
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిండి లోనూ ఇంత తేడానా?
చట్టసభలు రెండూ ఒకటి కాదా, శాసన సభల్లో 'రెండు గ్లాసుల థీరీ'
మనిషిని మనిషిగా చూడలేని మూఢ విశ్వాసాల గురించి చదివాం, అంటరానితనంతో ఏర్పడిన కుల వ్యవస్థను, స్వాతంత్య్రం తర్వాతా సాగిన రెండు గ్లాసుల పద్ధతిని విన్నాం, చదివాం.. ఇప్పుడు తాజాగా శాసనాలు తయారు చేసే ప్రజా ప్రతినిధుల్లోనూ వివక్ష ఉంటుందని సాక్షాత్తు చట్టసభల్లోనే చూస్తున్నాం.
ఈ ఆధునిక కుల, వర్ణ వివక్షకు ప్రత్యక్ష నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు వాపోయిన తీరు సమాజాన్నీ కలవరపర్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వేర్వేరుగా చూడడం, ఎమ్మెల్యేలకు మేలైన తిండి, ఎమ్మెల్యేలకు నాసిరకం తిండి పెట్టడం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి రెండూ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. పక్కపక్కనే ఉంటాయి. సభలు జరుగుతున్నప్పుడు భోజనాలు, కాఫీలు, ఇతర సదుపాయాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ కూడా ఒకరే. అయినా రెండూ చోట్లా వడ్డించే ఆహార పదార్థాలు మాత్రం ఒకటి కావు. సాక్షాత్తూ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు రాష్ట్ర మంత్రుల దృష్టికి ఈ విషయం తీసుకువచ్చారు. శాసనసభ కార్యకలాపాలు చూసే కార్యదర్శి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చినా ఎమ్మెల్సీల పట్ల వివక్ష కొనసాగుతోందని వాపోయారు. ఈ సమయంలో సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్, రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు చూసే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన భరిత స్వరంతో 'చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంటుందని' అన్నారు.
నిజానికి రెండు సభలు ఆమోదిస్తేనే బిల్లులు చట్టమవుతాయి. అయినా సరే ఆ రెండు సభల్లోని ప్రజాప్రతినిధులకు వేర్వేరు పదార్థాలతో భోజనం వడ్డించడమేమిటని ఎమ్మెల్సీలు నిలదీశారు. నిరసన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులైన వీళ్ల విషయంలోనే నయా వివక్షకొనసాగుతుంటే నిచ్చెనమెట్ల వ్యవస్థలో కుల వివక్ష, తిండి వివక్ష, వర్ణ వివక్ష కొనసాగకుండా ఉంటుందా?
గతం మనకు ఏమి నేర్పింది?
మనిషిని మనిషిగా చూడని సమాజానికి ఉదాహరణలు మన చరిత్రలో అనేకం కనిపిస్తాయి. శతాబ్దాల పాటు మన సమాజం “మూఢాచారాలు, కులవ్యవస్థ” విశ్వాసాలపై నడిచింది.
అంటరానితనం అనే రాక్షసి యుగాల పాటు పేదలు, బలహీన వర్గాలను మానవ హక్కుల నుండి దూరం చేసింది.
స్వాతంత్య్రం తర్వాతా రెండు గ్లాసుల థీరీ కొనసాగింది. కాఫీ తాగే దుకాణాల్లో ఒక్క కప్పు పేదలైన తక్కువ కులాల వారికీ, మరో కప్పు ఉన్నతవర్గాలైన అగ్రవర్ణాల వారికీ భేదభావం మన కళ్ల ముందే కొనసాగింది.
శాసనమండలి ఘటన – చరిత్ర పునరావృతమా?
ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా దాదాపు అదే భావనతో చట్టసభల్లోనే వివక్ష కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు వ్యక్తం చేసిన వేదనే భోజనంలోనూ అసమానత. ఇది నిజంగా ఘోరమైన అవమానం. ఒకే భవనం, ఒకటే విధులు, ఒకటే హోదా అయినా తిండిలో వివక్ష. ఎవరి వత్తాసు లేకుండానే ఓకే కాంట్రాక్టర్ ఇంత సాహసానికి ఒడిగట్టగలరా? మరో మాటలో చెప్పాలంటే “ ప్రజా ప్రతినిధులు అందరూ ఒకే తరహా కాదు” అని చెప్పినట్టే.
ఇది కేవలం ఒక క్యాంటీన్ విషయమా? కాదు. సమాజంలో పాతుకుపోయిన ద్వంద్వ చింతనకు ప్రతిబింబం.
సమాజానికి విసిరిన ప్రశ్నలెన్నో...
ఈ సంఘటన 3 గంభీరమైన ప్రశ్నలను సమాజంపైకి విసిరింది.
1. ప్రజలందరికీ సమానత్వం వాగ్దానం చేసే చట్టసభలలోనే అసమానత్వం ఉంటే, సమాజానికి ఎటువంటి నైతిక పాఠం అందుతుంది?
2. ప్రజా ప్రతినిధుల్లోనే ఇంత అసమానత ఉంటే, వారిని ఎన్నుకున్న ప్రజల్ని సమానంగా భావిస్తారా?
3. సమాజం ఎటు దారి తీస్తోంది – ఆధునికత వైపు లేదా పాత రాతియుగం వైపా?
4. భవిష్యత్ తరానికి ఏమి సంకేతం ఇస్తున్నట్టు? ఇప్పటికీ అంటే 2025లోనూ శాసనమండలిలో క్యాంటీన్‌లో వివక్ష కొనసాగింది అని భావితరాలు చదువుతుంటే సిగ్గుతో సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండదా, ఇలాంటి పాఠాన్ని చదివిన యువతరం- సమజాం నిజంగా సమానత్వం వైపు పోతుందా? అని ప్రశ్నించక మానదు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కుల వివక్షపై చెప్పిన మాటలు ఈ సందర్భంలో గుర్తుచేసుకోక తప్పదు. “Caste is not just a division of labour, it is a division of labourers.” కులం కేవలం పనుల విభజన కాదు; అది పని వారిని హీన–ఉన్నత స్థాయిలలో విడగొట్టే యంత్రాంగం. ఎటు తిరిగినా కులం అనే రాక్షసి మన దారిలో అడ్డుగా నిలుస్తుంది. సమానత్వం కల్పనలా కనిపించినా, సమాజాన్ని నడిపించే సూత్రం అదే కావాలి అంటారు అంబేడ్కర్. కుల వ్యవస్థలోంచే అంటరానితనం ఉత్పన్నమవుతుంది. కులవ్యవస్థ తొలిగితే, అంటరానితనం కూడా అంతరించిపోతుంది. కాని అది ఎప్పటికి తొలుగుతుందన్నదే ప్రశ్న.
చట్టసభల్లోనే కొనసాగుతున్న ఈ వివక్ష అంబేడ్కర్ కలలు కన్న సమానత్వ సమాజం కనుచూపు మేరలో లేదన్న విషయాన్నే గుర్తుచేస్తోంది.
ఒకే ప్రాంగణంలో రెండు సభలు ఉండి, బిల్లులు రెండూ కలసి చట్టమవుతాయి. కానీ ప్రతినిధులకు భోజనం మాత్రం వేర్వేరుగా వడ్డించడం- ప్రజాస్వామ్యానికి అవమానం.
ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికల్లోనే అసమానత కనిపిస్తే, సాధారణ ప్రజలు న్యాయం, సమానత్వంపై విశ్వాసం కోల్పోక మానరు. ఇది కేవలం ఆహారం గురించి కాదు.. ఇది మన విలువల పతనం గురించి.
భావస్పోరకంగా చూసినా ఆహారం మనిషిని కలిపే అంశం. అదే విభజనకు కారణమైతే, అది మానవ విలువల పరాజయం. సాధికారికంగా సభాపతులు, చైర్మన్‌లు, ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి.
సమాజం ఎంత ముందుకెళ్లినా మనసులోని పాతకంపు, ఆధిపత్య ధోరణి ఇంకా పోలేదన్నది శాసనమండలి క్యాంటీన్ ఘటన స్పష్టం చేస్తోంది. మనిషిని మనిషిగా చూడటం అంటే ఒకే పళ్లెంలో అన్నం వడ్డించగలగడం. అది చేయలేకపోతే, శాసనాలు రాసే సభలు ఎంత ఆధునికంగా కనిపించినా, మనసు మాత్రం మధ్యయుగాల గోడలలోనే బంధీ అయినట్టు భావించాల్సి వస్తోంది.
Next Story