ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం పదిశాతం సీట్లు రావాలని అధికార పక్షం వాదిస్తోంది. ఏకంగా ఏడు రాష్ట్రాల్లో ఆ హోదానే పార్టీలు కోల్పోయాయి.


దేశంలో 2024లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ప్రతిపక్ష హోదాను కోల్పోయాయి. ప్రధానంగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు రాష్ట్రాల్లో ప్రతిపక్షానికి హోదాకు తగిన సీట్లు రాకపోవడం చర్చగా మారింది. ఒకప్పుడు దేశంలో రెండంకెలకే పరిమితమైన బిజేపీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారింది. బీజేపీ కూటమి ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాదిన చెప్పుకోదగింది ఆంధ్రప్రదేశ్‌. ఏపీలో ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు. ఆ తరువాత జనసేన పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు ఉన్నాయి. జూన్‌లో అధికారం ఎన్‌డీఏ చేపట్టింది. తెలుగుదేశం, జనసేన, బీజేపిలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని మెజార్టీ సాధించాయి. అప్పటి వరకు తిరుగులేని శక్తిగా అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 175 స్థానాలున్న ఏపీలో కేవలం 11 సీట్లకు వైఎస్సార్‌సీపీ పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను వైఎస్సార్‌సీపీ కోల్పోయింది. సీట్లు తక్కువున్నా ఓట్ల పర్సెంటేజీ 40శాతం వరకు ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు ఎక్కినా ప్రతిపక్ష హోదా దక్కలేదు.

గుజరాత్‌లో...
ప్రధాన మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బిజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఇక్కడ మొత్తం 182 సీట్లు ఉంటే అందులో బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 13, ఆమ్‌ఆద్మీ పార్టీకి 5, సమాజ్‌ వాదీ పార్టీకి ఒకటి, ఇతరులకు రెండు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అధికారికంగా హోదా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వొచ్చు. అయినా ఇవ్వలేదు. గతంలో ఇక్కడి నుంచి మోదీ ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
మణిపూర్‌లో...
మణిపూర్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఎన్‌డీఏ కూటమికి 50 సీట్లు రాగా కాంగ్రెస్‌కు కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇతరులు మరో ఐదు సీట్లు సాధించారు. బిజేపీకి స్వతహాగా ఇక్కడ 37 సీట్లు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం సీట్లు 60 ఉన్నాయి. ఇక్కడ కూడా బిజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది.
అరుణాచల్‌ ప్రదేశ్‌...
ఇక్కడ గిరిజనులు బిజేపీకి జై కొట్టారు. అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉంటే 59 సీట్లు గిరిజనులకు రిజర్వు అయ్యాయి. అరునాచల్‌ ప్రదేశ్‌లో గిరిజనులు అధికంగా ఉన్నారు. బిజెపి 46 సీట్లలో విజయం సాధించింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 5 చోట్ల, ఎన్‌సీపీ 3 చోట్ల, పీపుల్స్‌పార్టీ అరుణాచల్‌ ప్రదేశ్‌ 2 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ 1 సీటు, స్వతంత్రులు 3 సీట్లలో విజయం సాధించారు. ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా పార్టీలకు దక్కలేదు. కాంగ్రెస్‌ ఘోరంగా ఓటమిపాలైంది.
సిక్కింలో...
సిక్కింలో బీజేపీకి అక్కడి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. పోటీ చేసిన పార్టీల్లో రెండు పార్టీలకు మాత్రమే సీట్లు వచ్చాయి. మొత్తం 32 అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి 31 సీట్లు రాగా ఎస్‌బిఎఫ్‌ అనే పార్టీకి ఒక్క సీటు వచ్చింది. అంటే ఇక్కడ హోదానే కాదు ప్రతిపక్షం జాడే లేకుండా పోయింది.
నాగాలాండ్‌లో...
మొత్తం 60 సీట్లు నాగాలాండ్‌ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీనే అధికారం చేపట్టింది. నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) కి 25 సీట్లు రాగా బిజెపికి 12 సీట్లు వచ్చాయి. అయినా ఇక్కడ కూడా బిజెపికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇక ఎన్‌పిఎఫ్‌కు 2, ఎన్‌సీపీ 7, ఎన్‌పీపీ 5 సీట్లు సాధించాయి.
మహారాష్ట్రలో...
ఇటీవల ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష పార్టీ హోదా ఏ పార్టీకీ రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. ఇందులో బిజేపీకి 132 సీట్లు వచ్చాయి. పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వచ్చాయి. అలాగే ఎస్‌హెచ్‌ఎస్‌ 57, ఎన్‌సీపీ 41, శివసేన 20, కాంగ్రెస్‌ 16, ఎంసీపీఎస్‌పి 10, ఎస్‌పి 2, జెఎస్‌ఎస్‌ 2, ఇతరులకు 9 సీట్లు దక్కాయి. మొత్తం 15 పార్టీలు మహా రాష్ట్ర అసెంబ్లీకి పోటీ పడ్డాయి. ఎన్‌డీఏ కూటమిలో ఉన్న పార్టీలను పక్కన బెడితే ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది.
ఓటర్ల తీర్పు ఏకపక్షం
రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ గెలుపు ఓటముల విషయంలో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే రెండో పార్టీకి సంపూర్ణ ఓటమి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎప్పుడు కూడా సందిగ్ధమైన తీర్పును ప్రజలు ఇవ్వలేదు. ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇస్తూ వచ్చాయి. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే మాయా, ఓటర్ల తీర్పా అనేది నేటికీ రాజకీయ నాయకులకు అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రతిపక్ష హోదా కోల్పోయి అవమానంతో జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాడు. కేవలం ప్రస్తుతానికి పార్టీ ఆఫీసుకే పరిమితమయ్యాడు. ఇక తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీకి రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. ఎక్కువగా కక్ష పూరిత రాజకీయాల వైపు రెండు రాష్ట్రాల్లోనూ పాలకులు అడుగులు వేస్తున్నారు.
Next Story