పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి. దీంతో కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు. నాయకుడిని తోసేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం నియోకరవర్గం వార్తల్లోకి ఎక్కడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడం. ఎన్‌డీఏ కూటమి తరపున ఆయన పోటీ చేస్తున్నారు. పేరుకే కూటమి కాని అక్కడ బీజేపీ వారు అసలు కనిపించడం లేదు. టీడీపీవారు చెదురు మొదురుగా కనిపిస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా సరైన ప్రణాళికతో ముందుకు సాగటం లేదు. ఇంతకు అక్కడ ఏమి జరుగుతోంది. ఎవరు ఏమి చేస్తున్నారనేది చర్చకు దారి తీసింది.
వర్మ ఓవరాక్షన్..
తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్ వర్మ. గత ఎన్నికల్లో పెండెం దొరబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. పిఠాపురం అన్ని రాజకీయ పార్టీలకు ఆలవాలమైన నియోజకవర్గం. ఇక్కడి నుంచి సీపీఐ, ప్రజాపార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్–ఐ పార్టీ, బిజెపి, తెలుగుదేశం, పీఆర్‌పీ, వైఎస్సార్‌సీపీలు ఇక్కడ గెలిచాయి. అంటే అన్ని పార్టీలకు జనం అవకాశం కల్పించారు. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన శేషుకుమారికి సుమారు 28వేల ఓట్లు వచ్చాయి.
ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎన్‌డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రజల నుంచి సానుభూతి ఉన్నా ఎన్‌డీఏ కూటమిలోని పార్టీల నుంచి మాత్రం సరైన స్పందన కనిపించడం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వారు సరైన సపోర్టు చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్‌విఎస్‌ఎస్ వర్మ పవన్‌కళ్యాణ్ పక్కనే ఉంటూ రాజకీయంగా గోతులు తీస్తున్నారని కార్యకర్తలు అనడం విశేషం. రెండు రోజుల క్రితం పిఠాపురంలో వర్మను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టినంత పనిచేశారు. వర్మను చుట్టుముట్టిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ దూషించారు కూడా. ఏమి జరిగిందని ఆరాతీస్తే చాలా పెద్ద తప్పు చేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. మాకొకటి చెప్పి నాయకుడి వద్ద మరొకటి చెబుతున్నారని అంటున్నారు.
పవన్ వద్ద వర్మ మంచి వాడు.. మేము చెడ్డవాళ్లం..
పవన్‌కళ్యాణ్‌తో తిరుగుతున్న వర్మ మమ్మల్ని సహకరించొద్దని చెబుతున్నారు. దీంతో మేము కాస్త దూరంగా ఉంటున్నాము. పవన్‌కళ్యాణ్ వద్ద వర్మ మాత్రం మంచివాడని, కార్యకర్తలకే పెద్దగా ఇష్టం లేదనే అట్మాస్‌ఫియర్ తీసుకొచ్చారు. ఈతంతును గమనించిన కార్యకర్తలు పిఠాపురంలో రెండు రోజుల క్రితం వర్మను చుట్టుముట్టారు. చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ బూతులు తిట్టారు. కారెక్కు.. ఇక్కడుంటే పడతయ్.. అంటూ కేకలు వేశారు. బలవంతంగా కారులో ఎక్కించి ఊరిబయటకు వెళ్లే వరకు కార్యకర్తలు వెంటాడారు. అంటే వర్మ చేస్తున్న రాజకీయ చదరంగంలో తాము పావులుగా మారామని, ఈ విషయాన్ని పవన్‌కళ్యాణ్ వద్ద చెప్పాలనే ఆలోచనలో కొందరు కార్యకర్తలు ఉన్నారు.
పవన్ వద్దకు ఎంట్రీనే లేదట..
ప్రచారంలో ఉన్న పవన్‌కళ్యాణ్ వద్దకు కార్యకర్తలకు ఎంట్రీ దొరకడం లేదు. సెల్ఫీలు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రధానంగా జనసేన కార్యకర్తలకు కూడా నియోజకవర్గంలో సరైన గైడెన్స్ కూడా లేదని, ఎవరు ఏపని చేయాలో ఇంతవరకు చెప్పలేదని కార్యకర్తలు చెబుతున్నారు. కనీసం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టేందుకు ఎటువంటి ప్రచార సామాగ్రిని తీసుకు వెళ్లాలో కూడా నిర్థేశం లేదు. దీంతో జనసేన కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చిందని పలువురు నాయకులు చెబుతున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సక్రమంగా హాజరు కాకపోవడం, బీజేపీ వారు అసలు పట్టించుకోకపోవడం కూడా చర్చనియాంశంగా మారింది. చేబ్రోలులో ఇంటివద్ద అర్జీలు ఇద్దామంటే అవకాశమే లేకుండా పోయిందని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. అర్జీలు తీసుకునేందుకు క్యాంపు కార్యాలయం వద్ద ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Next Story