సినర్జీ ప్రమాద బాధితుల్లో ఒకరు మృతి..
x

సినర్జీ ప్రమాద బాధితుల్లో ఒకరు మృతి..

అనకాపల్లి జిల్లాలోని ఫార్మా పరిశ్రమల్లో కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.


అనకాపల్లి జిల్లాలోని ఫార్మా పరిశ్రమల్లో కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎసెన్షియా ఘటన షాక్ నుంచి కోలుకోకముందే పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జి యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ మూడో యూనిట్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వారిలో ఒకరు ఈరోజు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ప్రమాదంలో కెమిస్ట్ కొవ్వాడ సూర్యనారాయణ(36), ఝార్ఖండ్‌కు చెందిన ఓయబోం కొర్హ(24), రొయా అంగిరియా(22), లాల్‌సింగ్ పూర్త్(24) గాయాలపాలయ్యారు. వీరిలో అంగీరియా కొద్ది సేపటి క్రితమే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురు పరిస్థితి ఇప్పటికి కూడా కాస్తంత విషమంగా ఉందని వారు వివరించారు.

ఏం జరిగిందంటే..

సినర్జిన్‌ యాక్టివ్‌ ఇంగ్రిడియన్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే సంఘటన అర్ధర్రాతి జరిగినా శుక్రవారం ఉదయం 9 గంటల వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను విశాఖపట్నంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ కంపెనీ 24 గంటలు పనిచేస్తుంది. కార్మికులు షిఫ్ట్‌ల ప్రకారం పనిచేస్తారు. రసాయనాలు, మందులు ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప లేకుంటే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రసాయనాలు కలిపే సమయంలో మిషనరీని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక మెడిసిన్‌ తయారీకి కావాల్సిన రకరకాల ఉత్పత్తులను కలపాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీలో ముడి మందును మిక్స్‌ చేసే సమయంలో వారికి ఉండాల్సిన షూట్స్‌ ఉండలేదని, యాజమాన్యం వారికి సరైన డ్రెస్‌లు ప్రొవైడ్‌ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు.

ఆరా తీసిన సీఎం

ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై, బాధ్యతుల పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేలా దర్యాప్తు చేపట్టాలని కూడా సూచించారు. మరి కాసేపట్లో హోం మంత్రి వంగలపూడి అనిత.. అనకాపల్లి ఫార్మాసిటీకి చేరుకోనున్నారు. అక్కడ ఈ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా ఫార్మా సంస్థల భద్రతపై స్థానిక అధికారులతో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ అంశంపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఘాటుగా స్పందించారు. ఈ ప్రమాదాల వెనక యాజమాన్యాల నిర్లక్ష్యమే కనిపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణం

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలకు యాజమాన్యాల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనబడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. లాభాలపై పెడుతున్న ఏకాగ్రత సంస్థలో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ప్రతి పరిశ్రమ యాజమాన్యం కూడా భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘అతి త్వరలోనే పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. ప్రతి పరిశ్రమలో భద్రత ప్రమాణాలపై దర్యాప్తు చేయిస్తాం. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి సరైన భద్రత పాటించని సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. తద్వారా ఇటువంటి ప్రమాదాలు పునరావృత్థం కాకుండా నియంత్రణ సాధ్యమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

Read More
Next Story