ఎన్నికల వేదికగా ఒంగోలు సభ

ఒంగోలు మండలంలోని ఎన్‌ అగ్రహారంలో జరిగిన ముఖ్యమంత్రి అధికారిక సభ ఎన్నికల సభగా మారింది. ఇప్పటికే పలు చోట్ల సీఎం నిర్వహించిన ఎన్నికల సభలను తలపించింది.


ఎన్నికల వేదికగా ఒంగోలు సభ
x
YS Jagan, AP CM

ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన అధికారిక సభ ఎన్నికల సభగా మారింది. ఇక్కడ జరిగింది ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు, పట్టాల రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే కార్యక్రమం. అక్కడ మాట్లాడింది మాత్రం రాజకీయాలు. దానితో పాటు తాను చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకున్నారు. అయితే సభలో కాంగ్రెస్‌ గురించి కానీ, షర్మిల గురించి కానీ ప్రస్తావించలేదు.

బాబును దళారులు, రాక్షసులతో పోల్సిన జగన్‌
20,840 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సభ జరిగింది. సభలో చంద్రబాబు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగకుండా ఎలా అడ్డుకుంటున్నాడో వివరించారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పంచులు వేస్తున్నప్పుడు జనం నుంచి మంచి స్పందన వచ్చింది.
దళారులు, రాక్షసులతో యుద్దం చేయాల్సి వస్తోందని సీఎం చెప్పటం విశేషం. సినిమాల్లో వందమంది విలన్‌ లు, పురాణాల్లో లక్షల మంది రాక్షసుల ఎలా చేస్తారో చంద్రబాబు చేసే పనులు కూడా అలాగే వుంటాయన్నారు. ఎంతకు తెగించినా, ఎంతకు దిగజారినా అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇస్తాం. కోర్టు కేసులు ఒక్కటి కాదు, వంద కాదు సుమారు 11 వందల వరకు చంద్రబాబు వేయించాడని జగన్‌ చెప్పాడు.
తన గురించి చెప్పుకుంటూ చంద్రబాబుపై విమర్శలు
జగన్‌ తన పాలన గురించి చెప్పుకుంటూనే చంద్రబాబు వ్యవహార శైలిని తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సభలో పంచ్‌లపై పంచులు వేశారు. చంద్రబాబు భార్య కూడా కుప్పంలో ఆయనపై పంచులు వేసి బైబై బాబూ అని చెప్పిందన్నారు. రానున్న ఎన్నికలు పేదవానికి, పెత్తం దారుకు మధ్య జరిగే ఎన్నికలుగా వర్ణించారు. మేలు జరిగిందనుకుంటేనే నాకు ఓటు వేయండి, పైన దేవుడిని, కింద మిమ్మల్ని నమ్ముకున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలు చేసే వారితో యుద్దానికి దిగాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును సమర్థించే నాన్‌ రెసిడెన్స్‌ ఆంధ్రాస్‌ వారు, ఏనాడూ ఏపీలో లేని వారు, వారి సొంతూరు ఏదో తెలియని వారు మాత్రమేనని, అటువంటి వారితో యుద్దం చేయాల్సి వస్తోందన్నారు. పేరు పెట్టకుండా విమర్శ చేయడంతో ఎవరి గురించి మాట్లాడారో చాలా మందికి అర్థం కాలేదు. సభలో వరాల వర్షం కురిపించారు. ఇది కేవలం ఎన్నికల వరాలేనని చెప్పొచ్చు.
Next Story