ఇక నుంచి రాష్ట్రంలో ఏ మొక్కలు నాటాలో.. ఏ మొక్కలు నాట కూడదో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. మొక్కలను నాటడంలో ఇప్పటి వరకు ఉన్న కన్‌ఫ్యూజన్‌కు తొలగించింది.


విదేశీ వద్దు.. స్వదేశీనే ముద్దు అనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ మొక్కలు నాటాలో.. ఏ మొక్కలు నాట కూడదో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. విదేశీ జాతులకు చెందిన మొక్కలను నాట కూడదనే నిర్ణయాన్ని ప్రకటించింది. మరి ముఖ్యంగా వాటిల్లో కోనో కార్పస్, ఏడు ఆకుల ఫల, మడగాస్కర్‌ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి ప్లాంట్స్‌ నాటొద్దని, వీటి వల్ల పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూ గర్భ జలాల మీద తీవ్ర ప్రభావం చూపుతోందని, అందువల్ల వీటిని నాటొద్దని ప్రకటించింది.

కోనో కార్పస్‌ను తొలుత ప్రపంచానికి పరిచయం చేసిన అరబ్‌ దేశాలే దాని వల్ల కలిగే నష్టాలను గుర్తించి నిషేధించాయి. అయితే ఇది వరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఇండియాలో ఈ మొక్కను పెద్ద ఎత్తున నాటారు. చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉండే ఈ మొక్కను నాటేందుకు పోటీలు పడ్డారు. అయితే ఇప్పుడు తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అసోం ప్రభుత్వాలు కూడా మొక్కను నిషేధించాయి. అంతేకాకుండా కోనో కార్పస్‌ చెట్టును పశువులు తినవు, పక్షులు గూడు పెట్టుకోవు, చెట్లను ఆశ్రయించే క్రిములు, కీటకాలు ధరి చేరవు, పక్షలైతే గూళ్లు కూడా కట్టుకోవు. పశు పక్షాదులకు ఉపయోగ పడని ఇలాంటి మొక్కలను నాటడం, పెంచుకోవడం మంచిది కాదని ప్రభుత్వం ప్రకటించింది.

వీటికి బదులుగా జీవ ఇంధనంగా ఉపయోగపడే స్వదేశీ జాతులైన మొక్కలను నాటాలని, పెంచుకోవాలని స్పష్టం చేసింది. స్థానిక వాతావరణానికి అనుకూలంగాను, ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలను నాటాలని నిర్ణయించింది. వాటిల్లో కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, ధిరిసెన, రేలా, సీత అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్ల మద్ది, మామిడి, కదంబ, జమ్మి, వెలగ, సీతాఫలం వంటి స్వదేశీ జాతి మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇళ్లల్లో కూడా ఇలాంటి మొక్కలను పెంచుకోవాలని స్పష్టం చేసింది. వన మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆమేరకు శుక్రవారం పిలుపు ఇచ్చారు.
Next Story