అప్పన్నా.. ఆ భూములిప్పించు స్వామీ?
ఎన్ని ప్రభుత్వాలు మారినా.... సింహాద్రి అప్పన్న దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య తీరలేదు.... రెండున్నర దశాబ్దాల కాలంగా నివాసితులు పోరాడుతూనే ఉన్నారు.
(తంగేటి నానాజీ - విశాఖపట్నం)
ఒకప్పుడు సింహాచలం దేవస్థానం పరిసర గ్రామాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు బాగానే జరిగేవి. ఎన్నో కాలనీలు కూడా ఏర్పడ్డాయి. ఎందరో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని సెటిల్ అయ్యారు. 2000 సంవత్సరం వరకు అంతా సవ్యంగానే సాగింది. 2000 తర్వాత కథ తారుమారు అయింది. సింహాచలం దేవస్థానం పరిధిలో గల అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తపురం ఐదు గ్రామాల పరిధిలో ఉన్న భూములు తమవేనంటూ దేవస్థానం వాదించింది. ఆలయ భూములంటూ ఈ గ్రామాల భూముల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేసింది. అప్పటి నుంచే ఈ భూముల సమస్య ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇంటి జాగా ఉన్నా సరే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోలేరు, అలాగని ఆ భూమిని అమ్ముకోనూ లేరు.
క్రమబద్ధీకరణకు జీవో విడుదల...
2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 578 (ఆగస్టు 19 2000) తీసుకువచ్చి 1998 వ సంవత్సరం మార్కెట్ వాల్యూ ప్రకారం 70% సొమ్ము దేవస్థానానికి జమ చేసి భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి పంచ గ్రామాల ప్రజలకు వెసులుబాటు కల్పించారు. ఈ జీవో ప్రకారం ఈ పంచ గ్రామాల్లో భూములు కలిగిన వారిలో 20 శాతం మంది తమ తమ నివాస స్థలాలకు ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. ఇలా 2003 నవంబర్ వరకు చెల్లించిన వారికి భూములు క్రమబద్ధీకరించబడ్డాయి. ఈ జీవోకు 2004 ఏప్రిల్‌తో కాల పరిమితి ముగియడంతో అది రద్దయిపోయింది.
అసలు సమస్యకు మూలం ఏంటి..
సింహాచలం దేవస్థానం భూములు అన్యాక్రాంతం అయ్యాయి అంటూ 1995లో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం దేవస్థానం భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఓ హౌస్ కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదిక అందక ముందే 1996, 97 లో 9,069 ఎకరాల భూములకు సింహాచలం దేవస్థానానికి చంద్రబాబు ప్రభుత్వం పట్టాలను జారీ చేసేసింది. దీంతో ఈ భూములన్నీ మావేనంటూ దేవస్థానం పంచ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేయించింది.
సర్వేలు ఏం చెబుతున్నాయి...
సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య ఏర్పడక ముందే 1903 లో రెవెన్యూ శాఖ అత్యున్నత సర్వేగా చెప్పుకుంటున్న సర్వే సెటిల్మెంట్ రికార్డ్(గిల్మన్ రికార్డు) రికార్డులను పరిశీలించి ఈ 11,282 ఎకరాల భూములు ఉన్నాయని నిర్ధారించింది. ఆ రికార్డు ప్రకారం అడవివరం పంచాయతీలో సింహాచలం దేవస్థానానికి 39.5 ఎకరాల భూమి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే 1996, 97 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు సదరు దేవస్థానానికి పట్టాలు జారీచేసిన 9,069 ఎకరాల భూమి ఎవరిది. దేవస్థానానికి ఎక్కడి నుండి వచ్చింది. దీనికి సంబంధించి చంద్రబాబునాయుడు దేవస్థానానికి పట్టాలు ఇచ్చిన రికార్డులు తప్పిస్తే దేవస్థానం వద్ద ఎటువంటి రికార్డులు లేవు అన్న మరో వాదన కూడా వినిపిస్తుంది.
పాలకులు మారినా ఫలితం శూన్యం
తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005, మార్చ్‌లో ఓ కమిటీని నియమించింది. మాజీ మంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ చైర్మన్‌గా ఎమ్మెల్యేలు గురుమూర్తి రెడ్డి, రంగరాజు, కర్రి సీతారాములు సభ్యులుగా గల ఈ కమిటీ పలుమార్లు సమావేశమై సమస్యపై చర్చించింది. అయితే దేవస్థానం భూములు అన్యాక్రాంతమవుతున్నాయని పీఠాధిపతులు కోర్టుకు ఎక్కడంతో సమస్య వాయిదా పడింది. తర్వాత రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ 2018 పాదయాత్రలో పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారానికి 2019లో ఓ కమిటీ, 2020లో ఇంకొక కమిటీ, 2023లో ముచ్చటగా మూడో కమిటీని వేశారే తప్ప సమస్యను పరిష్కరించలేకపోయారు.
దశాబ్దాలుగా ఎదురుచూపు..
"సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం.1903 గిల్మన్ సర్వే రికార్డ్ ఆధారంగా సమస్యను పరిష్కరించాలి. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కోర్టులో కేసులను ప్రభుత్వమే చూసుకోవాలి. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తే తిరిగి అధికారంలోకి తెస్తామంటున్నారు పంచ గ్రామాల సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టీవీ కృష్ణంరాజు". సింహాచలం దేవస్థానానికి 1996- 97 లో ప్రభుత్వం ఇచ్చిన భూమి హక్కు పట్టాలను రద్దు చేయాలి. పీఠాధిపతులు వేసిన కోర్టు కేసులకు, పంచ గ్రామాల సమస్యకు సంబంధం లేదు. ప్రజల భూములను ప్రజలకు అప్పగించండి అని డిమాండ్ చేశారు సిపిఎం మహిళా నాయకురాలు రమణి.
ఎన్నికల ముందు ప్రచారాస్త్రం..
సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్య రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి మేమే మీ సమస్య పరిష్కరిస్తామంటూ అన్ని రాజకీయ పార్టీలు తెగ ఊదరగొట్టేస్తుంటారు. అయితే చంద్రబాబు, వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ ఇలా ఎందరు ముఖ్యమంత్రులు మారినా ఈ సమస్య పరిష్కారం మాత్రం కాలేదు. ఈసారి ఎన్నికల్లో పంచ్ గ్రామాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
Next Story