ఎన్నికల అబ్జర్వర్స్ ఫిర్యాదు మేరకే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతాను, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులును విధుల నుంచి తప్పించినట్లు విశ్వసనీయ సమాచారం.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అసమర్థత వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలే కుట్ర పూరితంగా ముఖ్యమంత్రిపై రాయి దాడికి పాల్పడినట్లు అధికార పక్షం ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం వీరి వైఫల్యం వల్లే ముఖ్యమంత్రికి రాయి ప్రమాదం సంభవించిందని ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది.
పురందేశ్వరి ఎఫెక్ట్
బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒక పథకం ప్రకారం ఐఎఎస్, ఐపిఎస్ అధికారులపై చర్యలు తీసుకునే విధంగా వ్యూహం రూపొందించారని, ఆ వ్యూహం ఎన్డిఎ కూటమిలోని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 17 మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిని వెంటనే బదిలీ చేయాలని పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆమేరకు ఒక్కొక్కరిని ఈసీ ఎన్నికల విధులకు దూరం చేస్తూ వస్తున్నది. కలెక్టర్ లను సైతం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. సీఎంపై దాడి కేసులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఇందులో కుట్రకోణం ఉందని, కేంద్రం ఏమి చెబితే ఎన్నికల సంఘం ఆ పనిచేస్తోందని అధికార వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పురందేశ్వరి లేఖలోనూ కుట్ర కోణం ఉంది..
సీనియర్ జర్నలిస్ట్ ఎంఇవి ప్రసాదరెడ్డి ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ బీజెపీ జేబు సంస్థగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు. పురందేశ్వరి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పావులు కదుపుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపిని దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శాతం కూడా ఓట్లు లేని బీజెపి ఏమి సాదిద్దామని ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆయన ప్రశ్నిస్తూ కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేందుకే ఈ చర్యలకు పాల్పడినట్లు చెప్పడం విశేషం. ఈ చర్యల వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఆయన చెప్పటం విశేషం.
ఐపిఎస్ అధికారుల బదిలీ వెనుక టీడీపీ కుట్ర ఉందా?
ప్రస్తుతం విజయవాడ నగరంలో ఎన్నికల అబ్జర్వర్లుగా వ్యవహరిస్తున్న వారు తెలుగుదేశం పార్టీకి అనుకూలురనే ఆరోపణలు ఉన్నాయి. అబ్జర్వర్లు చెప్పినట్లు ఈసీ చర్యలు తీసుకుందని, వాస్తవాలు పరిశీలించకుండా ఈ విధమైన చర్యలు తీసుకోవడం వెనుక ప్రభుత్వాన్ని దెబ్బతీసే పలు కోణాలు ఉన్నాయనేది పలువురు వైఎస్సార్సీపీ నాయకుల ఆరోపణలు. ముఖ్యమంత్రిపై రాయి విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నామని, వేముల సతీష్ కుమార్ రాయి విసిరినట్లు అంగీకరించాడని సీపీ ఇప్పటికే ప్రకటించారు. సతీష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం వేముల దుర్గారావు అనే వ్యక్తి తనను రాయి విసరమని చెప్పినందునే నేను విసిరానని, చీకట్లో నుంచి విసరటం వల్ల ఎవ్వరూ గుర్తించలేకపోయినట్లు తెలిపారు. దీనిని బట్టి పోలీసు వైఫల్యం ఎక్కడుందనేది పోలీసుల ప్రశ్న. సీపీ కాంతిరాణా తాతా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకని ప్రశ్నించారు. ఇందులో తెలుగుదేశం సెంట్రల్ అభ్యర్థి హస్తం ఉందని తేలడంతో దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో కొందరు తెలుగుదేశం పార్టీ అనుకూల లాయర్లు రంగంలోకి దిగి దుర్గారావును అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలతో విడుదల చేయించారు. ఈ వ్యవహారంలోనూ తెలుగుదేశం నాయకులే కీలక పాత్ర పోషించారనేది వైఎస్సార్సీపీ వారి వాదన. సీఎంపై రాయి దాడి జరిగిన తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా విజయవాడ సీపీని పిలిపించి మాట్లాడారు. సీపీ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసీ వీరిపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఎన్నికల అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టు మేరకే ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదో చర్చకు దారితీసింది.