
ఒక చేత్తో మద్యం గ్లాస్, మరో చేత్తో డీ-అడిక్షన్ బ్రోచర్
మద్యం వసూళ్లలో దాహం – మత్తు వదిలించడానికి మాత్రం నిధులు విదిల్చం
ఆంధ్రప్రదేశ్ లో మద్యం వివాదాలకు ఇప్పుడిప్పుడే తెర పడే సూచనలు కనిపించడం లేదు. జగన్ హయాంలో నాసిరకం మద్యం విక్రయించారన్న ఆరోపణలు వస్తే ఇప్పుడు అసలు ఫ్యాక్టరీలే నకిలీవంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా బాధితులు మాత్రం మద్యం ప్రియులే. ఈ వ్యసనానికి బానిసలై వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. వందల కోట్ల రూపాయలలో చేతులు కాల్చుకోవడంతో పాటు ఆస్పత్రుల పాలై రోగాలు రొష్టులతో సతమతం అవుతున్నారు.
ఈనేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ మద్యం వ్యసనపరులను దాని నుంచి విముక్తం చేసేందుకు డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ తాజా ప్రకటన ప్రస్తుతం వివాదంగా మారింది. మద్యంపై వస్తున్న ఆదాయానికి డీ అడిక్షన్ సెంటర్లపై ఖర్చు చేస్తున్న దానికి అసలు పొంతనే లేకుండా ఉందని ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం రూపేణా ఏటా సుమారు రూ.30వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఖజానాను నింపుతున్న ప్రధాన వనరుల్లో మద్యం ఒకటి. అయితే మద్యం వల్ల అవస్థల పాలవుతున్న వారికి కేవలం 33.80 కోట్లు పెడతానంటూ ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
2024-2025లో కేవలం పది నెలల కాలంలో 3వేల కోట్ల రూపాయలు మద్యంపై ఆర్జించిన ప్రభుత్వం 21 డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2023-24 (ఏప్రిల్–జనవరి)లో ₹20,964 కోట్లు, 2024-25 (ఏప్రిల్–జనవరి)లో ₹23,988 కోట్లు వ్యాపారం చేసింది ప్రభుత్వం.
వైద్య ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం.. మద్యం కారణంగా కాలేయం వ్యాధుల బారినపడిన వారు 2014-19 మధ్య 14,026 మంది ఉంటే, 2019-24 మధ్య ఆ సంఖ్య 29,369కి పెరిగింది. వారిలో 4,850 మంది మహిళలూ ఉన్నారు. నరాల బలహీనతతో నాడీ వ్యవస్థ దెబ్బతిన్నవారు 2014-19 మధ్య 1,276 మంది ఉండగా, 2019-24 మధ్య ఆ సంఖ్య ఏకంగా 12,663కు చేరింది. ఇక మద్యంతో కిడ్నీ వ్యాధుల బారినపడినవారు 2014-19 మధ్య 49,060 మంది ఉంటే, 2019-24 మధ్య ఆ సంఖ్య 90,385కు పెరిగింది. 2024-2025లో ఆ సంఖ్య లక్ష దాటిందనేది అనధికార అంచనా.
ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డీ-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు తెరపైకి వచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ రూ.33.80 కోట్లు విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో అవసరమైన వైద్య పరికరాలు, డయగ్నస్టిక్ కిట్లు, ఔషధాలు, సాంకేతిక ఆధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సిబ్బందికి ప్రోత్సాహకాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగం, మద్యం దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఉన్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 డీ-అడిక్షన్ సెంటర్లు (టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో పనిచేస్తున్నవి) భాగమవుతున్నాయి.
ప్రభుత్వ డేటా ప్రకారం, డీ-అడిక్షన్ సెంటర్లలో 2023–24లో 18,147 ఇన్-పేషెంట్లు, 1.65 లక్షల అవుట్-పేషెంట్లు సేవలు పొందగా, 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు 22,909 ఇన్-పేషెంట్లు, 1.30 లక్షల అవుట్-పేషెంట్లు నమోదయ్యారు.
మంత్రి చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్రంలో డీ-అడిక్షన్ సెంటర్ల నిర్వహణకు, జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.6 కోట్లు నిధులు కేటాయిస్తోంది. అలాగే ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తూ, వాలంటీర్లు, ఎన్‌జీవోలు సహకారంతో డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆరోగ్యశాఖ పంపిన ప్రతిపాదనలను ఎక్సైజ్ విభాగం పరిశీలిస్తోంది. డీ-అడిక్షన్ సెంటర్లు ప్రత్యేకమైన చికిత్సా సేవలు, కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా వ్యసనగ్రస్తులకు కొత్త జీవితాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి కూడా చెబుతున్నారు.
ఏటేటా మద్యంపై వస్తున్న ఆదాయం పెరుగుతున్నా డీ అడిక్షన్ సెంటర్లపై ఖర్చు పెంచడానికి మాత్రం ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయని మద్యపాన నియంత్రణ కమిటీ మాజీ సభ్యుడు డాక్టర్ జి. విజయసారథి అన్నారు. ఈ మొత్తాన్ని పెంచడంతో పాటు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.
మందు అలవాటు మాన్పించడంపై అనుమానాలెన్నో...
భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ప్రభుత్వం డీ-అడిక్షన్ సెంటర్లకు రూ.33.80 కోట్లు ప్రతిపాదించడం ఒక పరస్పర విరుద్ధ ధోరణిగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
"ఒకవైపు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ, మరోవైపు డీ అడిక్షన్ నివారణ కేంద్రాలకు నామమాత్రపు నిధులు కేటాయించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది" అని ఆరోగ్య రంగ విశ్లేషకులు అంటున్నారు.
2024-25లో మద్యం విక్రయాలు ₹30,000 కోట్లు చేరడం అంటే, మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్టే అర్థం చేసుకోవాలి. అందువల్ల డీ-అడిక్షన్ సెంటర్ల అవసరం మరింత పెరుగుతుంది. మద్యం వినియోగం పెరిగితే, అంతే స్థాయిలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, సామాజిక సమస్యలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 21 డీ-అడిక్షన్ సెంటర్లు (టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో) ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ పెరుగుతున్న వినియోగానికి తగినట్టు ఇవి సరిపోవు. ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్ అవసరం అని నిపుణులు అంటున్నారు.
మద్య పాన నియంత్రణ కోసం కృషి చేస్తున్న అనేక మంది ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రంలో డీ-అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెంచాలి. ప్రస్తుతం 21 ఉన్నా వాటి సంఖ్యను కనీసం 50–60కి పెంచాలి.
గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెరగాలి. నషా ముక్త్ భారత్ అభియాన్ అనేది కేవలం ఫార్మాలిటీగా కాకుండా, స్కూల్, కాలేజ్, వర్క్‌ప్లేస్ వరకు చేరాలి. అప్పుడే ప్రజల్లో మద్యం పట్ల విముఖత కలుగుతుంది.
Next Story