లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి. టీడీపీ నేతలు రాజకీయాల కోసం ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకుంటున్నారు.


దేవుడితో పెట్టుకున్న వారు ఎవ్వరూ బాగుపడలేదని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారితో పెట్టుకొని, తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోలా గురువులు, రవిరెడ్డి, గొలగని శ్రీనివాస్, మోలి అప్పారావు, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి విశాఖపట్నం జీవిఎంసి కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసనలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారని మండి పడ్డారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌ వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. లడ్డూ విషయంపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే లేఖ రాశారని అన్నారు. ఈ విషయంపై మరో సారి ప్రధాన మంత్రి మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
Next Story