మంటలు పుట్టిస్తున్న నేతల మాటలతో ఉలిక్కిపడుతున్న ఉత్తరాంధ్ర!
x

మంటలు పుట్టిస్తున్న నేతల మాటలతో ఉలిక్కిపడుతున్న ఉత్తరాంధ్ర!

ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీలు మాత్రమే ఉంటాయన్న ప్రకటనలు కార్యకర్తలలో మంటలు పుట్టిస్తున్నాయి. ఫలితంగా టెన్షన్ పెరుగుతోంది.


కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్ది ఉత్తరాంధ్రలో టెన్షన్ మొదలైంది. నాయకుల పరస్పర ఆరోపణలు, ఆందోళనలు, ప్రకటనలతో రాజకీయ పార్టీల అభిమానులు తీవ్రగందరగోళంలో పడుతున్నారు. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీలు మాత్రమే ఉంటాయన్న ప్రకటనలు కార్యకర్తలలో మంటలు పుట్టిస్తున్నాయి. ఫలితంగా టెన్షన్ పెరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున కార్యకర్తలు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే జూన్ 4న ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసు అధికారులు సైతం ఆందోళన పడుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లు పేపర్ తరహాలో ఉన్నందున కౌంటింగ్ సమయంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఓట్లు చెల్లుబాటు అయ్యే సమయంలోనే అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉన్నట్టు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల ఎంఆర్వో కార్యాలయం నుంచి విజయనగరం కలెక్టర్ కార్యాలయానికి పోస్టల్ బ్యాలెట్లను తరలించడంపైన్నే టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి రెండూ పార్టీలు ఘర్షణపడ్డాయి. విజయనగరంలోని లెండి కళాశాల, జేఎన్‌టీయూ-జీవీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సమీక్షించారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరోపక్క, విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్లున్న స్ట్రాంగ్‌రూమ్‌ను గుట్టుచప్పుడు కాకుండా తెరిచారంటూ టీడీపీ- రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో హింసకు తావులేకుండా మరింత భద్రతను ఏర్పాటు చేస్తామంటున్నారు శ్రీకాకుళం ఎస్పీ దీపిక. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నారు.

కౌంటింగ్ రోజున లేదా ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల్ని కాల్చి వేయడానికి కూడా వెనుకాడదని ఆమె హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకుంటున్నందున కౌంటింగ్‌లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు తగిన భద్రత కల్పించాలని ఏపీఎన్జీవోల సంఘం కోరింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున చాలా మంది ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్లపై పరస్పర ఆరోపణలు..

విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన ఎంఆర్ఓ కార్యాలయంలోకి వైసీపీ నాయకులు ప్రవేశించారంటూ టీడీపీ నాయకులు విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి రాజు కోరారు.

వైఎస్సార్‌సీపీ మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్షుడు ఎం. అప్పల నాయుడు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్‌ తో పాటు మరో అధికార పార్టీ నేత సమక్షంలో అభ్యర్థులు స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచారని టీడీపీ నేతలు ఆరోపించారు. లోక్ సభ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ ఓట్లను పగటిపూట కాకుండా రాత్రిపూట కలెక్టర్ కార్యాలయానికి తరలించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Read More
Next Story