ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపై సందిగ్ధం వీడింది. టీడీపీ ఎంపి అభ్యర్థిగా ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీకి దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల మూడో జాబితాను రెండురోజుల క్రితం విడుదల చేసింది. అందులో ఒంగోలు అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. కారణాలు ఏవైనా ఇప్పటి వరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి సీటు ఇప్పించాలనే పట్టుదలలో శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. దీంతో చంద్రబాబు నాయుడు రాఘవరెడ్డిపై పలు సర్వేలు నిర్వహించారు. ఫోన్ సర్వేలు, టీముల ద్వారా సర్వేలు చేయించారు. కుమారుని కంటే తండ్రినే ఎక్కువ మంది అభ్యర్థులు, ఓటర్లు కోరుకుంటున్నారు. దీంతో మాగుంట శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది.
మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీలో ఉంటారు
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీలో ఉంటారని ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ద్వారా మాగుంట కార్యాలయం నుంచి ఒక ప్రకటన సోమవారం సాయంత్రం విడుదలైంది. తెలుగుదేశం పార్టీ తరపున ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఉన్నట్లైతే రాష్ట్ర అభివృద్ది దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో పాటు కేంద్ర పథకాలు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడినట్లు రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యాయం సీనియర్ అయిన శ్రీనివాసులురెడ్డినే పోటీ చేయించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేసినందున శ్రీనివాసులురెడ్డి పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.
రాఘవరెడ్డి కోసం చేసిన ప్రయత్నం విఫలం
మాగుంట రాఘవరెడ్డి మాగుంట వ్యాపార సంస్థలను నిర్వహించడంలో ముందున్నారు. దీనికి తోడు అధికారం తోడు ఉంటే బాగుంటుందని భావించిన మాగుంట కుటుంబం రాఘవరెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను చాలా సార్లు అడిగారు. మాగుంట కుటుంబానికి సీటు ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమై చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారు. ఆ మేరకు చంద్రబాబు రాఘవరెడ్డికి కాకుండా శ్రీనివాసులురెడ్డి కే ఇచ్చేందుకు రెడీ అయ్యారు . ఈ మేరకు మాగుంట కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది. చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం పర్యటనలో ఉన్నందున పార్టీ కార్యాలయం వారు తెలిపారని తెలిసింది.
నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలిచారు. మొదట 1998లో రాజమోహన్ రెడ్డిపై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తరువాత 1999లో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకష్ణమూర్తిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. తిరిగి 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన బి విజయభారతిని ఓడించారు. ఆ తరువాత 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంఎం కొండయ్యను మాగుంట ఓడించారు. 2014లో మాగుంటకు సీటు రాలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డికి అధిష్టానం సీటు కేటాయించింది. దీంతో మాగుంట తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టింది. 2019లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి మాగుంటకు సీటు ఇప్పించారు. దీంతో ఆయన ఒంగోలు ఎంపీగా 2,14,851 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో మాగుంటకు సీటు ఇచ్చేందుకు వైఎస్ జగన్ నిరాకరించడంతో తిరిగి టీడీపీలో చేరేందుకు మాగుంట సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు టాక్స్ జరుగుతూ వచ్చాయి. సోమవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీలో ఉంటారని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.