జనసేనలో వీర మíß ళలు కరువయ్యారా? ప్రతి జిల్లాలో వీర మహిళల వింగ్‌ ఉంది. ఐనా ఒక్కరికే సీటిచ్చారు.


‘అందరి అభివృద్ధి కోసం, సామాజిక సమతుల్యం కోసం పోరాడే జనసేన పార్టీకి నావంతు సహకారం’ అనేది జనసేన ప్రధాన నినాదం. రాజకీయాల్లో మహిళలంటే అరుపులు కేకలు కాదు. అరుపులు కేకలు నాకొద్దు, ఆలోచనతోటి, సయోధ్యతోటి, వివేకంతోటి, సభ్యతతోటి ఉండే ఆడవాళ్లు పార్టీకి అవసరం. ఇంకా ఆడవాళ్ల గురించి చెబుతూ మనింట్లో మన తల్లో, చెల్లో, ఆడపడుచు ఎలా ఉంటారో అలాంటి ఆడపడుచులు, అక్క చెల్లెమ్మలు జనసేనకు కావాలి. చిన్నచిన్న గొడవలు పట్టించుకోకూడదు, సర్థుకుపోవాలి. మనల్ని కలిపేది సిద్దాంతాలు. ఇలా వీరమహిళల సమావేశాల్లో పవన్‌ కళ్యాణ్‌ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆ మాటలు సీట్ల కేటాయింపులో చూపించలేదు.

జనసేన పార్టీ ఎన్నికల్లో ఒక్క వీర మహిళకు మాత్రమే టిక్కెట్‌ కేటాయించింది. మహిళా కోటా ప్రకారమైనా ఇవ్వాలి కదా అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీలో బాగా ప్రాచుర్యం పొందిన పదం వీరమహిళలు. ఈ పేరుతో ప్రత్యేక సభలు, సమావేశాలు జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో మహిళల పాత్రపై పలు మార్లు మాట్లాడారు. మహిళలను అత్యంత గౌరవ ప్రదంగా బతకాలనే మాటలు చాలా సార్లు చెప్పారు.
అలాంటప్పుడు కనీసం 33 శాతం రిజర్వేషన్‌ మహిళలకు సీట్ల కేటాయింపులో అమలు చేయాల్సిన పవన్‌కళ్యాణ్‌ అలా చేయలేకపోయారు. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయనే విషయం ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కు అర్థమై ఉంటుంది. నిజానికి వీర మహిళలు రావాల్సిన సీట్లలోకి కొందరు టీడీపీ వారు చొరబడ్డారు. దీనికి పవన్‌కళ్యాణ్‌ అడ్డుచెప్పలేక పోయారనే విమర్శ కూడా ఉంది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి శాసనసభకు లోకం మాధవిని ఎంపిక చేశారు. ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ. భర్త తెలగ సామాజిక వర్గానికి చెందిన వారు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆమె తన భర్త ప్రోత్సాహంతో ముందుకొచ్చినట్లు సమాచారం. నెలిమర్ల నియోజకవర్గంలో తెలగలు సుమారు లక్ష మంది ఓటర్లు ఉన్నారు. భారీస్థాయిలో ఓటర్లు ఉన్నందున ఆమె గెలుపు ఖాయమనే ధీమాలో తెలుగుదేశం కూటమి ఉంది.
జనసేనలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయగలిగే వీర మహిళలు లేరా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన రాజకీయ పార్టీల్లో కంటే జనసేన మహిళలను రాజకీయంగా పై స్థాయిలో చూడాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ మహిళా వింగ్‌ పేరును కూడా ప్రత్యేకంగా గుర్తించేలా ‘వీరమహిళ’ అంటూ పెట్టింది. అప్పట్లో వీర మహిళ అనే అంశం కొత్తగా తెరపైకి తీసుకు రావడంతో బాగా చర్చించారు. మిగతా పార్టీలకంటే భిన్నంగా ఈ పేరు రావడంతో అందరూ ఒక్కసారిగా జనసేనవైపు చూశారు. అదే స్థాయిలోనే సీట్ల కేటాయింపుల్లో గౌరవం లభిస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు తగ్గట్టు పవన్‌ కళ్యాణ్‌ సీట్లు కేటాయించలేకపోయారనే చర్చ సాగుతోంది. సాధారణంగా వీర మహిళ అంటే ఝాన్సీ లక్ష్మిభాయి వంటి వారితో పోల్చి పోరాట యోధురాళ్లుగా చెబుతుంటారు. అంటే ఎందులోనైనా విజయం సాధించే పోరాట యోధులతో మహిళలను పోల్చినప్పుడు వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకపోవడం చర్చనియాంశంగా మారింది.
Next Story