అధికారం వచ్చాక టీడీపీ.. కార్యకర్తలను విస్మరించిందా!
x

అధికారం వచ్చాక టీడీపీ.. కార్యకర్తలను విస్మరించిందా!

అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను టీడీపీ మరిచిందన్న ప్రచారానికి పల్లా శరీనివాస్ ఫుల్‌స్టాప్ పెట్టారు. కార్యకర్తలను గుర్తించాల్సిన సమయం వచ్చిందన్నారు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎవరూ ఊహించని తరహాలో కంబ్యాక్ ఇచ్చిన టీడీపీ.. అధికారం వచ్చిన తర్వాత తమ కార్యకర్తలను విస్మరించిందన్న వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. అధికారంలో లేకపోయినా, వైసీపీ వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ జెండాను భుజాన వేసుకుని పార్టీని విజయ సోపానాలు ఎక్కించి కార్యకర్తలు అధికారం వచ్చిన తర్వాత టీడీపీ పూర్తిగా మరిచిపోయిందని పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం అలుముకుంది. అందుకే కొన్ని రోజులుగా టీడీపీ కార్యకర్తలంతా కూడా స్తబ్దుగా ఉన్నారని, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్ ఫుల్ స్టాప్ పెట్టారు. టీడీపీ పార్టీ ఎప్పటికీ తన కార్యకర్తలను మరువదని, నిర్లక్ష్యం చేయదని చెప్పారు.

‘చంద్రబాబు రుజువు చేశారు’

టీడీపీ అంటే బీసీలు.. బీసీలు అంటే టీడీపీ అని చంద్రబాబు నాయుడు మరోసారి రుజువు చేశారని పల్లా శ్రీనివాస్ అన్నారు. ‘‘టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీలకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎంపికలో కూడా పెద్దపీట వేశారు. బీసీ నేత అయిన తనను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకుని దీనిని వాస్తవం చేశారు’’ అని తెలిపారు. తనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, నేతలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యనిర్వహణ చేస్తానని వ్యాఖ్యానించారు.

గుర్తించాల్సిన సమయం వచ్చింది

‘‘టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకుంటూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ.. అధినాయకుడి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన సమయం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దాటి పట్టించే పనిలో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో నాయకులు నిమగ్నమైన మాట వాస్తవమే. కానీ దాని అర్థం వారు కార్యకర్తలను విస్మరించారని కాదు. కార్యకర్తలను టీడీపీ మర్చిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఏది ఏమైనా పార్టీ నాయకులను, ప్రభుత్వాన్ని సమన్వయ పరచుకుంటూ 2029లో మరింత మెజార్టీతో విజయం సాధించేలా పని చేస్తాను’’ అని ఆయన భరోసా కల్పించారు.

‘అనుక్షణం మీతోనే ఉంటాం’

‘‘ఏదో పనిలో పడి పార్టీ కార్యక్రమాలు పట్టించుకోలేదంటే కార్యకర్తలను విస్మరించామని అనుకోవద్దు. మా మనసు, ఆలోచన అనుక్షణం మీతోనే ఉంటుంది. మీ బాధ్యత మాది. మీకు కష్టం రాకుండా చూసుకుంటాం. ఎల్లవేళలా మీకు అండగా ఉంటాం. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం మీరు పడిన కష్టాన్ని మేము కలలో కూడా మరువం. నేను ఏ పనిలో ఉన్నా సరే పార్టీ కార్యాలయం తలుపు తడితే మీకోసం అక్కడ ఉంటాను. మీ సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తాను. అదే విధంగా నాయకులు కూడా అధికారం ఉంది కదా అని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరించకూడదు. మనమంతా ప్రజాస్వామ్యవాదులం. మన మూలాలు ప్రజాస్వామ్యం’’ అని పల్లా శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

నాయకత్వ విలువలు నేర్చుకోవాలి

రాజకీయాల్లోకి యువత రావాలని, రాష్ట్ర అభివృద్ధికి యువ నాయకులు చాలా అవసరమని అన్నారు పల్లా శ్రీనివాస్. ‘‘పార్టీ బలోపేతానికి యువనాయకత్వాన్ని ఆహ్వానించాలి. వారిని ప్రోత్సహించాలి. మన మనుగడ ఉండాలంటే యువత మనతో అడుగులు వేయాలి. యువతను ఆకర్షించాలి. లోకేష్ బాబు ఆలోచనలను గౌరవించాలి. సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూనే యువతను కూడా ప్రోత్సహించాలి. యువ నాయకత్వం చట్ట సభల గురించి తెలుసుకోవాలి. చట్టాలపై అవగాహన తెచ్చుకువాలి. సమాజ గమనాన్ని గుర్తించాలి. ఇంట్లో కూర్చుంటే సరిపోదు అనుక్షణం ప్రజల్లో ఉండాలి. 3వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలను తెలుసుకున్న నారా లోకేష్‌ను చూసి యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. అప్పుడే ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు’’ అని చెప్పారు.

అభివృద్ధి దిశగా పయనించాలి

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో ప్రతి నాయకుడు తన వంత పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం పూర్తితో పాటు అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలి. వాటితో పాటు రాయలసీమను కూడా అభివృద్ధి చేసుకోవాలి. అధినాయకత్వంతో మమేకమై అభివృద్ధికి కృషి చేయాలి’’ అని అన్నారు పల్లా శ్రీనివాస్.

Read More
Next Story