తెల్లదే కాదు.. రంగుల పత్తి కూడా పండుతుంది..
x

తెల్లదే కాదు.. రంగుల పత్తి కూడా పండుతుంది..

ఇప్పటి వరకు మనం తెల్ల పత్తిని చూశాం. ఇకపై రంగుల పత్తిని కూడా చూస్తాం. నేడు ప్రపంచ కాటన్‌ డే సందర్బంగా రంగుల పత్తి విశేషాలు...


ప్రపంచం ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ సేంద్రీయ మంత్రాన్ని పటిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. కృత్రిమంగా రంగులు అద్దని రంగుల పత్తి విత్తనాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం తెల్లని పత్తిని పండిస్తున్నారు. రానున్న రోజుల్లో రంగురంగుల పత్తిని పండించి సహజ సిద్ధమైన రంగుల దుస్తులు ధరిస్తారు. దూది అనగానే మనకు తెలుపు గుర్తుకు వస్తుది. దూది కావాలని ఎవరిని అడిగినా తెల్లని దూదిని మాత్రమే ఇస్తారు. ఎందుకంటే పండించేది తెల్లని పత్తి మాత్రమే కాబట్టి.

రంగుల దూదితో జల కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఎలాగనుకుంటున్నారా? ప్రస్తుతం వస్తున్న తెల్లని దూదిని నూలుగా మార్చిన తరువాత దారాలకు రంగులు అద్దుతారు. ఆ తరువాత మిగిలిన రంగు నీరు బయటకు వదిలేస్తారు. ఈ నీళ్లు ఏ నీటిలో కలిసినా ఆ నీరంతా రంగుతో నిండిపోతుంది. అంటే కాలుష్యమే కదా. ఆ పరిస్థితి రంగుల పత్తి రావడం వల్ల పోతుంది. సహజంగా రంగుల బట్టలు ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. సిల్కు, పత్తి, నైలాన్‌ వంటి దారాలతో తయారైన వాటిని రంగుల్లో ముంచెత్తి తీస్తుంటారు. పత్తి దారాలకు రంగులు అద్దటం వల్ల కాలుష్యమే కాకుండా నీరు కూడా ఎక్కువగా వృధా అవుతుంది. అందుకే నేరుగా పత్తినే రంగుల్లో పండిస్తే బాగుంటుందనే ఆలోచనకు శాస్త్రవేత్తలు వచ్చారు.
నాగపూర్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సంస్థ ధార్వాడాలోని అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ యూనివర్సీటీలకు చెందిన నిపుణులు రంగుల పత్తి వంగడాలను సృష్టించారు. కొన్నేళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. సాధారణ తెల్లపత్తికి తెగుళ్లు ఎక్కువ. అందువల్ల రసాయనిక ఎరువులు, పురుగు మందులు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన రైతులు ఎక్కువగా వాడతారు. దీని కారణంగా కాటన్‌లో నాణ్యత లోపించడంతో పాటు భూమి సాధారణ సారవంతమైన స్థితిని కోల్పోతుంది. ఇతర పంటలు వేసినా భూమిలో సారం లేనందున పండకుండా రైతులు నష్టపోతున్నారు. దీంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు గతంలో చాలా చూశాం. అందుకే తెగుళ్లను తట్టుకోవడంతో పాటు నాణ్యమైన దారాలను అందించే రంగుల పత్తి వంగడాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు.
బెంగాల్‌లో ముదురు గోదుమ రంగు పత్తిని, మేఘాలయలోని గారో కొండల్లో లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పత్తి రకాలను ఎప్పటి నుంచో పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు చుట్టపక్కల ప్రాంతాల్లోనూ లేత గులాబీ రంగు పత్తిని పండించినట్లు కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. దీన్నే ఎర్రపత్తి అని కూడా అనేవారు. ఇజ్రాయెల్, పెరు, మెక్సికో, ఈజిప్టు, దేశాల్లో గ్రే, లేత గోదుమ, గోదుమ, నలుపు, లేత పసుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ, ఎరుపు ఇలా సుమారు 40 రకాల పత్తిని పండిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పటం విశేషం. ఈ రకం పత్తి దారాలలో పటుత్వం తక్కువగా ఉండటంతో చేత్తో చేసే చిన్నపాటి వస్త్రాలకే తప్ప మెషీన్లమీద దుస్తులు తయారు చేసేందుకు పనికి రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కానీ అతి నీల లోహిత కిరణాలను తట్టుకునే శక్తి రంగుల పత్తి దారాల్లో ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లో పత్తి పరిశోధనా కేంద్రలు దీనిపై ప్రత్యేకించి పనిచేసి గోధుమ రంగుల్లో పండే ఎన్‌డీఎల్‌హెచ్‌–1, హెచ్‌సి–2, డిడిసిసి–1, డిఎంబి–225, ఎంఎస్‌హెచ్‌–52 వంటి పలు రకాల పత్తి విత్తనలను అభివృద్ధి చేశాయి. ఎలా చేశారంటే రంగులకు కారణమైన జన్యువుల్ని మన్నికైన దారాల్నిచ్చే తెలుపురంగు పత్తిలోకి చొప్పించి నాణ్యమైన హైబ్రిడ్‌ రకాల్ని రూపొందించారు. ఈ రకాల దిగుబడులు కూడా బాగుంటంతో ఇప్పుడిప్పుడే వాణిజ్య పరంగా పండించేందుకు రైతులు ఆలోచనలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో నలుపుతో పాటు అనేక ముదురు రంగుల పత్తి వంగడాలు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రెజిల్‌కు చెందిన నేచురల్‌ కాటన్‌ కలర్‌ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఇప్పటికే సహజ రంగులతో పండిన కాటన్‌ దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అమెరికా వారికి కూడా ఈ రంగుల దుస్తులు బాగా నచ్చుతున్నట్లు సమాచారం. రానురాను రంగుల సామ్రాజ్యంలో రంగులు అద్దని కాటన్‌ దుస్తులు వస్తాయని చెప్పొచ్చు.
పత్తిని బాగా పండించే బెనిన్‌ బుర్కినాపాసో, చాద్, మాలి వంటి దేశాలు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకోవాలని 2012లో తొలిసారిగా ప్రతిపాదించాయి. ప్రపంచ వాణిజ్యం సంస్థ, ప్రపంచ ఆహార సంస్థ 2019లో ఈ దినోత్సవాన్ని జరిపాయి. నేడు వరల్డ్‌ కాటన్‌ డే సందర్బంగా పలువురు రైతులు పత్తి పంట గురించి పలు ఆలోచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తనాలు నాటటానికి సరిౖయెన సీఐసీఆర్‌హెచ్‌బిటి కాటన్‌–40 (ఐసీఏఆర్‌–సీఐసీఆర్‌ పికెవి081బిటి) చాలా అనువైనది. తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడిని ఇస్తుంది. సర్టిఫైడ్‌సీడ్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. బ్రీడర్‌ సీట్‌ కొద్దిమొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320లు. వచ్చే ఏడాది విత్తనాలు కావాలనుకునే వారు ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. నాగపూర్‌ సీఐసీఆర్‌లోని విత్తన శాస్త్రవేత డాక్టర్‌ శాంతిని సంప్రదించవచ్చు అని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ వైజి ప్రసాద్‌ తెలిపారు.
Read More
Next Story