ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం సాయంత్రం యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఈవెంట్‌కు టికెట్ కొనమని మా వాళ్లకు చెబితే.. విషయం తెలిసి మీరు టికెట్ కొనక్కర్లేదని భువనేశ్వరి చెప్పారని.. కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారని.. తక్కిని వాళ్లంతా టికెట్లు కొని వస్తే.. నేను మాత్రం ఉత్తిగా రావడం తప్పనిపించింది.. అందుకని నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలో ఎన్టీఆర్ ట్రస్టుకు రూ. 50లక్షల విరాళం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 28 ఏళ్లుగా కేన్సర్ రోగులకు సేవలు అందిస్తోందని, ఇప్పుడు తలసేమి రోగుల నిమిత్తం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
బాలకృష్ణను ఎప్పుడు కలిసినా.. బాలయ్య అని పిలువు అంటారని, కానీ తనకు సర్ అని బాలయ్యను పిలవాలని అనిపిస్తుందని అన్నారు. ఇంకా తన స్పీచ్‌ను కొనసాగిస్తూ.. నా దగ్గరు వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఆఫీసుకు లేఖ రాస్తే.. వారు స్పందించే తీరు అద్బుతంగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్టును కాపాడుకుంటూ వచ్చారని సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. మేమంతా ట్రస్టు కోసం మా వంతు సాయం చేస్తామన్నారు. మ్యూజికల్ నైట్ ద్వారా విజయవాడకు వన్నె తెచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. నారా భువనేశ్వరి అంటే తనకు అపారమైన గౌరవం అని అన్నారు. కష్టాలు, ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గరి నుంచి చూశానన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ బృందం తమ సంగీతంతో హుషారెత్తించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.