ప్రకాశం జిల్లాలో ఓటర్లు ఎవరివైపు చూస్తున్నారు. ఎనిమిది నియోజకవర్గాల్లో ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.


విభజిత ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చర్చగా మారింది. మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా ఐదు నియోజకవర్గాల్లో జనరల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన మూడింటిలో రెండు టీడీపీ ఖాతాకు వెళతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొండపి నియోకర్గానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ ను అభ్యర్థిగా వైఎస్సార్సీపీ రాజకీయ బదిలీ చేసింది. ఈ బదిలీ వల్ల నియోజకవర్గంలో కొత్తకొత్తగా సురేశ్ కు ఉంది. నాయకులతో పాటు కార్యకర్తలు కూడా సురేశ్ ను మొదటి నుంచి సరిగా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పోటీకి దిగారు. వేమూరు నుంచి సంతనూతలపాడుకు వైఎస్సార్సీపీ రాజకీయ బదిలీ చేసింది. ఈయనను కూడా ఈ నియోజకవర్గంలోని వారు సరిగా స్వాగతించడం లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ ను అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించింది. నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్సార్సీపీ వారిని గెలిపిస్తూ వస్తున్నది. అదే పరిస్థితి రానున్న ఎన్నికల్లోనూ కంటిన్యూ అవుతుందని, వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఓటర్లు పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి.

జనరల్ స్థానాలకు సంబంధించి ఒంగోలు నుంచి అధికార పార్టీ తరపున మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన పార్టీ నుంచి పోటీచేయాలా? వద్దా? అనే విషయమై చివరి వరకు ఊగిసలాడారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తారని మొదట అందరూ భావించారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్ది మాత్రం మాగుంటకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీకి దిగారు. మాగుంటకు సీటు ఇవ్వాలని బాలినేని సీఎం వద్ద ఎంత పట్టుపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒంగోలుకు ఏ మాత్రం సంబంధం లేని తిరుపతి నివాసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా జగన్ రంగంలోకి దించారు. ఐదేళ్ల కాలంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారని, టీడీపీ హయాంలో జరిగిన అభివ్రుద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరగలేదనే విమర్శ ఉంది. పైగా బాలినేని కుమారుడు ఓటర్లను చులకనగా చూశారని, ఆ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోకుండా వదిలేయడం వల్లనే ఆయనపై ప్రజలకు నమ్మకం తగ్గిందనే ప్రచారం సాగుతోంది. ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న బాలినేని గెలుపు నల్లేరుపై నడక కాదనే పలువురు రాజనీతి మేధావులు వ్యాఖ్యానించడం విశేషం. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజలకు చేరువగా ఉన్నారని పలువురు చర్చించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కనిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ రంగంలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరుకు రాజకీయ బదిలీ చేయడంతో ఇక్కడ మరో యాదవ్ కు అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో ముక్కు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. తిరిగి పోటీ చేస్తుండటంతో స్థానిక ప్రజల నుంచి ఆదరణ బాగానే వుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివ్రుద్ధి అనే మాటకు అర్థం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి.

ఇక గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును మార్కాపురానికి మార్చి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని గిద్దలూరు అభ్యర్థిగా వైఎస్సార్సీపీ మార్చింది. గిద్దలూరులో టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. తిరిగి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో హోల్డ్ ఉన్న నాగార్జున రెడ్డి గిద్దలూరు పోవడం వల్ల గెలుపు అంత సులువు కాదనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఈయన పోటీ చేసి ఓడిపోయారు. అన్నా వెంటకరాంబాబు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మార్కాపురం నుంచి పోటీ చేస్తున్నారు. రాంబాబు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికే పట్టు ఎక్కువ ఉందనే వాదన ఉంది. ఇక దర్శి నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి నుంచి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టపాటి నర్సయ్య కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే మొదటి నుంచీ ఈ నియోజకవర్గంలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు ఓటర్లు పెద్ద పీట వేశారు.

Next Story