన 'వై నాట్ కుప్పం'
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. ఇక్కడ పాగా వేయాలనే లక్ష్యంగా ఆ బాధ్యతలను పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రాంగం సాగించారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీకి ఎమ్మెల్సీ భరత్ ను దించిన విషయం తెలిసిందే.
2019 ఎన్నికల తర్వాత నుంచి కుప్పంలో వైసీపీ నేతలు ఆడింది ఆటగా సాగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేవుడెరుగు. టీడీపీ శ్రేణులను టార్గెట్ చేశాయి. చివరికి కుప్పం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్. చంద్రబాబు పర్యటన సమయంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ వ్యవహారంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయిన సంఘటన అనేకం చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో..
2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కుప్పంను టిడిపి నాయకులు ఆధీనంలోకి తీసుకున్నారు. యథావిధిగా తమ కార్యకలాపాలను సాగించడానికి రంగంలోకి దిగారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ కుప్పం మున్సిపల్ చైర్మన్ సహా తొమ్మిది మంది కౌన్సిలర్లు టిడిపిలోకి జంప్ అయ్యారు. గతంలో వైసిపికి వెళ్లిన నాయకులు కూడా సొంత గూటికి చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పంలో వైసిపి ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవన్నీ పరిశీలిస్తే కుప్పం నియోజకవర్గంలో టిడిపి శ్రేణుల ఆదిపత్యం మళ్లీ ప్రారంభమైనట్లే. దీంతో వైసిపి క్యాడర్, కొందరు నాయకులు ఉన్నప్పటికీ ఆంక్షలు చట్రంలోనే తిరగాల్సిన అనివార్యమైన పరిస్థితిని వారికి వారే కల్పించుకున్నారనే విషయం గత సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న కాలంలో ఇంకెన్ని అనుభవాలు ఎదురవుతాయి అనేది వేచి చూడాల్సిందే.
Next Story