ఈ భాస్కరుడు ఎవరికి పట్టలేదు..!?
x

ఈ భాస్కరుడు ఎవరికి పట్టలేదు..!?

చెప్పులు కుడుతూనే డిగ్రీ చదివిన ఈ వ్యక్తి యువకుల బాధ్యత గుర్తు చేశారు. సమస్యలే అజెండాగా జనం ముందుకొచ్చారు. పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.


అందరూ అతనిని చెప్పులు కుట్టే వ్యక్తిగా మాత్రమే చూశారు. అతని వ్యక్తిత్వం, సమస్యలపై ఉన్న కసి ఎవరికీ కనిపించలేదు. రాజనీతి శాస్త్రం నేర్పిన పాఠాలు, చైతన్యం పొందిన ఆ మాదిగ వ్యక్తి ప్రజల సమస్యలనే అజెండాగా ఎంచుకున్నారు.

"నిరుద్యోగ యువత సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు" నాలుగేళ్లుగా వివరిస్తూ, చైతన్యం చేసిన అజెండాతో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పట్టభద్రుడు ఏడిద భాస్కరరావు పోటీ చేశారు. దీని ద్వారా "ప్రజల బాధ్యతలు ఏమిటి? నిరుద్యోగ యువత కర్తవ్యం గుర్తు చేస్తూ కొన్ని సవాళ్లను సమాజం ముందు ఉంచిన ఏడిద భాస్కరరావు చర్చకు తెర తీశారు. డబ్బు, పలుకుబడి, దర్పం ప్రదర్శించే శక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత ఆ సామాన్యుడి అంతరంగాన్ని కొందరు పసిగట్టలేక పోయారు. అనడం కంటే ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పడంలో సందేహం లేదు. మీడియా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో వెనకబడిందని చెప్పడం కంటే, తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనడంలో సందేహం లేదు.

చెప్పులు కుట్టడం ద్వారా వచ్చే ఆదాయంతో ఏడిద భాస్కరరావు చదువు సాగించారు. కుటుంబాన్ని పోషించాలి. ఇంతటి ఆర్థిక సమస్యలతో ఉన్న వ్యక్తికి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అనే ఆలోచన మదిలో మెలగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? దీనివల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది?? అనే విషయాలను పిఠాపురం పట్టణం జీవన్ నగర్ 26వ వార్డులో నివాసం ఉంటున్న ఏడిద భాస్కరరావును ఫెడరల్ ప్రతినిధి ఫోన్లో పలకరించారు.

ఆయన విశ్లేషించిన తీరు, సమస్యలపై స్పందించిన వైనం, అర్థం చేసుకుంటే ఎంతో దూర దృష్టి ఉందని విషయం తెలియడంతో పాటు, ఉద్యమాలు, పోరాటాలతోనే కాకుండా మాటలతో చైతన్యం తీసుకురావచ్చు అని అర్థమవుతోంది. జనం మెదడులో ఆలోచన రేకెత్తించడం ద్వారా మార్పునకు బాట వేయవచ్చు అనే ఆలోచనలు ప్రగాఢంగా ఉన్నట్లు అర్థమవుతుంది.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే...

" మా నాన్నకు చెప్పులు కుట్టడంలో 60 సంవత్సరాల అనుభవం ఉంది. నేను చిన్ననాటి నుంచి చదువుకుంటూనే ఇదే వృత్తి నేర్చుకున్న" అని చెబుతున్న వివిధ భాస్కరరావు.. "ఎనిమిదవ తరగతి నుంచి నాకు పత్రికలు చదివే అలవాటు ఉంది. అన్ని విషయాలు అర్థం చేసుకునే స్వభావం నాకు కలిగింది" అని చెప్పారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే..

"పిఠాపురంలో కొన్ని వర్గాలు దళితులను తేడాగా చూడడం నాకు చిన్ననాటి నుంచి అర్థమవుతూనే ఉంది. మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పాసయ్యాను. ఇంట్లో పూట గడవటం కష్టం. అందుకే చెప్పులు కుట్టే వృత్తి కొనసాగిస్తూనే, కాకినాడలోని ఆండాలమ్మ డిగ్రీ కాలేజీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బిఏ పూర్తి చేశాను. ఆర్థిక స్థితి సహకరించని పరిస్థితుల్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయాలనే కోరిక ఇంకా మిగిలి ఉందని ఉంది" అని తన ఆలోచనలను పంచుకున్నారు.

"చెప్పులు కుడుతూనే ఖాళీ సమయంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే తో పాటు సంఘసంస్కర్తల జీవితాలను వీడియోలు చూస్తూ, ప్రేరణ పొందాను. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రబోధించిన బోధించు.. పోరాడు.. సమీకరించు.. మాటలు నన్ను ప్రభావితం చేశాయి’’ అని చెప్పిన ఏడిద భాస్కరరావు అప్పుడే తనకు ఎన్నికల్లో నిలబడాలి అనే ఆలోచన కూడా మొదలైందని చెబుతున్నారు. ‘‘ఇందుకోసం తన ఖాళీ సమయంలో.. పిఠాపురంలో గడచిన నాలుగేళ్ల నుంచి అన్ని కాలనీల్లో ఇంటింటికి వెళ్లి మాట్లాడా. సమస్యలపై ప్రజలను చైతన్యం చేశా. ఇందుకు మా చుట్టుపక్కల వారు బంధువులు కూడా సహకారం అందించారు’’ అని వివరించారు.

‘‘కొందరు విచిత్రంగా చూసినప్పటికీ, చాలామంది అభినందించారు. వారి మాటలే నన్ను ప్రోత్సహించాయి. ఆ ప్రేరణతోనే పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా’’ అని ఏడిద భాస్కరరావు వివరించారు. అజెండా విషయాన్ని ప్రస్తావిస్తూ.. "పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మండలాలు గ్రామాల వారీగా పత్రికల్లో వచ్చిన కథనాలతో ఓ బుక్ లెట్ తయారు చేశా. నిరుద్యోగులను చైతన్యం చేస్తూ వారికే వినతుల మాదిరి లేఖలు సిద్ధం చేశా. ఆ అంశాలపైనే, నిత్యం జనం ఎదుర్కొంటున్న సమస్యలను వారికి గుర్తు చేసి, ఎమ్మెల్యేగా గెలిచే వ్యక్తి ఎలా ఉండాలో ప్రచారంలో విడమరిచి చెప్పాను. ఇందుకు అనేక మంది సహకరించారు’’ అని భాస్కరరావు వివరించారు.

నియోజకవర్గంలో 40 వేల మంది దళిత ఓటర్లు ఉన్నారు. వారిలో మాలలు 70 శాతం, మాదిగలు 20, రెల్లి ఐదు శాతం ఓటర్లు ఉన్నారు. " నామినేషన్ వేయాలని అనుకున్నా డబ్బు లేదు. అదృష్టవశాత్తు డ్వాక్రా రుణం రూ. లక్ష వచ్చింది. ఆ సొమ్ముతో నామినేషన్ వేయడంతో పాటు, మూడు ఆటోలు పెట్టి నియోజకవర్గంలో ప్రచారం చేశా" అని ఆయన చెప్పారు. "నామినేషన్ ఉపసంహరించుకోండి. శిధిలమైన ఇల్లు బాగు చేయించుకోవచ్చు. చెప్పులు కుట్టుకునేందుకు షాపు ఏర్పాటు చేయిస్తామని ఆఫర్‌తోపాటు, ఒత్తిడి వచ్చినా, నా పని నేను చేసుకుపోయా"

" నేను 15 సంవత్సరాలుగా ఆర్ఆర్బీ జూనియర్ డిగ్రీ కళాశాల వద్ద చెప్పులు కుట్టుకుంటూనే జీవిస్తున్నా. ఏటా ఇక్కడ చదువులు పూర్తి చేసుకుని వెళ్ళిన విద్యార్థులందరితో నాకు పరిచయం ఉంది. వారందరూ ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ప్రచార కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రతి ఊరిలో నాకు ఎందుకు ఓటు వేయాలి? సమాజంలో యువకుల పాత్ర ఏంటి? అని చెబుతూనే బాధ్యతలను కూడా గుర్తు చేసినప్పుడు వారి నుంచి అభిమానం లభించింది‌‌’’ అని వివరించారు. తన లెక్క ప్రకారం తనకు 83,567 ఓట్లు దక్కాలని ఏడిద భాస్కర రావు విశ్లేషించారు. ఆయనది అత్యాశ అని భావించినా... ఓటర్లు ఏ మేరకు ఆదరించారు? ఆయన చెప్పిన మాటలు ఎంత వరకు అర్థం చేసుకున్నారు? ఆయనలోని అంతరంగాన్ని ఎంతమంది పసిగట్టారు??? అనే విషయాలు ఇంకో మూడు రోజుల్లో వెల్లడి కానున్నాయి.

ఈ అంశాలపై పిఠాపురం సీనియర్ జర్నలిస్ట్ విఎస్ వరప్రసాద్ మాట్లాడుతూ.. " స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఏడిద భాస్కరరావు ఆలోచనలు చాలా గొప్పవి. కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ జీవిస్తున్న ఆయన, ఖాళీ సమయాల్లో సంఘసంస్కర్తల వీడియోలు చూస్తూనే ఉంటారనేది వాస్తవం. సామాజిక స్పృహ ఆయనలో చాలా ఎక్కువ" అని చెప్పారు. ‘‘విచిత్రం ఏమిటంటే గత ఐదేళ్లుగా పత్రికలో ప్రచురితమైన నియోజకవర్గంలోని సమస్యలు మండలాల వారీగా విభజించి, తయారు చేసిన బుక్లెట్ అజెండాగా ప్రజల ముందు ఉంచడం అనే ప్రక్రియతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఇరకాటంలో పెట్టారు అనడంలో సందేహం లేదు. ఇది చర్చకు ఆస్కారం కల్పించింది. వాస్తవంగా చెప్పాలంటే అతని మేధస్సు చాలా గొప్పది" అని వరప్రసాద్ వివరించారు.

Read More
Next Story