పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.
మానవ ప్రపంచం యావత్తు ఉలిక్కిపడే ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన భర్త ఇంటికొచ్చి పెట్టే నరక యాతన తట్టుకోలేక కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. అలా ఇలా చంపలేదు. బహిరంగంగా ఉరి తీసి భర్తపై తన కసిని తీర్చుకుంది. సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో జరిగింది. బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణకు గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రకు పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే పెళ్లై పదేళ్లవుతున్నా వీరి దాంపత్యం సరిగా సాగలేదు. భర్త, భార్యను నిత్యం వేదింపులకు గురి చేసేవాడు. ఇటీవల కాలంలో వేదింపులు మరి తీవ్రమయ్యాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని మరిచి పోయారు. నిత్యం వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి. భర్త వేదింపులు ఎక్కువ కావడంతో భార్య తరపున బందువులు వచ్చి సర్దిచెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ కుదర లేదు. ఆఖరుకు పోలీసులను కూడా భార్య అరుణ ఆశ్రయించింది. దీంతో పోలీసులు భర్త అమరేంద్రను పోలీసు స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపారు.
అయితే వేదింపులు మాత్రం అమరేంద్ర మానలేదు. ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యంలో భార్య అరుణను మట్టుబెట్టాలని నిర్ణయానికి వచ్చాడు భర్త అమరేంద్ర. అందులో భాగంగా మంగళవారం ఫుల్‌గా మద్యం తాగిన అమరేంద్ర భార్య అరుణను చంపేందుకు ప్లాన్ వేసుకున్నాడు. అందులో భాగంగా జేబులో చాకు పెట్టుకొని అరుణ వద్దకు వెళ్లాడు. వచ్చీ రావడంతోనే అరుణతో అమరేంద్ర గొడవ పడ్డాడు. చాకును చూసిన అరుణ తనను చంపేస్తాడేమో అని భయపడింది. కర్ర తీసుకొని అమరేంద్ర తలపై బలంగా కొట్టింది. దీంతో అమరేంద్ర కింద పడ్డాడు. అప్పటికే అమరేంద్ర పెట్టే నరక యాతన తట్టుకోలేని స్థితిలో ఉన్న అరుణ భర్త అమరేంద్రను అంతటితో వదిలి పెట్టలేదు. కింద పడిపోయిన అమరేంద్రకు తాడు కట్టి నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చింది. అదే తాడుతో మెడకు బిగించి అమరేంద్రను ఉరి వేసి కడతేర్చింది. అయితే ఈ గొడవను వీడియో తీసిన ఓ వ్యక్తి గురువారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అరుణ కోసం గాలింపులు చేపట్టారు. నిందితురాలు అరుణ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.