రేషన్ షాపుల్లో తగ్గింపు రేట్లపై వంట నూనెల అమ్మకం మొదలైంది
వంట నూనెల చుక్కలు చూస్తున్న తరుణంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. రేషన్ షాపుల్లో తగ్గింపు ధరలకు పంపిణీ చేస్తోంది.
నిత్యావసర వస్తువులు, వంట నూనెలు మండిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేదలకు చౌకధరలకు వంట నూనెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 11 నుంచి తక్కువ ధరలకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుంచి నెలాఖరు వరకు పామోలిన్ లీటరు (850 గ్రాములు) 110 రూపాయలకు, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు- 124 రూపాయలకు విక్రయించనుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని చెప్పారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇస్తారు. వంట నూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ధరల నియంత్రణపై చర్చించారు. రాష్ట్రమంతటా ఒకే ధరలు ఉండేలా చూడాలని ట్రేడర్స్ కి సూచించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు.