చంద్రబాబూ.. వీళ్లకు టికెట్లు లేనట్టేనా!
x
టీడీపీ నిరసన ప్రదర్శనలు

చంద్రబాబూ.. వీళ్లకు టికెట్లు లేనట్టేనా!

సీనియర్లను ప్రక్కనబెట్టాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండో లిస్ట్‌లో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు.


టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్లను ప్రక్కనబెట్టాలనే నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండో లిస్ట్‌లో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో చంద్రబాబుపై సీనియర్లు రగిలిపోతున్నారు. రెండో జాబితాలోనూ కళా వెంకట్రావు (ఎచ్చెర్ల), కిమిడి నాగార్జున (చీపురుపల్లి), సోమిరెడ్డి పేర్లు కనిపించలేదు. నెల్లూరు జిల్లా కోవూరులో పోలంరెడ్డికి షాక్‌ తగిలింది. వేమిరెడ్డి భార్యకు చంద్రబాబు సీటిచ్చారు. ఉమ్మడి విశాఖ నేతలు గుర్రుగా ఉన్నారు. గంటాకు భీమిలి సీటు కుదరదంటున్న చంద్రబాబు.. బండారు సత్యనారాయణకు కూడా పెందుర్తి సీటు నిరాకరించారు. చంద్రబాబు తీరుపై అయ్యన్నపాత్రుడు అలకబూనారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో గరం.. గరం..

టీడీపీ విశాఖ జిల్లాలో రుసరుసలు బయలుదేరాయి. రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గండి బాబ్జి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ స్థానం జనసేనకు కేటాయించడంతో మనస్తాపం చెందారు. విశాఖ వెస్ట్ సీటును ఆశించిన పాసర్ల ప్రసాద్.. కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు.

చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన...
చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టిక్కెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ.. వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలుకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా వడ్డెర్లకు అదిగో ఇదిగో అంటున్నారనే తప్ప సీటు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుట్టపై ‘గంటా’ సమావేశం ఎందుకు?

రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశమయ్యారు. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా.. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

పెనమలూరులో రగిలిన అసమ్మతి
కృష్ణాజిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. బోడే ప్రసాద్ సముదాయించినా ఆయన అనుచరులు మాత్రం చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉంటే ఇంత అవమానిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ‘బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు, చంద్రబాబు, లోకేశ్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలాగా భావించాం. 53 రోజులు నిరాహారదీక్షలు చేశాం’ అన్నారు బోడే ప్రసాద్ అనుచరుడు రంగ ప్రసాద్.

Read More
Next Story