విజయవాడలో ‘పాకిస్తాన్ కాలనీ’ ఎందుకు? పేరు మార్చమంటూ జనం గోల
x
విజయవాడ పాకిస్తాన్ కాలనీ

విజయవాడలో ‘పాకిస్తాన్ కాలనీ’ ఎందుకు? పేరు మార్చమంటూ జనం గోల

ఈ కాలనీ ఏర్పడి 50 యేళ్లయింది. పాకిస్తాన్ కాలనీగా రికార్డుకెక్కింది. ఈ కథేంటో తెలుసా?


-శంకర్ వడిశెట్టి

ఆంధ్రప్రదేశ్‌ లో పాకిస్తాన్ పేరుతో ఓ కాలనీ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. గుంటూరులో ప్రముఖమైన జిన్నా టవర్ చుట్టూనే పెద్ద వివాదం చెలరేగింది. పాకిస్తాన్ జాతిపిత పేరుతో టవర్ ఉందంటూ అప్పట్లో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి, ఆందోళనకు పూనుకున్న నేపథ్యం కూడా ఉంది. కానీ పాకిస్తాన్ పేరుతో ప్రస్తుతం పాలనా వ్యవహారాలకు కేంద్రస్థానంగా ఉన్న విజయవాడలోనే ఓ కాలనీ ఉందంటే చాలామంది ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని వివిధ నగరాల్లో బర్మా పేరుతో పలు కాలనీలుంటాయి. దేశ స్వతంత్య్ర సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు స్థిరపడిన కాలనీలను వారు వచ్చిన ప్రాంతాల పేరుతో పిలుచుకోవడం పరిపాటి. అలానే బర్మా కాలనీలున్నాయి. కానీ పాకిస్తాన్ కాలనీ ఎలా వచ్చిందన్న దానిపై స్థానికులకు కూడా పూర్తి స్పష్టత లేదు. అధికారుల వద్ద దానికి సంబంధించిన వివరాలు కూడా లేవు. 50 ఏళ్ల క్రితం కాలనీ ఏర్పాటయినట్టు కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో మాత్రం సమాచారం ఉంది.

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో..

కాలనీలో నివశిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు పి రామరావు అందించిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో ఏర్పడిన ఉద్రికత్తల కారణంగా అనేక మంది వలసబాట పట్టారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం ఇందిరాగాంధీ సారధ్యంలోని ఇండియా సంపూర్ణంగా అండగా నిలిచింది. ఆ సమయంలో పలువురు బంగ్లాదేశీలు తూర్పు పాకిస్తాన్ నుంచి విజయవాడకు కూడా వలస వచ్చారు. అలా వలస వచ్చిన వారంతా ప్రస్తుతం విజయవాడ నగర పాలకసంస్థ పరిధిలోని పాయకాపురంలో గుడిసెలు నిర్మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు పాకిస్తాన్ విముక్తి సాధించి బంగ్లాదేశ్ గా అవతరించిన తర్వాత కొందరు వెనుదిరిగారు. కానీ కొద్దిమంది మాత్రం విజయవాడలోనే స్థిరపడిపోయారు. స్థానికంగా వివిధ ఉపాధి మార్గాలు వెదుక్కుని శాశ్వతంగా ఉండిపోయారు.

అప్పట్లో విజయవాడలో తూర్పు పాకిస్తానీల కోసం ఏర్పాటు చేసిన కాలనీకే పాకిస్తాన్ కాలనీ అని పేరు వచ్చింది. 1986లో మూడు వీధులతో ఉన్న ఆ ప్రాంతానికి పాకిస్తాన్ కాలనీగా పేరు ధృవీకరించి, అధికారికంగా నిర్ధారించినట్టు కృష్ణా జిల్లా రెవెన్యూ రికార్డుల్లో ఉంది.

బుడమేరు వరదల్లో ఆశ్రయం

పాయకాపురంలోని పాకిస్తాన్ కాలనీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కన్నా కాసింత ఎత్తులో ఉంటుంది. దాంతో 1990వ దశకం ఆరంభంలో వచ్చిన భారీ వరదల తాకిడి నుంచి బుడమేరు బాధితులకు ఈ పాకిస్తాన్ కాలనీ ఆశ్రయమిచ్చింది. ఆతర్వాత పదే పదే బుడమేరు వరద బారిన పడుతున్న ప్రజలు కొందరు ఆ కాలనీని ఆనుకుని ఇళ్లు నిర్మించుకోవడంతో బాగా విస్తరించింది. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 58 కుటుంబాలు ఈ కాలనీలో నివాశముంటున్నాయి. 2024 సెప్టెంబర్ లో వచ్చిన బుడమేరు వరదల్లో కూడా పాకిస్తాన్ కాలనీ కొంత సురక్షితంగానే ఉంది.

పాకిస్తాన్ కాలనీలో నివశిస్తున్న వారిలో కొంత మందికి 2009లో ప్రభుత్వం పట్టాలు అందించింది. 2015లో మరో 32 మందికి బీఫారం పట్టాలు అందించారు. ఇంకా 17 ఇళ్లకు పట్టాలు కూడా లేవని స్థానికులు ది ఫెడరల్ కి వివరించారు.

విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని 62వ డివిజన్ లో ఉంటుంది. పాకిస్తాన్ కాలనీలో నివశిస్తున్న ఉమా మహేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. తామంతా 20 ఏళ్లుగా ఇళ్ల పన్నులు కూడా కడుతున్నప్పటికీ ఇంకా కొందరికి పట్టాలు కూడా రాలేదన్నారు. మురుగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

పేరు మార్చాలంటున్న యువత

పాకిస్తాన్, ఇండియా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా తాము పదే పదే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ పాకిస్తాన్ కాలనీ వాసులంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం, ఇతర అవసరాల కోసం ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్ కాలనీ నుంచి వచ్చామంటే తమను అనుమానంగా చూస్తున్నారని వాపోతున్నారు. కొందరు విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించిన సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే స్థానికుల కోరిక మేరకు భగీరథ కాలనీగా పేరు మారుస్తూ వీఎంసీ కూడా తీర్మానం చేసింది. కానీ అధికారికంగా పాకిస్తాన్ కాలనీ పేరు కొనసాగిస్తున్నారు.

తక్షణమే మునిసిపల్ కార్పోరేషన్ కౌన్సిల్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా భగీరథ కాలనీ అంటూ అధికారికంగా ప్రకటించాలని కాలనీకి చెందిన ఎం రమేశ్ అనే యవకుడు కోరారు.

తీర్మానం జరిగిందని, అధికారికంగా కాలనీ పేరు మార్పు ప్రక్రియ వీలయినంత త్వరగా పూర్తి చేస్తామని విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ది ఫెడరెల్ కి తెలిపారు.

Read More
Next Story