సినీ నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్, నాడు హోమ్‌ మంత్రిగా ఉన్న తానేటి వనితలు మిగిలారు.


ముంబాయి సినీనటి కాదంబరి జత్వానీ కేసు క్లైమాక్స్‌కు చేరింది. అంతా ఊహించినట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా ఈ కేసు నలుగుతోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంది. ముంబాయి సినీ నటి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. పీ సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీలను సస్పెండ్‌ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామాంజనేయులు గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కీలక వ్యవహరించారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేసిన ఆయన జగన్‌కు అత్యంత నమ్మకంగా పని చేశారు. ప్రస్తుతం ఈయన అదనపు డీజీ ర్యాంకులో ఉన్నారు. కాంతిరాణా టాటా కూడా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారే. ఐజీ ర్యాంకులో ఉన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ఈయన విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేశారు. విశాల్‌ గున్నీ డిఐజీ ర్యాంకులో ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ అనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఇది వరకే సస్పెండ్‌ చేసింది.

మొన్నటి వరకు బుడమేరు వరదల సహాయక చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ఆది సర్థుమణిగిన తర్వాత ముంబాయి సినీ నటి కేసును మరో సారి తెరపైకి తెచ్చింది. వరదలకు ముందు కూడా ఈ కేసు సంచలనంగా మారింది. వరదలు చోటు చేసుకోవడంతో పది రోజులు పాటు పక్కన పెట్టారు. తాజాగా సంచలనాలు సృష్టిస్తోంది.
తన తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి శుక్రవారం రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ముంబాయి సినీ నటి జత్వానీ కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కుక్కల విద్యాసాగర్‌తో పాటు మరి కొందరిపైన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు, కొంత మంది వ్యక్తులు గతంలో తనతో పాటు తన కుటుంబాన్ని నిర్బంధించి వేధింపులకు గురి చేశారని సీఐ చంద్రశేఖర్‌కు దాదాపు రెండు గంటల పాటు వివరాలు వెల్లడించారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఐపీసీ 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, 120(బి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
ముంబాయి సినీ నటి కాదంబరి జత్వానీని కేసు వ్యవహారం ముంబాయి నుంచే మొదలైంది. ప్రముఖ వ్యాపారి, జిందాల్‌ గ్రూప్‌ అధినేత సజ్జన్‌ జిందాల్‌తో సినీ నటి గతంలో ప్రేమ వ్యవహారం నడిపింది. రిలేషన్స్‌ దెబ్బతినడంతో తిరగబడింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జిందాల్‌పై గతంలో ముంబాయిలో కేసు పెట్టింది. జిందాల్‌ పెద్ద పారిశ్రామిక వేత కావడం, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో ఆయనపై కేసును నమోదు చేసేందుకు స్థానిక పోలీసులు తొలుత నిరాకరించారు. తర్వాత ఆమె కోర్టుకెళ్లి ఫైట్‌ చేయడంతో పోరాటం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయక తప్ప లేదు. అది అలా జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జత్వానీపై కేసు నమోదు తెరపైకి వచ్చింది. నాటి సీఎం జగన్‌కు, జిందాల్‌కు మితృత్వం ఉండటంతో ఆయనను కాపాడేందుకు నాటి జగన్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్రహీంపట్నంలో తనకున్న ఐదెకరాల భూమిని కాజేయాలని చూసిందనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నేతగా ఉన్న ప్రముఖ పారిశ్రామికేవేత్త కుక్కల విద్యాసాగర్‌ ఆమెపై కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టేందుకని ఆమెను, ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చి రిమాండ్‌లో పెట్టారు. ముంబాయిలో జిందాల్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందని వేధింపులకు గురి చేశారు. దీనికి ఒప్పుకుంటే తెల్లకాగితాలపై సంతకాలు చేయాలని బలవంతం చేశారు. ఈ నిర్భంధాలు, వేధింపులను తట్టుకోలేక జత్వానీ కేసును విత్‌డ్రా చేసుకోడానికి ఒప్పుకుంది. ఆ మేరకు తెల్లకాగితంపైన సంతకాలు పెట్టింది. ఈ వ్యవహారం అంతా అయిపోవడంతో వారిని విడిచిపెట్టేశారు. నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేని ఆమె తన తల్లిదండ్రులతో తిరిగి ముంబాయికి వెళ్లి పోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో కేసులన్నీ తిరగదోడుతున్న నేపథ్యంలో జత్వానీ కేసును తవ్వి తీసి తెరపైకి తెచ్చారు. సహాయం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో ఆమె తిరిగి విజయవాడలో అడుగు పెట్టారు. గత జగన్‌ ప్రభుత్వం, అందులోని నేతలు, పోలీసులు తనను, తన కుటంబాన్ని తీవ్రంగా వేధింపులకు గురి చేసిందని ఆరోపణలు చేసింది. ప్రభుత్వమే ఇలా వేధింపులకు పాల్పడటంతో తాను ఏమీ చేయలేక పోయానని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మరో సారి విజయవాడ వచ్చిన జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఏసీపీ నేతృత్వంలో విచారణ వేగవంతం చేశారు. నాడు నిఘా విభాగం డీజీగా వ్యవహరించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీ సీతారామాంజనేయులు, నాడు విజయవాడ సీపీగా పని చేసిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కాంతిరాణా టాటా, డీసీపీగా పని చేసిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీలు సినీ నటి జత్వానీని ముంబాయి నుంచి ఇక్కడకు తీసుకొని రావడంలోను వేధింపులకు గురిచేయడంలోను కీలకంగా వ్యవహరించారని తేలడంతో వారిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోమ్‌ మంత్రిగా ఉన్న తానేటి వనితల పాత్ర కూడా ఇందులో ఉందని, వీరిని కూడా కటకటాల వెనక్కు పంపేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.
Next Story