ఎన్డీఏలో ఏపీ కీలక భాగస్వామి. కేంద్రం మంత్రి, కేంద్ర అధికారుల బృందం వరద పరిస్థితులను చూశారు. అయినా ఏపీలో జరిగిన ఘోర విపత్తుకు కేంద్రం అందించే సాయం ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విపత్తు జరిగింది. కుటుంబాలకు కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. నేటికీ పడుకునేందుకు చోటు లేని కుటుంబాలు లెక్కల్లో చెప్పలేని పరిస్థితి. ఈ ఘోర విపత్తును ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందా? అంటే మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. సెప్టెంబరు నెల 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు విజయవాడలోని సగం నగరం వరద నీటిలో మునిగి పోయింది. ఇంతటి ఘోరం ఇంత ముందెన్నడు జరగ లేదు. జరిగిన ఈ ఘోర విపత్తుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష సాక్షి. ఆయన వారం రోజుల పాటు నిద్రాహారాలు మాని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నారు. అర్థ రాత్రి వరకు వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లపై తిరిగారు. ప్రతి ఇంటిలో ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో, ఎన్ని కష్టాలను అనుభవిస్తుందో స్వయంగా తన కళ్లతో చూశారు. మీ కన్నీటి కష్టాలు నా కష్టాలతో సమానం. మీకు నేను ఉన్నాను. ఆదుకుంటాను. అవసరాలు తీరుస్తాను. కష్టాల నుంచి గట్టెకిస్తాను. నాది బాధ్యత. అంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. విజయవాడలో నీట మునగిన ప్రతి కుటుంబానికి రూ. 25వేలు ఆర్థిక సాయం, పై అంతస్తులో ఉన్న వారికి రూ. 10 వేలు, బైక్‌లకు రూ. 3వేలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తులు నీట మునిగితే దాని ఖర్చులు కూడా భరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొంత మందికి సహాయం అందింది. మరి కొంత మందికి సహాయం ఇంకా అందలేదు. సాయం కోసం వార్డు సచివాలయాల చుట్టు ప్రతి రోజు తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. వెయ్యి కోట్ల సాయం ఏ మూలకు.