మంగళగిరి అభ్యర్థిని మార్చేసిన జగన్...
సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి అభ్యర్థులను మార్పు చేశారు. తాజాగా ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.
అభ్యర్థుల మార్పు ఇక ఉండదు.. ఇప్పటి వరకు మార్పు చేసిందే ఫైనల్. తక్కిన వాటిల్లో పాత వాళ్లే అభ్యర్థులుగా ఉంటారని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల మార్పుపై మాట తప్పారు. అభ్యర్థుల మార్పును కొనసాగిస్తూనే ఉన్నారు. మరో జాబితాను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి తాజాగా 9వ అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో ఒక పార్లమెంట్ స్థానంతో పాటు రెండు అసెంబ్లీల స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ ఎంపి అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేణుంబాకం విజయసాయిరెడ్డిని ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గానికి మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఎఎండి ఇంతియాజ్‌ను, మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి మురుగుడు లావణ్యను అభ్యర్థులుగా ప్రకటించారు.
నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి
వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. ఈయన నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. తాళ్లపూడిలో జన్మించారు. చార్టెడ్ అకౌంటెన్సీ చదివారు. తర్వాత ప్రముఖ చార్టెడ్ అకౌంటెడ్‌గా పేరు సంపాదించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో తన సంస్థలను విస్తరింప చేశారు. కొన్ని జాతీయ బ్యాంకులకు బోర్డు సభ్యునిగా పని చేశారు. ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టురుగా కూడా పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాపార సంస్థలకు కూడా విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా పని చేశారు. జగన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చారు. అనతి కాలంలోనే ఆ పార్టీ కీలక నేతగా మారారు. ఢిల్లీలో వైసిపి వ్యవహారలు చూసే కీలక బాధ్యతను కూడా ఆయనకే జగన్ అప్పగించారు. జగన్ తర్వాత విజయసాయిరెడ్డి రెండో స్థాయి లీడర్‌గా తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు.
కర్నూలు నుంచి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్
ఇంతియాజ్ మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. కర్నూలు జిల్లా కోడుమూరు వాస్తవ్యులు. ఇటీవలే ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి సిఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సెర్ప్ సీఈవోగా, సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్ గా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సిఎం నిర్వహించిన సరేల్లో రిపోర్టులు అనుకూలంగా రావడంతో ఇంతియాజ్‌కు టికెట్ ఖరారు చేశారు.
మంగళగిరికి మరుగుడు లావణ్య
మంగళగిరి నియోజక వర్గ వైసిపిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో పాటు మురుగుడు సత్యం, లావణ్య దంపతులు శుక్రవారం కలిసారు. ఇప్పటి వరకు గంజి చిరంజీవి మంగళగిరి నియోజక వర్గ వైసిపి ఇన్‌చార్జిగా ఉన్నారు. గత ఏడాది డిసెంబరు 11న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు నుంచి గంజి చిరంజీవిని నమన్వయ కర్తగా నియమిస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. రెండు నెలల పది రోజుల వ్యవధిలో చిరంజీవి మార్పుకు గురయ్యారు. మంగళగిరి చెందిన మురుగుడు లావణ్యను నియోజక వర్గ సమన్వయ కర్తగా శుక్రవారం విడుదల చేసిన జాబితాలో అవకాశం కల్పించారు. లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చిన్న కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు కుమార్తె. వీరిద్దరి రాజకీయ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సిఎం జగన్‌మోహన్ రెడ్డి వారి కోరిక మేరకు మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. లావణ్య బిఎస్సీ కంప్యూటర్స్, ఎంఏ తెలుగు లిటరేచర్ చదువుకున్నారు. ఈ నియామకంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
Next Story