తిరుపతిలో ఉన్నట్లుండి చెరువు మాయం...
x
తుమ్మలగుంట చెరువులో ఏర్పాటు చేసిన థీమ్ పార్క్

తిరుపతిలో ఉన్నట్లుండి చెరువు మాయం...

తప్పిపోయిన మా చెరువును వెతికి పెట్టండి. లేదంటే ఆందోళనకు దిగుతాం. అని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా చర్చకు తెర తీశారు. అసలేం జరిగిందంటే..


ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి

" పోలీస్ సీఐ వేధింపులు భరించలేక, ఓ ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అధికారికి లంచం ఇచ్చి రొయ్యల చెరువు ఏర్పాటు చేసినట్లు అనుమతులు తీసుకుంటాడు. ఆ అనుమతి పత్రాల ఆధారంగా తన రొయ్యల చెరువు కనిపించడం లేదు" అని తనను వేధించిన సీఐ కి ఫిర్యాదు చేస్తాడు.
సినీ నటుడు, రచయిత, పోసాని మురళీకృష్ణ ఎస్సైగా, బ్రహ్మాజీ సీఐగా, బ్రహ్మానందం అధికారిగా నటించిన సరదా సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. ఇందులో సారాంశం చూస్తే అవినీతి వేళ్ళునుకున్నది" అని చెప్పడమే ప్రధాన ఇతివృత్తం.
ఇదే తరహాలో
"చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు వంద ఎకరాల చెరువు కనిపించడం లేదు" దయచేసి వెతికి పెట్టండి అని తిరుపతి నగరం ముత్యాలరెడ్డిపల్లె (ఎమ్మార్ పల్లి) పోలీసులకు ఏపీ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మార్ పల్లి పోలీసులు షాక్ అయ్యారు.
అన్ని ప్రభుత్వాలది అదే తీరు
నీటి వనరుల విధ్వంసంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎవరికి ఎవరు తీసిపోనట్లుగానే వ్యవహరించాయి. అందుకు సజీవ సాక్ష్యం తిరుపతిలోని అవిలాల చెరువు ఆ తర్వాత, తుమ్మలగుంట చెరువులే ప్రత్యక్ష సాక్ష్యం.
కాంగ్రెస్ పార్టీతో పునాది..
తిరుపతి నగరానికి అంతర్భాగంగా ఉన్న ఆవిలాల చెరువుకు పెద్ద చరిత్ర ఉంది. 180 ఎకరాల్లో నిర్మించిన ఈ చెరువులో 1992లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ కోసం విధ్వంసం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు ప్రజారాజ్యం పార్టీని ఇదే చెరువు వేదికగా 2008 ఆగస్టు రెండో తేదీ ప్రకటించారు. అందుకోసం ఈ చెరువు వేదిక అయింది.
టిడిపి ప్రభుత్వంలో కొనసాగింపు..
" తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్న వివిధ నీటి వనరుల సుందరీకరణ పనులు చేపట్టమని టీటీడీని గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో అప్పటి ఈవో సాంబశివరావు ఆధ్వర్యంలో చెరువును పరిశీలించిన టిటిడి ఇంజనీరింగ్ ఇతర శాఖల అధికారులు థీమ్ పార్క్ తదితర పనులు చేపడానికి పనులు చేపట్టారు.
ఇది సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకం..
"సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా నీటి వనరులను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని పేరూరు అవిలాల చెరువును కాపాడాలని మేధావుల ఫోరం ఆధ్వర్యంలో మేము 2006లో హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాం" అని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి కె రామానాయుడు తెలిపారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ చెరువులను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి" ఆయన డిమాండ్ చేశారు.
" అవినీతి రహిత పాలన అందిస్తాం. చట్టాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాం" అని ఒకపక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటుంటారు.. కానీ..ఆంధ్రప్రదేశ్ లోని నగరం, శివార్లలో "ఆక్రమణలు పెచ్చుమీరాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువులను పరిరక్షించడంలో అధికారులు చోద్యం చూస్తున్నారు" అని తిరుపతిలో చెరువు తప్పిపోయిందనే ఫిర్యాదుతో మరోసారి స్పష్టం అయ్యింది.
పొలాలు బీడు
తుమ్మలగుంట చెరువు వ్యవహారం విషయంలో ఇటీవలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. 18 ఎకరాల ఆయకట్టు వున్న సర్వే నెంబర్ 60 లోనీ 82 ఎకరాల తుమ్మలగుంట చెరువులో నుంచి 22 ఎకరాలు మునక పట్టాల కింద కేటాయించారు. మిగతా 60 ఎకరాలల్లో.. క్రికెట్ మైదానం, థీమ్ పార్క్ వంటి సదుపాయాల కల్పనకు సుందరీకరణ పేరుతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) నిధులు ఆ చెరువులో పోశారని సుధాయాదవ్ ఆరోపించారు.
దీంతో పేరూరు చెరువు నుంచి వచ్చే నీటి ప్రవాహం, వర్షాకాలంలో వరద నీరు ఈ చెరువులకు చేరే అవకాశం లేకుండా పోయింది. ఈ నీరంతా తిరుపతి నగరాన్ని ముంచెత్తుతున్నాయి అందుకు గత ఏడాది తిరుపతి నగరంలో కనిపించిన ఉపద్రవమే నిదర్శనం.



Read More
Next Story