ఇప్పుడది వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి పార్టీ!!
వైఎస్ షర్మిల సెటైర్ల మీద సెటర్లు వేస్తున్నారు. సరికొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త నిర్వచనం ఇచ్చారు.
ఏపీలో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించేలా పూటకో బాంబు పేలుస్తూ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. మొన్న శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కుటుంబంలో చీలికకు తన అన్న జగన్ కారణమంటూ బాంబేసిన షర్మిల నిన్న కాకినాడలో బీజేపీకి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. బి అంటే బాబు (చంద్రబాబు) జే అంటే జగన్, పి అంటే పవన్ కల్యాణ్ అంటూ సెటైర్ పేల్చి జనం నోళ్లలో నానారు. పెద్ద చర్చకే దారి తీసేలా చేశారు. తాజాగా గుంటూరులో మాట్లాడిన షర్మిల గుంటూరును గుంతలూరుగా అభివర్ణించి మా అన్న తన ప్యాలెస్ ను కట్టించుకుని రోడ్లు వేయించుకున్నాడే తప్ప పల్లెలు, పట్నాల్లో రోడ్లు వేయడం మరచిపోయాడని చెప్పారు. షర్మిల వాళ్ల బాబాయి వైవీ సుబ్బారెడ్డి, వాళ్ల మామ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండే ఒంగోలు వెళ్లి... యుద్ధానికి నేను రెడీ.. మీరు రెడీనా? అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రజలకు న్యాయం చేయాలనే రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.
నిజం చెబితే నిష్టూరమే కదా...
‘‘ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతుంటే.. వైసీపీ వారంతా నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద వైఎస్‌ఆర్ నిర్మిస్తే.. జగన్ సర్కారు దానిని నిర్వహణ కూడా చేయలేకపోతోంది. వైఎస్ వారసులమని చెప్పేవారు ‘గుండ్లకమ్మ’ను ఎందుకు పట్టించుకోవడం లేదు. గేట్లు ఊడిపోయినా పట్టించుకోని వారా ఆయన ఆశయాలు నిలబెట్టేది? వైఎస్ హయాంలో 70 శాతం పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?’’ అని వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
వైఎస్సార్ కి సరికొత్త నిర్వచనం...
‘‘వైఎస్సార్ సీపీలోనే అసలు వైఎస్‌ఆర్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి’’ అని షర్మిల సెటైర్లు వేశారు. ఆ మంత్రికి డ్యాన్స్‌లు తప్ప.. ప్రాజెక్టులు పట్టవు అని అంబటి రాంబాబును విమర్శించారు. మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయలేదన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్స్‌లు వేయడమే తప్ప.. ప్రాజెక్టుల బాగోగులను చూడటం లేదని విమర్శించారు.