'మా ఉత్తరాంధ్ర ఉత్తిదేనా! మా యాసేది ఊసేది!!
మా యాసేది.! మా బాసేది.! మా ఊసేది.! అన్నీ తెలంగాణ పాటలేనా! మా ఉత్తరాంధ్ర ఉత్తిదేనా! ఇజినారం, సికాకులపోళ్లు ఆనలేదా!
‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. ఏం పిల్లో ఎల్దామొస్తవా..’ అని మా వంగపండు పాడితే తెలంగాణ గద్దర్ కూడా మురిసిపోయేవారే!
‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుబట్టినాడా వొగ్గనే వగ్గడు..’ అంటూ మన బాడ సూరన్న పాట పాడితే ప్రపంచమే ఊగిపోయిందే!
‘అబద్దాల రాయుడా.. చంద్రబాబునాయుడా.. నీ మాటలు చిత్రమైనవో..’ అన్న మా దేవిశ్రీ పాట రాష్ట్రమంతా విన్నారే!
‘నాది నక్కిలీసు గొలుసు..’ అని మా అసిరయ్య అందుకున్న పాట వెండితెరనిండా.. సోషల్ మీడియా అంతా నిండిపోయిందే..!
ఇక.. మా రమణ ‘పల్సర్ బైక్’ సాంగ్ క్రేజ్‌కు అందరూ డాన్స్ వేశారే..!
రేలారే రేలా జానకీరామ్, డప్పు శ్రీను, పాటల తూటా ఉదయ్‌భాస్కర్, డప్పు రాజు, ఇలా.. చెప్పుకుంటే మా ఉత్తరాంధ్ర నిండా కళాకారులే..
అంతెందుకు.. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఆధారంగా సినిమాల మీద సినిమాలు తీసేస్తున్నారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమా ఈ ప్రాంతానికి చెందినదే.
నాగచైతన్య కొత్త సినిమా ‘తండేల్’ కూడా మా గంగపుత్రుల కథే.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ కొత్త చిత్రం ‘మట్కా’ కూడా ఇక్కడిదే.
హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ‘గాటి’ కథ ఈ ప్రాంతానిదే. ఆ కథ రచయిత కూడా ఇక్కడివారే.
ఇలా.. మన ప్రాంతం.. మన కళాకారుల గొప్పతనాన్ని దేశం, ప్రపంచమంతా గుర్తిస్తుంటే.. ఈ ఎన్నికల్లో మన అభ్యర్థులకు మాత్రం ఆనలేకపోవడం కళాకారులకు తీరని వేదనను మిగిల్చింది. ఎన్నికల నేపథ్యంలో అడుగు బయటపెడితే అటో ఆటో, ఇటో ఆటో పాటల దాడి చేస్తున్నాయి.. పేదల పెన్నిధి మా వోడని ఒకరంటే.. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మా వోడంటూ చెవులు గిగ్గిరిలెత్తేలా హోరెత్తిస్తున్నాయి.
ఏ అభ్యర్థి పాట విన్నా మన ప్రాంత గురించి కానీ.. ఇక్కడ ప్రస్తావన కానీ.. మచ్చుకు కూడా కనిపించడం లేదు. అంతేకాదు.. ఏ పాటా ప్రజాదరణ పొందడం లేదు. ఈ పాటల్లో దాదాపుగా 80 శాతానికి పైగా హైదరాబాద్‌లోని పేరున్న కళాకారుల పాడినవే కావడం గమనార్హం. దూరపు కొండలు నునుపు అన్న రీతిలో ఒక్కో పాటకు రూ.25 వేలు మొదలుకొని రూ.లక్ష పైన కూడా ఖర్చు చేశారు. కానీ మన కళాకారులను ఏ అభ్యర్థీ కన్నెత్తి కూడా చూడలేదు. నిజానికి కళనే నమ్ముకుని బతుకుతున్నవారికి ఇలాంటి సందర్భాలే పట్టెడన్నం పెడుతుంటాయి. ఇలాంటి వారిని గుర్తిస్తే.. పాట, సాహిత్యమే జీవితంగా బతుకీడుస్తున్నవారికి పొట్ట నింపడమే కాదు.. వారైతే ఇక్కడ ప్రజల జీవనాన్ని ప్రస్తావిస్తూ అందర్నీ తప్పకుండా ఆకట్టుకునేవారు.
కానీ ఈ ప్రాంతం గురించి, అభ్యర్థి జీవితం గురించి.. నియోజకవర్గ పరిస్థితులు గురించి తెలియని వారితో రాయించడం, పాడిరచడం వల్ల అందరిదీ ఒకే పాటలా ఉంది. సాహిత్యమంతా ఒక్కటే.. ఒక్క పేర్లు మాత్రమే మార్చారన్నట్టుగా ఉంది. ఉత్తరాంధ్ర మొత్తంగా 34 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలున్నాయి. దాదాపుగా ప్రధానంగా 120 నుంచి 150 మంది వరకూ పోటీలో ఉన్నారు. వీరిలో సగం మంది అభ్యర్థులైనా ఇక్కడున్న పది మంది కళాకారులను గుర్తించి ఉంటే పట్టెడన్నం పెట్టినవారవును. ఇప్పటికైనా మించిపోలేదు.. మన జానపద, ప్రజాగళ కళాకారుల్ని గుర్తించాలని వారంతా విన్నవించుకుంటున్నారు.
- నాగేశ్వరరావు