కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో నారా భువనేశ్వరి తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు.


ఇప్పటి వరకు హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ నగరంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు భవన నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి గురువారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె శంకుస్థాపన చేశారు. విజయవాడ నగరం 16వ జాతీయ రహదారి వెంబడి బెంజి సర్కిల్‌ దాటిన తర్వాత ఎల్‌ఈపీఎల్‌ మాల్‌ పక్కన, సాయిబాబా టెంపుల్‌ రోడ్డు జంక్షన్‌లో జీప్లస్‌ 5 విధానంలో దీనిని నిర్మాణం చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతనంగా ఈ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ భవన నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటికే ప్లాన్‌ రూపొందించారు.

ఈ ప్రాంతంలో స్థలం చాలా ఖరీదుగానే ఉంటుంది. దాదాపు 600 గజాల స్థలం ఈ భవన నిర్మాణం కోసం ఇటీవల కొద్ది కాలం కిందట ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు కింద కొనుగోలు చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయితే ట్రస్టు కార్యకలాపాలన్నీ దీని కేంద్రంగానే సాగనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్‌ ట్రస్టు భవనం నుంచే కార్యాక్రమాల నిర్వహణ జరుగుతోంది. విజయవాడలో నిర్మించే ఈ భవనం పూర్తి అయితే హైదరాబాద్‌లో పని చేస్తున్న సిబ్బందిలో కొంత మంది విజయవాడకు బదిలీ కానున్నారు. దీంతో పాటుగా అవసరాన్ని బట్టి స్థానికంగా విజయవాడలో కూడా నియామకాలు చేపట్టేందుకు కూడా ఆలోచనలు చేస్తున్నారు.
ఎన్టీఆర్‌ ట్రస్టు కింద చాలా రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్య రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను ఎక్కువ స్థాయిలో నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు విద్య, వైద్యం అందిస్తున్నారు. విజయవాడలో నిర్మించే భవనం పూర్తి అయితే ఇక్కడ తలసేమియా కేర్‌ సెంటర్, బ్లడ్‌ బ్యాంక్‌లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ట్రస్టు ద్వారా తలసేమి రోగులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. తలసేమియా కేర్‌ సెంటర్‌ నుంచే వైద్య సేవలు, రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు.
తలసేమియా రోగుల వైద్య సేవల నిమిత్తం ఇటీవల ఫిబ్రవరిలో పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ నేతృత్వంలో భారీ మ్యూజికల్‌ నైట్‌ను నిర్వహించారు. సీఎం చంద్రబాబు భారత్య భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ పెద్ద ఈవెంట్‌కు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మ ంత్రి లోకేష్, ఎమ్మల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర పెద్దలు, అధికారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని తలసేమియా రోగుల వైద్య సేవల నిమిత్తం ఉపయోగిస్తామని భువనేశ్వరి ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ రూ. 50లక్షల విరాళాన్ని ఎన్టీఆర్‌ ట్రస్టుకు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భువనేశ్వరి తన కార్యక్రమాలను ఏపీలో విస్లృతం చేయాలనే ఆలోచనల్లో ఉన్నారు. తెలంగాణలో పార్టీ లేక పోవడంతో ఏపీ మీదనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దీంతో పాటు తమ కూటమి అధికారంలో ఉండటంతో భువనేశ్వరి తన సేవా కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టేందకు కూడా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవనం ఏర్పాటుకు తెర తీసారు.
Next Story