
Pemmasani
అమరావతి రైతుల కోపతాపాలపై మంత్రుల ఆపసోపాలు
అప్పులిప్పించి శాంతింపజేయాలనే ఆలోచన సక్సెస్ అయ్యేనా?
రాజధాని అమరావతి రైతుల్లో రోజురోజుకీ అసహనం పెరిగిపోతోంది. ఇచ్చిన భూములకు పట్టాలు లేవని కొందరు, ప్లాట్లు కేటాయించినా అవి ఎక్కడో తెలియవని మరికొందరు, ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా రాజధాని ప్రాంత రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మందడం గ్రామంలో రామారావు అనే రైతు కుప్పకూలి మరణించారు. దీంతో రైతుల ఆవేదన, ఆక్రోశం ఆకాశాన్ని అంటింది. పరామర్శకు వెళ్లిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు రైతులు ముచ్చెమటలు పట్టించారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఎలా శాంతింపజేయాలనే దానిపై రాజధానిపై ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ భేటీ అయింది. ఏదో ఒక ప్రయోజనం చేకూర్చకపోతే రైతుల ఆగ్రహావేశాలను అదుపు చేయడం కష్టమనే నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగమే లింక్ డాక్యుమెంట్లు లేకుండానే అమరావతి రైతులకు రుణాలని ప్రకటించినట్టు తెలుస్తోంది.
అసలేమిటీ వివాదం..
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి నిరసన సెగ తగిలింది. నిన్న మందడం గ్రామసభలో మరణించిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వల్లే రైతు రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది..
రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..
‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ తీవ్ర స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.
ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు.
అడ్డుతగిలిన శ్రావణ్ కుమార్ ...
రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
త్రిసభ్య కమిటీ సమావేశం...
ఈ ఘటన జరిగిన తర్వాత శనివారం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైంది. రైతు రామారావు మరణం, తర్వాత పరిస్థితిని సమీక్షించింది. రైతులకు లబ్ధి చేకూరేలా ఏదైనా చేయాలని నిర్ణయించింది. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) మీడియాతో మాట్లాడుతూ.. జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందన్నారు. జరీబు భూములపై జెన్యూన్‌గా ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కమిటీ రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పది సెంట్లు కంటే తక్కువ ప్లాట్లు ఉన్నవాళ్లు 415 మంది ఉన్నారని... వారి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 2013 కంటే ముందు భూములు ఇచ్చిన రైతులు కూడా తమను ల్యాండ్ పూలింగ్ కింద పరిగణించమని అడుగుతున్నారని... కానీ అవి చట్టపరంగా సాధ్యం కావడం లేదని కేంద్రమంత్రి అన్నారు.
జరీబు, నాన్ జరీబు భూములపై రాష్ట్ర కమిటీ...
జరీబు, నాన్ జరీబు భూములపై (జరీబు అంటే బావులు, ఇతరతరా నీటి వనరులతో సాగుచేసే భూములు) రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం భూములకు సంబంధించి కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్‌లో 42మంది మార్పులు కోరారని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్ మార్చుకోవాలనుకునే అన్నదాతలు దరఖాస్తు చేసుకుంటే వాటిని మారుస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
రైతులకు రుణాలు ఇచ్చేలా ఏర్పాటు...
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు 30 ఏళ్లపాటు లింక్ డాక్యుమెంట్‌లు అడగకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్‌డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు. రాజధాని రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రవణ్‌కుమార్, మంత్రి నారాయణ.. సీఆర్‌డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలిక్కి తీసుకొస్తామని పెమ్మసాని తెలిపారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జరీబు భూముల సమస్యపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీబు రైతులకు న్యాయం చేస్తామన్నారు. లంక భూముల రిజిస్ట్రేషన్‌కు 277 మంది నమోదు చేసుకోవాల్సి ఉందని, వారంతా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అసైన్డ్ భూముల న్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు.
రుణాలు ఇచ్చేదాకా అనుమానమే...
సాధారణంగా బ్యాంకులు వ్యవసాయ రుణాలు (Crop Loans/Agri Loans) ఇచ్చేటప్పుడు లింక్ డాక్యుమెంట్లు (Link Documents) అడిగే అవకాశం ఎక్కువ. అయితే అది మనం తీసుకునే అప్పు రకాన్ని బట్టి, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లింక్ డాక్యుమెంట్లు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. దానికైనా పట్టాదారు పాస్ బుక్ (E-Passbook) అవసరమని బ్యాంకు మాజీ అధికారి ఒకరు చెప్పారు. భూమి వివరాలు స్పష్టంగా ఉంటే, కొన్ని బ్యాంకులు కేవలం పాస్ బుక్, 1B/అడంగల్ ఆధారంగా రుణాలు ఇస్తాయి.
రాజధాని రైతులకు ఇచ్చే ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. రైతులకు గత 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సమ్మతించాయని, సీఆర్డీఏ (APCRDA) జారీ చేసే LPOC (Land Pooling Ownership Certificate) లేదా కేటాయింపు పత్రాల ఆధారంగానే రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే దీనికి ఆయా బ్యాంకుల ప్రధాన కేంద్ర కార్యాలయాల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC), లీడ్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అన్ని బ్యాంకు శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలి.
ప్లాట్లు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల బ్యాంకర్లు లేవనెత్తే సాంకేతిక సమస్యలకు ప్రభుత్వం పూచీ పడాల్సి ఉంది. ఈమేరకు సీఆర్డీఏ లేఖలు అందజేయాలి.
రైతులు రుణాల కోసం ఏమి చేయాలి?
రైతులు తమకు కేటాయించిన ప్లాట్లకు సంబంధించిన LPOC (ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్) సిద్ధంగా ఉంచుకోవాలి.
సమీపంలోని జాతీయ బ్యాంకులు (Nationalized Banks) లేదా లీడ్ బ్యాంకును సంప్రదించి, ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుల గురించి ఆరా తీయాలి.
చాలా వరకు బ్యాంకులు ఇళ్ల నిర్మాణం (Home Loan) లేదా ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఈ ప్లాట్లను తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తాయి.
ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా, బ్యాంకు గడప దాటి సామాన్య రైతు చేతికి చేరినప్పుడే ఈ సంక్షోభానికి అసలైన పరిష్కారం లభిస్తుంది.
Next Story

