గతంలో దూరమైన వారందరినీ దగ్గరకు తీసుకుంటూ ప్రచారం. తమ్ముళ్లను దూరంగా పెట్టిన సునీత. మరోసారి తప్పులు జరగకుండా చూస్తానని ప్రజలకు హామీ.


మాజీ మంత్రి, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఈ దఫా ఎన్నికల ప్రచారాన్ని భిన్నంగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పరిటాల కుటుంబానికి ఉన్న అభిమానంతో పరిటాల రవిని, ఆయన హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు ఓట్లేసి ఆదరించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె మంత్రి అయ్యారు. దీంతో ఆమె ప్రజల బాగోగులు గురించి పట్టించుకోకుండా తన సోదరులైన బాలాజీ, మురళీలకు నియోజకవర్గంలోని మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. దీంతో వారు ఇదే అదునుగా తీసుకొని డబ్బు సంపాదనకు అలవాటుపడ్డారు. వారి దయలేనిదే నియోజకవర్గంలో ఏ పనులు జరగనంత స్థాయికి వెళ్లారు. ఆఖరుకు విద్యార్థులు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలన్నా వారు కరుణిస్తే తప్ప అధికారులు ఆ పత్రాలను జారీ చేసేవారు కాదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆరోపించారు. తమ్ముళ్ల దురాగతాలు చూసీ చూడనట్లు ఉండటం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినా సునీత తీరు మార్చుకోలేదు. ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

మొదటి సారిగా ఓటమి..
పరిటాల సునీతకు ఓటుతోనే బుద్ధి చెప్పి మార్పు తీసుకరావాలనే ఉద్దేశ్యంతో 2019లో జరిగిన ఎన్నికల్లో పేదలు, అనగారిన వర్గాలు పట్టుబట్టి ఆమెకు వ్యతిరేకంగా లోలోపల ప్రచారం చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఆమెను కాదని కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు టికెట్‌ ఇచ్చారు. అయినప్పటికీ ఆమె సోదరులు చేసిన అన్యాయాలు, అక్రమాలను మరచిపోలేని చాలా మంది టీడీపీ మండల స్థాయి నాయకులు, అభిమానులు పరిటాల శ్రీరామ్‌ ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన తోపుదర్తి ప్రకాశ్‌రెడ్డికి ఓట్లు వేసి గెలిపించారు. ఓటమిని జీర్ణించుకోలేని పరిటాల సునీత ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి కాకుండా పెనుకొండ నుంచి పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. చంద్రబాబు ససేమిరా అనడంతో తప్పని పరిస్థితుల్లో ఈ సారి రాప్తాడు నుంచి శ్రీరామ్‌కు బదులు పరిటాల సునీతకు టికెట్‌ ఇచ్చారు.
తమ్ముళ్లను దూరం పెట్టి ప్రచారం..
తన సోదురులపై ఉన్న అపవాదువల్ల ప్రచారంలో వారిని వెంటబెట్టుకొని వెళితే సమస్యలు వస్తాయని పరిటాల సునీత గుర్తించింది. అందుకే వారిని ప్రచార కార్యక్రమాల దరిదాపులకు రానీయకుండా ఆమె నేరుగా ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే ఆమె సోదరులు మాత్రం కేవలం కొంతమంది నాయకులను కలిసి సహకరించాలని కోరుతున్నారే తప్ప నేరుగా ప్రచార కార్యక్రమల్లో పాల్గొనడం లేదు. దీంతో గతంలో దూరమైన వారందరినీ అక్కున చేర్చుకొని ఈ దఫా అవకాశం ఇస్తే ఎలాంటి పొరపాట్లు చేయనని ఆమె భరోసా ఇస్తున్నారు. దీంతో దూరమైన వారందరూ ఆమె వెంట తిరుగుతూ విజయానికి కృషి చేస్తున్నారు.
పెనుకొండ కాదని రాప్తాడు సీటు
పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవి 1994, 1996 (ఉప ఎన్నిక),1999, 2004లో పోటీ చేసి విజయం సాధించారు. పరిటాల రవి హత్యానంతరం 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పరిటాల స్వగ్రామమైన రామగిరి మండలం వెంకటాపురం గ్రామం కొత్తగా ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గంలోకి రావడంతో 2009, 2014లో తప్పని పరిస్థితుల్లో ఆమె రాప్తాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ రాప్తాడు నుంచి పోటీ చేసినా ఆమెపై ఉన్న వ్యతిరేకత వల్ల ఓటమి చెందారు.
Next Story