వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నేడు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వంశీ పీఏతో సహా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కొంత మంది నిందితులుగా ఉన్నారు. టీడీపీ నేత కాసనేని రంగబాబు దాడి కేసులో మరి కొంత మంది నిందుతులు ఉన్నారు. ఈ కేసుల్లో పట్టుబడకుండా వీరు గత కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్నారు. కాపు కాసిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేసి కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో వంశీ పీఏ రాజా కూడా ఉన్నారు. అయితే ఇంకా మరి కొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు వేటలో ఉన్నారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన వంశీ అనుచరులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే తాజా అరెస్టులు ఏ కేసుకు సంబంధించి జరిగాయనేది స్పష్టత రావలసి ఉంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్టు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. వంశీపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడితో పాటు టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసును కూడా తెరపైకి తెచ్చారు. రంగబాబును గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్దకు పిలిపించి మరీ దాడీ చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. అయితే ఈ కేసుపై కూడా గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని తెరపైకి తెచ్చిన పోలీసులు ఈ కేసులో 9 మందిని నిందితులుగా గుర్తించారు. పలు సెక్షన్‌ల కింద వీరిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన వారిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్‌రంగా కూడా ఉన్నారు. సూరపనేని అనిల్, పొన్నూరు సీమయ్య, అనగాని రవి, భీమారావు రాము, ఎం బాబు, గుర్రం నానిలను కూడా అరెస్టు అయిన వారిలో ఉన్నారు. అయితే వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన శేషు మాత్రం తప్పించుకున్నాడని, అతని కోసం తీవ్రంగా పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.
Next Story