Sanjeevkumar ana Kesineni Nani MPs

ఏపీలో రాజకీయ చదరంగం కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ఆట మరింత వేగంగా ముందకు సాగుతోంది.


తెలుగుదేశం నుంచి ఒక ఎంపీ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఒక ఎంపీ బయటకు పోయారు. వీరిరువురూ తమ పదవులకు, పార్టీలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇల్లు వేదిక కావడం విశేషం.

తనకు టిక్కెట్‌ ఇవ్వాలని సొంతపార్టీకి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్‌ సింగరి సంజీవకుమార్‌ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాకు టిక్కెట్‌ ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇరువురూ ఇప్పటి వరకు పనిచేసిన పార్టీలపై నిప్పులు చెరిగారు. ఒకరు ఆస్తులు అమ్ముకున్నానంటే మరొకరు నాకు జగన్‌ తీరని అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల నుంచి నన్ను ఎంపీగా చంద్రబాబు చూడలేదు. అడుగడుగునా ఇబ్బందులు పెట్టాడు. అందుకే అవమానాలు భరించి ఆపార్టీలో ఉండాలనుకోవడం లేదని ఎంపీనాని ఆవేదన వెళ్లగక్కారు.
ఐదేళ్లలో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో కనీసం 10శాతం అభివృద్ధి కూడా చేయలేకపోయా. ప్రభుత్వం సహకరించలేదు. కేంద్రం నుంచి కావాల్సిన పనులను నేను దగ్గరుండి చేయించినా వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సహకారం ఇవ్వలేదు. ఐదేళ్లలో రెండు సార్లు సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిసా. ఫోన్లకు, సందేహాలకు సమాధానాలు ఉండవు. కరువు సీమను బాగు చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రిలో అసలు లేదు. అందుకే రాజీనామా అన్నారు సంజీవ్‌కుమార్‌. బీసీలపై జగన్‌కు ఏ మాత్రం ప్రేమలేదనేది నా విషయంలోనే రుజువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
నానీ ఐదేళ్లు బాధలు భరించి ఎందుకున్నారు..


ఐదేళ్లు పార్టీలోని వారు పెడుతున్న బాధలు భరించారు. పదవి కోసమేనా.. అంటే కాదు.. విజయవాడ ప్రజల కోసమని ఎంపీ నానీ అనడం పలువురిలో నవ్వు తెప్పిస్తున్నది. ఈ రోజుల్లో ప్రజల కోసం అవమానాలు భరించే వారు ఉన్నారా? ఇది వింతగా లేదూ.. అనే మాటలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. పార్టీలో ఎవరిమధ్య ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయో కానీ విజయవాడ ప్రజలతో టీడీపీ పెద్దలు ఆడుకున్నారని అర్థమవుతుంది. ఎంపీ నానీ తన కుమార్తెను విజయవాడ మునిసిపల్‌ ఎన్నికల్లో గెలిపించి మేయర్‌ను చేయించేందుకు తాపత్రయ పడ్డారు. చంద్రబాబు చేయమంటేనే చేశానని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు భార్యను మేయర్‌గా ప్రతిపాదించారంట అదే జరిగితే చాలా ప్రమాదం అని చెప్పిందే చంద్రబాబు అని నానీ సెలవిచ్చారు. మరి అటువంటప్పుడు బొండా ఉమాకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఇస్తారా? ఆలోచించాల్సి ఉంది. విజయవాడ అభివృద్ది అంటే రెండు ఓవర్‌ బ్రిడ్జీలు కట్టడమేనా? అనే సందేహాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని టీడీపీ స్పష్టం చేసిన తరువాత వైఎస్సార్‌సీపీ పంచన చేరారు. అంటే అంతకు ముందునుంచే సీఎంతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే సందేహం ఎవరికైనా వస్తుంది.
జగన్‌పై నేతల్లో ఎందుకింత అసంతృప్తి


మమ్మల్ని చెయ్యనివ్వరు.. ఆయన చెయ్యరు. ఇదీ వైఎస్సార్‌సీపీ నేతల నోట వస్తున్న మాట. అంతానేనేననే భ్రమలో జగన్‌ ఉన్నారు. ఆయనతో ఎవరు ఏమి చెప్పినా విని గాలికొదిలేస్తారు. ఏమి చెయ్యాలనుకుంటారో అది చేస్తారు. లేకుంటే అభ్యర్థుల కోసం సర్వేలు ఏంటి? పాలకులకు తెలివి లేదా? ప్రజలకు ఏమి చేస్తే గెలుస్తారో తెలియదా? అనే సందేహాలు నేతలను వెన్నాడుతున్నాయి. ఐదు సర్వే సంస్థలతో ముఖ్యమంత్రి జగన్‌ సర్వేలు చేయించి చట్ట ప్రతినిధులతో ఆటాడుకుంటున్నాడు. నువ్వు ఇక్కడుండు. నువ్వు పనికిరావు అక్కడుండు. అంటూ అటుఇటు ఆడేస్తున్నాడు. వరుసగా ఈ ఆట నెల రోజుల నుంచి కొనసాగుతున్నది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కర్నూలు ఎంపీ సీఎంను కలవడానికి వస్తే నో ఎంట్రీ అనేశారు సెక్యూరిటీ వారు. ఇదీ ప్రజా ప్రతినిధులపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ. నియోజకవర్గంలో కనీసం పది శాతం అభివృద్ధి కూడా చేయలేకపోయానంటే అది కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లనేనని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ చెప్పడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ఆయన బటన్‌ నొక్కితే మేమెందుకు? చట్ట సభలెందుకు? బటన్‌లు నొక్కి పాలన సాగిస్తేపోలా అనే వాదన ఎమ్మెల్యేల్లో ఉంది. ఇప్పటి వరకు అదే జరిగింది. అందుకే నాకు నచ్చిన వారు ఉంటారు. నచ్చని వారు పోతారని జగన్‌ భావించినట్లున్నారు. ఎవరు ఏమన్నా ఆయన చేస్తున్నది చేసుకుంటూ పోతున్నారు.
ఐదేళ్లుగా పోరాటంలోనే రఘురామకృష్ణంరాజు


నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచారు. నాలుగైదు నెలలు మాత్రమే ప్రశాతంగా ఉన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పోరు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని పార్లమెంట్‌ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ లెటర్‌ ఇచ్చింది. అయినా ఏమీ కాలేదు. ఆయన రాజీనామా చేయలేదు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ ఎంపీగానే ఉంటూ వైఎస్‌ జగన్‌పై పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఏపీ రాజకీయాల్లో ఆటలు సై.. సుయ్‌.. మంటూ కొనసాగుతున్నాయి. వారం క్రితం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న వాళ్లు ఇప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇది దేనికి సంకేతమో ఆలోచించాల్సి ఉంది. మహాకవి శ్రీశ్రీ ఓమాట చెప్పారు. ‘మీదారిన మీరు పోండి.. నాదారి నాకు వదలండి’ ఎప్పుడో చెప్పిన ఈ మాటలు వింటుంటే ఇది నిజమే కదా అనిపిస్తుంది. నిజాయితీగా పనిచేస్తున్న నీతి పరుడు 2వేల కోట్లు రాజకీయాల్లో పోగొట్టుకున్నానంటున్నాడు, ఎందుకిలా జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో అందరూ కోటాను కోట్లు సంపాదిస్తుంటే ఈయనెలా పోగొట్టుకుంటారని పలువురు వ్యాఖ్యానించడం కొసమెరుపు.


Next Story