గత ప్రభుత్వం తవ్వి స్టాక్ పాయింట్లలో ఉంచిన ఇసుకను నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం అమ్మేసింది. ఇక నుంచి ప్రైవేట్ వారు ఇసుక తవ్వి కావాల్సిన వారికి ఇస్తారు.
ఏదైతే జరగకూడదని అనునకుంటున్నామో అదే జరిగింది. ప్రైవేట్ వారికి ఇసుక తవ్వకం, నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. స్టాక్ యార్డుల నిర్వహణ కూడా ప్రైవేట్ సంస్థలే చూస్తాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పాలకులు ఇష్టానుసారం వ్యవహరించారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీల వారు ఇష్టానుసారం వ్యవహరిస్తారు. వారినిపై పర్యవేక్షణ ప్రభుత్వానికి ఉంటుందని ప్రభుత్వం చెప్పినా పార్టీ నాయకులే వినకుండా వ్యవహరిస్తే ఏజెన్సీలు ఎలా వ్యవహరిస్తాయో తెలియంది కాదని పలువురు ఇసుక వినియోగదారులు అంటున్నారు.
క్వారీలు, స్టాక్ పాయింట్ల నిర్వహణ ప్రైవేట్ కు..
ఇసుక తవ్వకాలు చేసే ప్రైవేటు ఏజెన్సీలు విధిగా పర్యావరణ అనుమతులు, రీచ్‌ల నిర్వహణకు అవసరమైన సీటీఈ, సీటీవో అనుమతులు తీసుకోవాలి. ఇసుక తవ్వకాలకోసం మైనింగ్ ప్లాన్ ఆమోదం పొందాలి. దీంతోపాటు పర్యావరణ మార్గదర్శకాలను పాటించాలి. పర్యావరణ అనుమతులు ఏజెన్సీలే పొందాల్సి ఉంటుంది. రీచ్‌ల్లో తవ్వితీసిన ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. ఆ స్టాక్ పాయింట్ల నిర్వహణ బాధ్యతను కూడా ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనున్నారు. అలాగని ఉచిత ఇసుకకు ఎలాంటి ఢోకాలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు ఏజెన్సీలకు ఇసుక తవ్వితీయడం, ఆ తర్వాత స్టాక్ పాయింట్లకు చేర్చే కాంట్రాక్ట్ మాత్రమే ఉంటుంది. స్టాక్ పాయింట్ల నుంచి కావాల్సిన వారికి ఇసుక సరఫరా చేస్తారు. రిటైల్ వినియోగదారులు, భారీగా ఇసుక అవసరం ఉన్నవారు నిర్దేశిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి సీనరేజీ కూడా వర్తిస్తుంది. స్టాక్ పాయింట్ల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఓ ఇన్‌చార్జ్‌ని నియమించనుంది. ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, ఇతర ప్రక్రియలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే సాగాలి.
ఇసుక నిర్వహణ బాధ్యత అంటే ఇసుక కావాల్సిన వారికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీపై ఉంటుంది. ఈ ఏజెన్సీకి ప్రభుత్వం ఏ విధమైన నిర్వహణ ఖర్చులు ఇస్తుందనేది వెల్లడించలేదు. ఇసుక కావాల్సిన వారి నుంచి డబ్బలు తీసుకోకుండా ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ఇసుక వినియోగ దారుల నుంచి డబ్బలు తీసుకోకుండా ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల వారికి ఇసుక ఎలా ఇస్తుందనేది కూడా చర్చనియాంశమైంది.
క్వారీ వద్ద ఇసుక తవ్వినందుకు ప్రొక్లైన్ వారు ఎంత అడిగితే అంత ఇవ్వక తప్పడం లేదు. ఇసుకను బయటకు మోసే వారు టన్నుకు సుమారు రూ. 50లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంతనేది ప్రత్యేకంగా చెప్పలేదు. క్వారీ నిర్వహణ ప్రైవేట్ వారే కాబట్టి తప్పకుండా డబ్బలు ఇవ్వనిది ఇసుక బయటకు రాదు.
ఇసుక రీచ్‌లు లేని జిల్లాల్లో ప్రైవేటు లైసెన్స్‌లు
నదులు, వాగులు, ఇసుక రీచ్‌లు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు మినరల్ డీలర్ లైసెన్స్ (ఎండీఎల్)లు జారీ చేస్తారు. ఎండీఎల్ లైసెన్స్ పొందిన వారు నిర్దేశిత రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లి తమకు కేటాయించిన స్టాక్‌యార్డ్‌లో నిల్వచేయాలి. రిటైల్ వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకుసరఫరా చేయాలి. అంటే ఇసుక ఉచితం ఎలా అవుతుంది. ప్రైవేట్ వారికి ఇసుక రీచ్‌లు అప్పగించడం వల్ల అధికారికంగా కాకుండా అనధికారికంగా తీసుకుపోయే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఇసుక క్వారీలు నడుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఉచిత ఇసుక నిర్వహణ, ధరల నిర్ణయం, నిఘా, నియంత్రణ వంటి అంశాలను జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) ద్వారా ప్రభుత్వం చూసుకోనుంది. స్టాక్‌యార్డ్‌ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లేవారి నుంచి గనుల శాఖ వసూలు చేసే సీనరేజీ, డీఎంఎఫ్, మెరిట్ ఫీజులను ఇకపై వసూలు చేయదు. ఉచిత ఇసుక వినియోగదారులకు ఈ మూడు ఫీజులను మినహాయింపు నిచ్చారు. ఈ కీలకమైన మార్పులతో ప్రభుత్వం సవరించిన ఉచిత ఇసుక పాలసీని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు (జీఓ–66) జారీ చేశారు.
ఉచిత ఇసుక వినియోగదారులపై ఖర్చు భారం తగ్గించేందుకు చట్ట బద్ధమైన సీనరేజీ ఫీజు, డీఎమ్‌ఎఫ్ (జిల్లా ఖనిజ నిధి), మెరిట్ పేరిట ఫీజుల వసూళ్లను మినహాయించారు. దీనివల్ల టన్నుకు కనీసం 88 రూపాయల మేర తగ్గనుంది. 20 టన్నుల లారీకి సీనరేజీ ఫీజు కింద రూ. 1,760 రూపాయలు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని రీచ్‌లు, నదీ తీర ప్రాంతాల నుంచి వ్యక్తిగత, సామాజిక అవసరాలకోసం ట్రాక్టర్, ఎద్దుల బండిపై తీసుకెళ్లే ఇసుకను ఆ గ్రామం పరిధిలోనే వినియోగించాలి. ఇతర గ్రామాలు, ప్రాంతాలకు తరలించ కూడదు. ఇలా గ్రామం పరిధిలో ఇసుక తీసుకెళ్లాలనుకుంటే ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే గనుల శాఖ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. స్థానికేతరులు, సుదూర ప్రాంతాల వారు తమకు సంబంధం లేని గ్రామం నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి వీల్లేదు.
ఆ ఊరి వారు కాకుంటే ఇలా..
రీచ్‌లు అందుబాటులో లేనివారు, ఆ గ్రామానికి చెందని వారు విధిగా ప్రభుత్వం నిర్దేశించిన స్టాక్ పాయింట్ల నుంచే ఉచిత ఇసుక తీసుకెళ్లాలి. ఇందుకోసం ముందుగా ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత స్టాక్ పాయింట్లో బుకింగ్ చేసుకోవాలి. వ్యక్తిగత అవసరాలతో పాటు, భారీగా అవసరం ఉన్నవారు ఈ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే వారు విధిగా స్టాక్ యార్డ్ నుంచి ఈ–ట్రాన్సిట్, పర్మిట్‌లు పొందాలి. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరం తప్పనిసరి.
అక్రమాలు ఆగుతాయా?
రీచ్‌లు, స్టాక్ యార్డ్‌లు ప్రైవేటుకు అప్పగించనున్న నేపధ్యంలో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇసుక యార్డుల వద్ద సీసీటీవీలను ఏర్పాటు చేయనుంది. ఇసుక రవాణాను పర్యవేక్షించేందుకు పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్ ఇబ్బందులు ఉంటే ర్యాంపుల వద్దే ఆఫ్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకుని తీసుకుని వెళ్లవచ్చు. సొంత వాహనాలు తెచ్చుకుంటే టన్ను రూ.345కే ఇసుక వస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. అంటే ఉచిత ఇసుక అనడం సబబు కాదని స్పష్టమైంది.
Next Story