దేవీ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మ వారు రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.


విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా విజయవాడ కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలు పేరుగాంచాయి. ఆ రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేక అంలకణలు చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. రెండో రోజు శుక్రవారం గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు ఉంటారు. స్వర్ణ పంచ ముఖాలు, బంగారం అభయ హస్తాలు, కంఠాభరణాలు, పచ్చల హారాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభన మూర్తిగా అమ్మవారు కొలువయ్యారు.

అయితే విజయవాడ కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలలో తొలిరోజు అయిన ý ురువారం భరీ సంఖ్యలోనే భక్తులు తరలి వచ్చారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమ్మ దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. ప్రొటోకాల్‌ కలిగిన వారికి తప్ప తక్కిన వారికి అంతరాలయ దర్శనాలను చాలావరకు నియంత్రించారు. అయితే వీఐపీల దర్శనాల వేళలను నిర్ణయించడం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇది వరకు నడుచుకుంటూ దసరా ఉత్సవాల ఐదో రోజుకు ఇక్కడకు చేరుకునేవారు. అయితే ఈ సారి మాత్రం నవరాత్రి ఉత్సవాల తొలిరోజు నుంచే వీరి రాక మొదలైంది. కాలినడకన వచ్చి దుర్గమ్మ దర్శనాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి దేవినేని ఉమా ఉచిత క్యూలోనే వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది విజయవాడ కనక దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. మొత్తం 56 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను దేవదాయ శాఖ విడుదల చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎక్కువ మంది నేతలకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. అయితే తొలి రోజు ఆదాయం రూ.20.25లక్షలు వచ్చింది. కనక దుర్గగుడిలో దసరా ఉత్సవాలు సందర్భంగా మొదటిరోజు గురువారం సాయంత్రం 5 గంటల వరకు రూ.20,25,000లు దేవస్థానానికి ఆదాయం వచ్చినట్టు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. రూ.500 టిక్కెట్ల ద్వారా 8,65000, రూ.300 టిక్కెట్ల ద్వారా 3,1500లు రూ.100 టిక్కెట్ల ద్వారా రూ.2,40,000, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.5,25,000, రూ. 300 టిక్కెట్లతో కూడిన పరోక్ష, ప్రత్యక్ష కుంకుమార్చన పూజల ద్వారా రూ.12,000, రూ. 500 టిక్కెట్లతో కూడిన పరోక్ష, ప్రత్యక్ష కుంకుమార్చన పూజల ద్వారా రూ.15,000, శ్రీ చక్ర నవావరణార్చన పూజల ద్వారా రూ.3,000, కేశఖండన టిక్కెట్‌ల ద్వారా రూ.50,000లు వచ్చినట్టు ఈవో తెలిపారు.
Next Story