శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలి.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వివక్ష నేపథ్యంలోనే రాష్ట్రం విడిపోయిన సంగతిని గుర్తు చేస్తూ ... నేటి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరిగేలాగా పాలకులు కార్యాచరణ చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. అక్టోబర్ 1, 1953 న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణను పురస్కరించుకొని మంగళవారం నంద్యాల సమితి ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తదనంతరం తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలవడం మరల విడిపోవడంతో నాడు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగుతుందన్న విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ప్రభుత్వాలలో ఒక ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా, ఇంకొక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ కలిసిన నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించడాన్ని బొజ్జా తప్పు పట్టారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి అక్టోబర్ 1 న విడిపోయిన తెలుగు రాష్ట్రమే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుండటం వలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 వ తేదీన రాయలసీమ సాగునీటి సాధన సమితి గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇది కేవలం మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం కాదు. శ్రీ బాగ్ ఒడంబడిక స్ఫూర్తితో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణను గుర్తు చేసుకుంటూ, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ హక్కులను పాలకుల ముందుంచి సాధించుకునే దిశగా చేపడుతున్న కార్యక్రమం అని బొజ్జా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో రాయలసీమ సమాన అభివృద్ధి చెందేలాగా ప్రభుత్వ విధానాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
1 అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలి.
2 రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 42 శాతం నిధులు రాయలసీమకు కేటాయించాలి.
3 అభివృద్ధి చెందిన ప్రాంతాలతో రాయలసీమ సాగునీటి రంగం సమానాభివృద్ధి సాధించడానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నిధులు, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులను సాధించేలా కృషి చేయాలి.
4 రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు కర్మాగారం, మిగులు జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నికరజలాలు లభించేలాగా గోదావరి జలాల మళ్లింపు తదితర కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి.
4. కృష్ణానది యాజమాన్య బోర్డ్ కార్యాలయం, హైకోర్టు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలను రాయలసీమలో సత్వరమే ఏర్పాటు చెయ్యాలి.
6. రాయలసీమ చెరువుల నిర్మాణ, నిర్వహణ, వీటిని వాగులు, వంకలు, నదులు కాలువలతో అనుసంధానం, సామాజిక అడవుల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ, పెన్నా నది పునరుజ్జీవనం కోసం ప్రత్యేక పర్యావరణ కమిషన్ ఏర్పాటు చెయ్యాలి.
7. పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ఏర్పాటుచేసిన అనేక సంస్థలను లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉర్దూ యూనివర్సిటీ, విద్యుత్ నియంత్రణ కార్యాలయం, కొప్పెరలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం, లా యూనివర్సిటీలలో వివిధ కార్యాలయాల తరలింపు దిశగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను, ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి.
8. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్‌లను పూర్తిస్థాయిలో ఏర్పాటు దిశగా కార్యచరణ చేపట్టాలి.
9 సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్‌లను పూర్తిస్థాయిలో రాయలసీమలో ఏర్పాటు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రధాన కార్యాలయాలను, హార్టికల్చర్ కమిషనరేట్, హార్టికల్చర్ సంబంధించిన లాజిస్టిక్స్‌కు, గిడ్డంగులకు సంబంధించిన అనేక మౌలిక వసతుల ఏర్పాటు దిశగా తక్షణమే కార్యాచరణాన్ని చేపట్టాలి.
రాయలసీమ సమగ్రాభివృద్దిలో భాగంగా పైన తెలిపిన అంశాలు అమలయ్యేటట్లుగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై ఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు మహమ్మద్ పర్వేజ్, మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్, మనోజ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story