2020 సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యారు. 2047తో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఇంకుడు గుంతలంటే ఎగతాళి చేశారని, నేడు అవే కాపాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో నదుల అనుసంధానంతో నీటి భద్రత ఉండే విధంగా పని చేస్తామని అన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో తాను తీసుకొచ్చిన విజన్‌ 2020 గురించి ప్రస్తావన చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపేందుకు విజన్‌ 2047 డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రజల తలరాతలను, భావి తరాల భవిష్యత్‌ను మార్చే డాక్యుమెంట్‌ అని అభివర్ణించారు. ఇది సరి కొత్త చరిత్రకు నాంది అని అన్నారు. రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల తమకున్న బాధ్యతకు ఇది నిదర్శనమన్నారు. 3వేల డాలర్లు కంటే తక్కువుగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి 42వేల డాలర్లు పెరగాలన్నది తమ లక్ష్యమన్నారు. దాదాపు 17 లక్షల మంది అభిప్రాయాలు.. ఆలోచనలు తీసుకొని ఈ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు తెలిపారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటమే ఈ విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యమన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాలని, పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలన్నారు. పీ4తో పేదరిక నిర్మూలన చేస్తామన్నారు. ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే రెండో సూత్రంగా ఉండాలన్నారు. నైపుణ్యాభివృద్ధి ఇక్షణలు ఇప్పించి, మానవ వనరులను అభివృద్ధి చేయడం మూడో సూత్రమన్నారు. నీటికి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనేది నాలుగో సూత్రమని అన్నారు. వ్యవసాయానికి, సాంకేతికతను అనుసంధానం చేయడం ఆరో సూత్రమన్నారు.

ప్రస్తుతం రూ. 16.41లక్షల కోట్లుగా ఉన్న ఏపీ జీడీపీని 2047 నాటికి రూ. 2 కోట్ల కోట్లకు తీసుకెళ్లడమే విజన్‌ ప్రధాన లక్ష్యమన్నారు. ఏపీలో తయారయ్యే ప్రతి వస్తువుకు అదనపు విలువ జోడించి గ్లోబల్‌ బ్రాండ్‌ సృష్టించడం, తద్వారా దానిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేయడం చేస్తామన్నారు. 2020 సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యారు. 2047తో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి ఆయన స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రులు అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌పై ప్రతిజ్ఞ చేశారు.
Next Story