ఆంధ్రలో పార్టీలన్నీ పొత్తుల కోసం పరిగెడుతున్నాయి. ఎవరు ఒకరు కలసి గట్టెక్కిస్తారని అన్ని పార్టీలు ఆశపడ్తున్నాయి. ఒక్క నేత తప్ప. ఆయన జగన్....


టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల కొసం చూడని దిక్కులేదు

జనసేన అధినేత పొత్తు లేకుండా ముందుకు పోలేని పరిస్థితి

వామ పక్షాలు ఎవరి చేయి పట్టుకోవాలో తెలియక తికమకపడుతున్నాయి.

కాంగ్రెస్ చేతికి ఎవరూ చిక్కేలా లేరు,.

మంచికో చేడుకో, తన వ్యూహాన్ని తప్ప మరొకరితో పొత్తు అవసరం లేదని ధైర్యంగా ముందుకు సాగుతున్న పార్టీ దేశంలో వైసిపి ఒక్కటే...

ఈ విషయంలో జగన్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరెవరు?


ఒకే ఒక్కడు, ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టి దగ్గరికి వచ్చిన వారిని పలకరిస్తూ, రాని వారి గురించి ఆలోచించకుండా ముందుకు సాగుతున్నాడు. అందరినీ ఆలోచింప జేస్తున్నాడు. ఔరా అని అందరూ ముక్కున వేలేసుకునే విధంగా పాలన సాగిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది. దేశంలోనే అందరూ ఆయన వైపు చూసేలా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. రానున్న ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతున్న తీరు, నేనొక్కడిని ఒక వైపు మిగిలిన వారంతా ఒకవైపు ఎన్నికలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం అంటూ ఓటర్లకు పిలుపు... మీరే నా ధైర్యం. మీరే నాసైన్యం. అని ఓటర్లను ఉత్తేజ పరుస్తూ ముందుకు సాగుతున్నారు.




దేశానికే యూనిక్‌..
భారత దేశానికే ఒక యూనిక్‌. సుమారు ఐదు సంవత్సరాల పాలన. ఈ పాలనను ఎవ్వరూ తప్పుపట్టలేని వైనం. దేశంలో ఏ పార్టీ వారు అమలు చేయలేని సంక్షేమ పథకాలు. ప్రతి పేద ఇంటికీ ఉచితంగా ఆర్థిక సాయం అందించిన తీరు. డబ్బుల అందజేతలో అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమచేసిన డీబీటీ విధానం, ఇవన్నీ పలువురి ప్రశంసలు అందుకున్నవే.
పొత్తులకు పోని ఏకైక నాయకుడు
పొత్తల గురించి మాట్లాడని ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికలపై ఆయన వ్యూహం ఆయనకు ఉంది. వ్యూహం ఫలిస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అటువంటి వారిని వెతికి ఎంపిక చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడు. తనపై ఉన్న కేసుల కోసం లాలూచీ పడ్డాడనే విమర్శలు ఉన్నాయి. అయినా వాటి గురించి పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మా అవసరం కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. ఒక వేళ ప్రభుత్వ ఏర్పాటులో మా అవసరం వారికి ఉంటే ప్రత్యేక హోదా సాదించి తీరేవాళ్లం అని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
క్యాడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత
నియోజకవర్గాల్లో ఎమ్మల్యే అభ్యర్థులను మారుస్తుండటంతో క్యాడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా ఇవేమీ పట్టించుకోవడం లేదు. తాను సొంతంగా చేయించుకున్న సర్వేల ప్రకారం రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను మార్చేస్తున్నారు. మీకు కేటాయించిన నియోజకవర్గంలో పనిచేసి గెలవండి. ఇష్టం లేదంటే వెళ్లిపోండి అని సంకేతాలిచ్చారు. వెళ్లే వారిని పిలిపించుకుని బ్రతిమిలాడే కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీని వదులుతున్న వారు కూడా ఎందుకు ఇంత మొండిపట్టుదలతో ఉన్నారు. ఏమిటి ఇతని ధైర్యం అనుకుంటున్నారు.
సరైన నిర్మాణం లేదు
పార్టీ గ్రామ స్థాయిలో నిర్మాణం లేదు. ప్రతి పంచాయతీకి కమిటీలు లేవు. పార్టీ అంటే నేను, నేనంటే పార్టీ అని చొక్కాలు చించుకునే క్యాడర్‌ గ్రౌంగ్‌ లెవెల్‌లో లేదు. అయినా వెనకడుగు లేదు. నా కార్యకర్తలే నా సైన్యం అంటూ అడుగులు వేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ నిర్మాణంపై పెద్దగా వైఎస్సార్‌సీపీ దృష్టి పెట్టలేదు. ఎందుకు చేయలేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పార్టీలోని వారిని ఎవరినైనా ఈ విషయమై ప్రశ్నిస్తే మాకు గ్రామ స్థాయిలో కార్యకర్తలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. కమిటీలు ఎప్పుడో వేశామని చెబుతున్నారు.
పొత్తులు లేకుండా ఎన్నికల్లేవు..
ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో పొత్తులు లేకుండా ఎన్నికలు లేవు. అపవిత్ర కలయికలు ఎన్నో జరుగుతున్నాయి. 40 ఏళ్ల రాజకీయ జీవితం అని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు పొత్తులకు పోయారు. ఇప్పుడు కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. బీజేపీతో పొత్తు విషయం మాట్లాడి ఫైనల్‌ చేయనున్నారు. బీజేపీతో వెళితే మైనార్టీ ఓట్లు చీలుతాయేమోననే భయం ఒక పక్క పెట్టుకుని బీజేపీతో పొత్తుకు వెళుతున్నారు. ఇక కొత్తగా పార్టీపెట్టిన పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచీ పొత్తులపైనే ఆధారపడుతున్నాడు. వామపక్షాలు కూడా ప్రతి ఎన్నికల్లోనూ పొత్తుల కోసమే వెంపర్లాడుతున్నాయి.
బీజేపీ దేశవ్యాప్తంగా పార్టీలను చీలుస్తోంది. పొత్తులకు పోతోంది. ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టి తమ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ అయినా పొత్తుల కోసం వెంపర్లాడుతోంది.
చంద్రబాబు ప్రాబల్యం పెరుగుతోందా?
చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చిన తరువాత జనంలో ప్రాబల్యం పెరిగిందని టీడీపీ వారితో పాటు సాధారణ ప్రజలు కూడా కొందరు అంటున్నారు. జైలులో ఉండే రాజకీయాలు నడిపారు. పవన్‌ కళ్యాణ్‌ ద్వారా జైలులో ఉండగానే పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించేలా చేశారు. మౌత్‌టాక్‌.. మాత్రం జగన్‌ ఓడిపోతాడని ఉంది. ఐదేళ్ల నుంచి చంద్రబాబు జోలికి రాని జగన్‌ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్‌ చేయించాడనే ప్రశ్నకు వచ్చిన సమాధానం ఒక్కటే, తప్పు చేశాడు కాబట్టి జైలుకు వెళ్లాడు. ఆయనకు బెయిల్‌ రాకుండా మేము అడ్డుకోలేదే అంటున్నారు వైఎస్సార్‌సీపీ పెద్దలు.
సర్వేల్లో వ్యతిరేకత..
సీఎం జగన్‌ సొంతంగా నిర్వహించుకున్న సర్వేల్లోనూ కొన్ని సార్లు వ్యతిరేకంగా వచ్చాయి. బయటి వారు నిర్వహించిన సర్వేల్లో కూడా ప్రజలు జగన్‌ను వ్యతిరేకిస్తున్నారని వచ్చాయి. ఆ సర్వేలు చూసిన తరువాతైనా నాయకుడి మనసులో కాస్త ఆలోచన వస్తుంది. ఇవేమీ ఆయన మనసును తాకలేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి తరువాత కొన్ని వ్యూహాలు మార్చారు. అక్కడ ఎందుకు బీఆర్‌ఎస్‌ ఓటమి చెందిందో ఆలోచన చేశారు. తన ఆలోచనలకు ఇంకా పదును పెట్టారు. ప్రతి ఆలోచనా తన సొంతమేనని, ఏ ఒక్కరు ఇచ్చింది కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు సార్లు చెప్పడం విశేషం.
గ్రామ పాలనకు శ్రీకారం
ప్రధానంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో వచ్చిన అతి పెద్ద మార్పు గ్రామ స్థాయిలో పాలన. సచివాలయాల ఏర్పాటు. అందులో ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగులు. ప్రజల అవసరాలు తీర్చడంలో స్థానికంగా ముందడుగు. ఈ మార్పు మాకు అవకాశం కల్పిస్తుందనే నమ్మకం జగన్‌లో ఉంది.
ఆడవాళ్లలో కృతజ్ఞత ఉంది
చాలా కుటుంబాల్లోని ఆడవాళ్లలో జగన్‌పై వ్యతిరేకత లేదు. కృతజ్ఞత ఉంది. చాలా మంది వాడెబ్బసొమ్ము ఇచ్చాడా.. ప్రభుత్వ డబ్బేకదా అంటారు. కానీ ఆ డబ్బును అనుకున్న ప్రకారం ఇచ్చే మనసు కూడా ఉండాలి కదా. అందుకే జగన్‌పై మహిళలు ఆప్యాయతను పెంచుకున్నారు. పథకాల ద్వారా డబ్బలు ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. పైగా జగన్‌లోనూ మొండితనం ఉంది. జనాలకు నేరుగా డబ్బును చేర్చడంలో సక్సెస్‌ అయ్యాడు. తెలుగుదేశం బలం పెరిగిందనుకుంటున్నారేమో కానీ అది జరగలేదు. పార్టీకోసం పనిచేసే వాళ్లు ఎలాగూ ఉంటారు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉంటారు. అటువంటి వారి ఓటు పోకుండా పట్టకోవాలి. ఓటరు భలే ఇంటిలిజెంట్‌. రేపు ఎలక్షన్‌ అనగా ఆరోజు రాత్రి ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకుంటాడు. ఆ నాడి పట్టుకున్న నాయకుడు సక్సెస్‌ అవుతాడు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే లోకేష్‌ను చంద్రబాబు నాయకుడిని చేస్తాడు. లోకేష్‌ కంటే జగన్‌ బెటర్‌ అనుకుంటున్నారు ఓటర్లు. అందుకే జగన్‌ను ఆదరిస్తున్నారు.
ఎం. వెంకటేశ్వరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు.
Next Story