నేటి నుంచి ఎన్నికల అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్‌లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్‌లు దాఖలు చేయొచ్చు.



ఎన్నికల్లో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొందరు సమయం ప్రకారం మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్‌లు వేస్తారు. మరికొందరు దేవాలయాల్లో పూజలు చేసి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తారు. ప్రధానంగా పార్టీల ముఖ్యనాయకులు ఎప్పుడు నామినేషన్‌లు వేస్తారనేది అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఈనెల 18, 19, 22, 24 తేదీలు మంచి రోజులని పంతుళ్లు ఇప్పటికే చెప్పేశారు. ఎక్కువ మంది నాయకులు ఈనెల 22న నామినేషన్‌లు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరిస్తారు. మంగళగిరిలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నామినేషన్‌ పత్రాలను టీడీపీ నాయకుడు నందం అబద్దయ్యతో పాటు బీజేపీ, జనసేన నాయకులు ర్యాలీగా వెళ్లి సాయంత్రం 2.34 గంటల ప్రాంతంలో ముహూర్తం ప్రకారం దాఖలు చేస్తారు.
ఈనెల 19న హిందూపూర్‌ శాసనసభకు టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్‌ దాఖలు చేస్తారు. 22వ తేదీన పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తరపున ఆయన సోదరుడు కె నాగబాబు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తారని సమాచారం. అలాగే ఈనెల 22న పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున నామినేషన్‌ పత్రాలను కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి దాఖలు చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన నామినేషన్‌ను కడపలో ఈనెల 20న దాఖలు చేస్తారని సమాచారం. చంద్రబాబునాయుడు నామినేషన్‌ పత్రాలు ఈనెల 19న దాఖలు చేస్తారు. ఆయన భార్య నారా భువనేశ్వరి చంద్రబాబు తరపున నామినేషన్‌ వేస్తున్నట్లు టీడీపీ రాష్ట్రకార్యాలయం తెలిపింది. స్థానిక దేవాలయాల్లో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి మధ్యాహ్నం 12.33 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎన్నికల నోటిపికేషన్‌ నేడు వెలువడింది. 25వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. కొన్ని పార్టీలు ఇంకా అభ్యర్థులను అక్కడక్కడ ప్రకటించలేదు. బిఫారాలు కూడా ఇవ్వలేదు. అయితే ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్‌లు వేసేందుకు గడువు ఉన్నందున ఆయా పార్టీల వారు తాఫీగా ఇంకా ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. కమ్యూనిస్టులకు ఎటువంటి సెంటిమెంట్లు ఉండవు కాబట్టి వారు ఎప్పుడైనా నామినేషన్‌లు దాఖలు చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు, పార్టీల ముఖ్య నాయకులు ప్రస్తుతం ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో ఉన్నందున వారి తరపున వేరే వారు నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. మంగళగిరిలో సుమారు పదివేల మందికి పైగా ర్యాలీగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళుతున్నారు. ముందుగా శ్రీరాముని దేవాలయంలో పూజలు చేసి ఆ తరువాత నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తారు.
నామినేషన్‌ల స్వీకరణకు ఎనిమిది రోజులు ఎన్నికల కమిషన్‌ గడువు ఇచ్చింది. 26న నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. 29న నామినేషన్‌లు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుంది. అభ్యర్థులు నాలుగు సెట్ల నామినేషన్‌ ఫారాలు గరిష్టంగా దాఖలు చేయవచ్చు. నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు నలుగురు ఎన్నికల అధికారి వద్దకు రావొచ్చు. మిగిలిన వారు వందమీటర్లపైన దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌ నిబంధన విధించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 40 లక్షల వరకు అభ్యర్థి ఖర్చు చేయవచ్చు. పార్లమెంట్‌ స్థానానికి రూ. 95లక్షల వరకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంది.


Next Story