గిట్టుబాటు ధరా లేదు, పట్టించుకునే దిక్కూ లేదు!
x

గిట్టుబాటు ధరా లేదు, పట్టించుకునే దిక్కూ లేదు!

రైతుల మనసు ఎంత కష్టపడితేనో తప్ప తాము పండించిన పంటల్ని చంపుకోరు. ఇప్పుడా పరిస్థితి ఎదురైంది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి. ఏ పంటా గిట్టుబాటు లేదని రైతులు వాపోతున్నారు


ఆరుగాలం కష్టపడిన రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ సుఖసంతోషాలతో ఉన్నారని పాలకులు చెబుతుంటే.. ఎంతో శ్రమకోర్చి పండించిన పంటల్ని అవే చేతులతో ధ్వంసం చేస్తున్నారు. మరికొందరైతే తమ కాయకష్టం ఊరికే పోవడం ఇష్టం లేక బండ్లమీద తీసుకువచ్చి ఇల్లిల్లూ తిరిగి ఉచితంగా పంచి పెండుతున్నారు.
నిన్నటికి నిన్న (2025 ఫిబ్రవరి 14)న విజయవాడకు సమీపంలోని రైతులు తాము పండించిన క్యాబేజీకి గిట్టుబాటు లేదంటూ రొటోవేటర్లతో పంటను దున్ని నిరసన తెలిపారు.

ఫిబ్రవరి 12న అదే కృష్ణా జిల్లాలో రైతులు వంకాయల్ని తీసుకొచ్చి రోడ్ల మీద పోసి తొక్కించేశారు. టమాటా రైతుల గోడు వినేవారే లేకుండా పోయారు. అయినా రాష్ట్ర వ్యవసాయ శాఖ బాధ్యులు అంతా బాగుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిర్చి, కంది, టమాట, క్యాబేజీ, వంగ ఇలా చాలా పంటలకు మద్దతు ధర కూడా లేకుండా పోయింది. మిర్చి ధర అమాంతం పడి పోయి నేలచూపులు చూస్తోంది. కంది పంటకు మద్దతు కొరవడింది. టమాటా, వంగ, ఇతర కూరగాయలకూ కిలోకు రూ.5 కూడా దక్కడం లేదు. కోత కోయించి మార్కెట్‌కు తీసుకెళ్లాలంటేనే.. రైతులు వణికిపోతున్నారు.
రైతుకు ప్రయోజనం కల్పించే దిశగా నిర్దిష్ట చర్యల్లేవని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. పైగా ఇప్పుడు లభిస్తున్న ధరలతో రైతులకేమీ నష్టం రాదని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు ప్రభుత్వానికి నివేదికలిస్తున్నాయి. సీఎం యాప్‌ ద్వారా ఎక్కడెంత ధరలు ఉన్నాయో తమకు ఇట్టే తెలిసిపోతుందని, వెంటనే జోక్యం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా ఆచరించే నాధుడే కరవయ్యారు. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రికి వ్యవసాయం కన్నా ఇతరత్రా రాజకీయాలపైన్నే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని రైతు సంఘం నేత జి.దివాకర్ ఆరోపించారు. అగ్రి వాచ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), డీప్‌ లెర్నింగ్, అనలిటిక్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామంటున్నారు తప్పితే.. క్షేత్రస్థాయిలో రైతులు ధరల్లేక కుంగిపోతున్నారని, నష్టాల ఊబిలోకి చేరుతున్నారనే దాచిపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మిర్చి ధర నేల చూపులు...
అధికశాతం మిరపపంటకు ధర కూడా క్వింటాల్‌కు రూ.9వేల నుంచి రూ.11వేల లోపే. అధికారులు మాత్రం రూ.12వేల నుంచి రూ.14వేల వరకూ ఉన్నట్లు లెక్కలిస్తున్నారు. వాస్తవానికి సన్న రకాలకు ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రూ.2 లక్షలే వస్తుంది. ఎకరానికి పెట్టుబడి వ్యయం రూ.2.75 లక్షల వరకూ ఉంటోంది. అంటే ఎకరానికి రూ.75 వేలు నష్టమే. ఇతర మిరప రకాలకైతే నష్టం రూ.లక్షకు పైగానే ఉంది.
రాష్ట్రంలో ఈ ఏడాది 3.94 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. ఎకరానికి రూ.2.75లక్షల ప్రకారం మొత్తం రూ.10,835కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత ధరలకు అమ్మితే రూ.3వేల కోట్ల మేర నష్టమే. మిరప క్వింటాలుకు ఉత్పత్తి వ్యయం రూ.10,400 మాత్రమే అని కేంద్రం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.11,600 చొప్పున లెక్క కట్టింది. కనీసం రూ.15వేలు అయినా ఉంటేనే గట్టెక్కుతామని రైతలు అంటున్నారు.
రైతులకన్నీ కూర'గాయాలే'
మార్కెట్లో టమాటా కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున అమ్ముతున్నారు. కానీ కర్నూలు,చిత్తూరు, విజయనగరం జిల్లాలలో రైతుకు కిలోకి 3 నుంచి రూ.5 కూడా దక్కడం లేదు. వంకాయ మార్కెట్లో కిలో రూ.10 నుంచి రూ.12 పెట్టి కొనాల్సిందే. రైతుకు రూ.4 మాత్రమే ఇచ్చి కొంటున్నారు. క్యాబేజీ, ఇతర కూరగాయల పరిస్థితీ ఇంతే.. ధరలు దక్కక రైతులు పంటను దున్నేస్తున్నారు. ‘15 కిలోల వంకాయలు(పెట్టె) మార్కెట్‌కు తీసుకువెళితే రూ.60 మాత్రమే ఇస్తున్నారు. కోతకు రూ.30, అశీలు రూ.10, ఆటోకు రూ.10 చెల్లించాలి’ అని కృష్ణా జిల్లాకు చెందిన రైతు వెంకట నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.7,550. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.6వేలు మాత్రమే లభిస్తోంది. మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుందామంటే నాణ్యంగా లేదని, తేమ ఎక్కువగా ఉందని అక్కడ కొర్రీలేస్తున్నారు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్‌లోనే అమ్ముకుంటున్నారు. 95 వేల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా.. 10వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అదీ నాలుగు జిల్లాల్లోనే. పంట చేతికొచ్చినా ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సేకరణ ప్రారంభం కాలేదు.
మొక్కజొన్న కిందకు: మొక్కజొన్న వారం కిందట క్వింటాలుకు రూ.2,300 చెల్లించి కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.2,100 చొప్పునే అడుగుతున్నారు. కర్నూలు మార్కెట్లో వాముకు క్వింటాలుకు సగటున రూ.10వేల నుంచి రూ.12వేల వరకూ మాత్రమే లభిస్తోంది. కనీసం రూ.15వేలు ఇస్తేనే గిట్టుబాటు అని రైతులు పేర్కొంటున్నారు. పెసర ధర కూడా మద్దతు ధర కంటే రూ.200 తక్కువగా ఉంది.
బోరుమంటున్న సుబాబుల్ రైతులు...
సుబాబుల్, జామాయిల్‌ కర్ర ధరలూ క్రమంగా తగ్గుతున్నాయి. సుబాబుల్‌ టన్ను ఇటీవల వరకు టన్ను రూ.7 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.6 వేలు మాత్రమే లభిస్తోంది. జామాయిల్‌ ఇటీవలి వరకు రూ.6,500 చొప్పున అమ్మగా.. ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.5,500 మాత్రమే ఇస్తున్నారు. కావాలనే వ్యాపారులు తగ్గిస్తున్నారు.
సమీక్షలతో సరి.. రైతుకు ఊరటేదీ?
కందికి మద్దతు ధర దక్కడం లేదని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని రెండు నెలల కిందట అధికారులు ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. రూ.100 కోట్లు ఇస్తే సేకరణ ప్రారంభిస్తామని చెప్పినా.. ఆర్థికశాఖ ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో నాఫెడ్‌ ద్వారా ఆలస్యంగా సేకరణ ప్రారంభించారు. అదీ నిబంధనల పేరుతో రైతుల్ని రానివ్వడం లేదు. సొమ్ము చెల్లింపులోనూ జాప్యమే.
"మద్దతు ధరలపై సీఎం మొదలు అధికారుల వరకు అందరూ సమీక్షలు చేస్తున్నా ఫలితమైతే కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో చర్చించామని మొఖం చాటేశారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులు వ్యాపారులతో సమావేశాలన్నారు. అయినా ధరలు మాత్రం పెరగలేదు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుంది. రైతుల్ని మభ్యపెట్టాలని చూసే కన్నా రైతులకు న్యాయం చేయాలి. రైతుల్ని పట్టించుకోకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ పాలకులకూ పడుతుంది" అని కేవీవీ ప్రసాద్ హెచ్చరించారు.
Read More
Next Story