జగనన్నా, నా తలరాత ఇలా రాశావేందన్నా!
‘ఎగిరెగిరి దంచినమ్మకీ ఒకటే కూలి, ఎగరకుండా దంచినమ్మకీ అదే కూలి’ అని భలే తమాషైన సామెతొకటి చెలామణిలో ఉంది. ఈ సామెత నాయకులకు బాగా వర్తించేలా కనిపిస్తోంది.
(తంగేటి నానాజీ, విశాఖపట్నం)
‘ఎగిరెగిరి దంచినమ్మకీ ఒకటే కూలి, ఎగరకుండా దంచినమ్మకీ అదే కూలి’ అని తెలుగు రాష్ట్రాలలో భలే తమాషైన సామెతొకటి చెలామణిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సామెత నాయకులకు బాగా వర్తించేలా కనిపిస్తోంది. ప్రతి అంశంపై అధికార పార్టీ తరఫున స్పందించే వాళ్లలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ బాబులపై ఆయనేసినన్ని సెటైర్లు మరెవ్వరూ వేసినట్టు లేదు. పాపం ఇప్పుడాయన పరిస్థితి కుడితో పడ్డ ఎలుక మాదిరైందని జనసేన నేతలు మహాసంబరపడిపోతున్నారు. ఇంతకూ విషయమేమిట్రా అంటే అమర్నాథ్ కి వైసీపీ సీటు గల్లంతైందని టీడీపీ, జనసేన నేతలు ఆడిపోసుకుంటున్నారు.
ఇలా మొదలైంది కథాక్రమం...
ఇప్పటివరకు ఏదో మూల చిన్న ఆశ... అధిష్టాన నిర్ణయం శిరోధార్యం అంటూనే అసెంబ్లీ కో, పార్లమెంట్ కో సీటు దక్కక పోతుందా... తమ అధినేత జగన్ ప్రకటించక పోతారా అన్న ఆశతో ఉన్న ఐటి మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అసెంబ్లీ టిక్కెట్ మరి లేనట్టే అని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఏదో ఓ రోజు తనకు కూడా టిక్కెట్ లభిస్తుందనుకుని ఊహల్లో ఉన్న అమర్‌కు... సీఎం జగన్ పిసినికాడలో నిర్వహించిన చేయూత సదస్సులో టిక్కెట్ లేదనే విషయం స్పష్టమైపోయింది. కార్పొరేటర్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన అమర్‌కు ఇది పెద్ద షాకే. అనకాపల్లి కాకపోయినా చోడవరం, పెందుర్తి, గాజువాకైనా దక్కుతుందేమోనని భావించారు. ఇటీవల అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆయనకే ఖరారవుతుందని కూడా వార్తలొచ్చాయి. ఆఖరికి అమర్‌కు మరి టిక్కెట్ ఉండదని తేలిపోవడంతో ఆయన వర్గం నీరసించిపోయింది.
నిజంగానే అమర్నాథ్ తలరాతను మార్చిన జగన్...
'అనకాపల్లి వైసీపీ ఇన్‌చార్జి మలసాల భరత్, మంత్రి అమర్ ఇద్దరూ నాకు అన్నదమ్ముల్లాంటి వాళ్లే.' అని పిసినికాడ సభలో సీఎం జగన్ అన్నారు. దీనర్థమేమిటో గుడివాడ అమర్నాథ్ కి బాగా తెలుసు. టికెట్ లేదని తేలిపోయినట్టే. అనకాపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అమర్ను కాదని భరత్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినప్పుడే మంత్రి అమర్ వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారు. 'అందరి తలరాతలు దేవుడు రాస్తే.. నా తలరాత మాత్రం సీఎం జగన్ రాస్తారు' అని మాట్లాడుతూ కాస్తంత కంటనీరు పెట్టుకున్నారు.
ఈనేపథ్యంలో జగన్ మరింత స్పష్టత ఇచ్చారు. ‘మలసాల భరత్, అమర్ ఇద్దరూ నా తమ్ముళ్లే. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి భరత్‌ను ఆశీర్వదించండి. తోడుగా నిలవండి’ అని తేల్చి చెప్పారు. గతంలోనే అనకాపల్లి సమన్వయకర్తగా భరత్‌ను ప్రకటించాక అమర్‌నాథ్‌కు పెందుర్తి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ సీటు సిటింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కేనని అధిష్ఠానం చెప్పినట్లు ఆయన అనుచరవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ తర్వాత ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో అమర్‌కు సీటు ఇచ్చే అవకాశాలపై పరిశీలించినప్పటికీ, సామాజిక సమీకరణలు, సర్వేలలో వెనుకబాటుతో మంత్రి ఆశలకు గండిపడింది. తిరిగి అనకాపల్లి సీటే ఇస్తారంటూ ఇటీవల ప్రచారం జరగ్గా, సీఎం ఆ సీటు భరత్‌కేనని తేల్చిచెప్పేశారు. అనకాపల్లి ఎంపీ సీటు అమర్‌కు ఇస్తారంటూ ఆయన అనుచరగణం చెప్పుకొస్తున్నా, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ఒకటి గవర సామాజికవర్గానికి ఇవ్వడం ఆనవాయితీ. ఆడారి ఆనంద్ సోదరి పీలా రమాకుమారి, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేటి కాశీవిశ్వనాథ్ ఆ సీటుకు పోటీ పడుతున్నట్టు సమాచారం.
గాజువాక సిటింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డిని సమన్వయకర్తగా మార్పు చేసి, ఆ స్థానంలో ఉరుకూటి చందును నియమించారు. మంత్రి అమర్‌నాథ్‌కు బంధువు, శిష్యుడైన చందును తిప్పల నాగిరెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవల ఆ స్థానంలో విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారికి సీటు అంటూ సర్వేలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో గాజువాకకు నిధులు ఎక్కువగా కేటాయించి, శంకుస్థాపనల్లో మేయర్ ఇటీవల హడావుడిగా ఉన్నారు. దీంతో గాజువాకలోనూ అమర్‌నాథ్ సూచించిన వారికి చుక్కెదురు అయినట్లేనని చెబుతున్నారు.
ఆరోపణలు, సర్వేలే కారణం..
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రి పదవి చేపట్టిన నాటినుండి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమే, ఇక పార్టీ చేపట్టిన సర్వేలో అమర్ కు అరకొర మార్కులు పడ్డాయి. దీంతో టిక్కెట్టు పక్కనపెట్టి పార్టీ పదవులకే అమర్ ను పరిమితం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. “అమర్ అవినీతి అనకాపల్లిలో చిన్న పిల్లలను అడిగిన చెబుతారు. తగిన శాస్తి జరిగింది” అన్నారు టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మొత్తం మీద అమర్ మీద ఆగ్రహంతో ఉన్న వాళ్లందరికీ జగన్ చేసిన ప్రకటన సంబరపడేలా చేస్తే అమర్నాథ్ అనుచరులకు మాత్రం పీడకలలా మిగిల్చేలా ఉంది.