ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆబ్సెంట్ లేకుండా కేబినెట్ సమావేశాలకు హాజరవుతూ వచ్చిన పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాలేదు. వైరల్ జ్వరంతో పాటు తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని, అందువల్ల తాను కేబినెట్ సమావేశానికి హాజరు కాలేనంటూ రెండు రోజుల ముందు వెల్లడించారు. ఫిబ్రవరి 6 గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పవన్ కల్యాణ్ అనారోగ్యం గురించి సీఎం చంద్రబాబు వాకబు చేశారు. పవన్ కల్యాణ్ ఆరోగ్యం బాగా లేదని, వైలర్ జ్వరంతో పాటు తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, రెండు, మూడు రోజుల్లో తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన సీఎం చంద్రబాబు స్పందిస్తూ తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించానని అయితే ఫోన్‌లో పవన్ కల్యాణ్ అందుబాటులోకి రాలేదని చెప్పారు. సాక్షాత్తు సీఎం ఫోన్ చేసిన పవన్ కల్యాణ్ అందుబాటులోకి రాకపోవడం ఏంటనే దానిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, అందువల్లే సీఎం చంద్రబాబు ఫోన్‌కు కూడా పవన్ కల్యాణ్ స్పందించలేదనే టాక్ కూడా వినిపించింది.
సీన్ కట్ చేస్తే..
అది జరిగిన కొద్ది రోజులకు ఫిబ్రవరి 12న పవన్ కల్యాణ్ దీక్షా వస్త్రాలను ధరించి, తన కుమారుడు అకీరా, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనందసాయితో కలిసి తీర్థ యాత్రలకు బయలుదేరారు. తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు తిరిగారు. మూడు రోజుల పాటు చేపట్టిన తన తీర్థయాత్రల్లో రెండు రాష్ట్రాల్లోని పలు కీలక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. బీజేపీ అత్యంత ప్రతిష్మాతకంగా తీసుకున్న ఢిల్లీ ఎన్నికలు ఇదే సయమంలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొనే తీవ్ర అనారోగ్యంతో ఉన్నా తీర్థ యాత్రలు చేశారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. మరో వైపు తాను తీవ్ర వెన్ను నొప్పిని భరిస్తూనే దేవాలయ దర్శనాలు చేసుకుంటున్నట్లు తెలిపారు.
తీర్థ యాత్రలను ముగించికున్న పవన్ కల్యాణ్ అదే దీక్షా వస్త్రాలతో సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 రాత్రి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన మ్యూజికల్ నైట్‌కు హాజరయ్యారు. టికెట్ లేకుండా ఇక్కడకు రావడం ఇష్టం లేదని, దానికి ప్రతిగా ఎన్టీఆర్ ట్రస్టుకు రూ. 50లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు ఒకే వేదిక మీద దర్శనమివ్వడం వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.
తర్వాత ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారాని ఢీల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, ఇతర ఢిల్లీ పెద్దలను కలవడంతో పాటు ఎన్డీఏ పక్ష నేతల సమావేశానికి హాజరయ్యారు. ఈ ట్రిప్‌లో దీక్షా వస్త్రాలు ధరించిన పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు కంటే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా నిలిచారు. దీక్షా వస్త్రాలతో ఉన్న పవన్ కల్యాణ్‌ను చూసి.. హిమాలయాలకు ఎప్పుడు వెళ్తున్నారని ప్రధాని మోదీ అడగటం.. దానికి హిమాలయాలకు వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని పవన్ కల్యాణ్ బదులివ్వడం వంటి మోదీ..పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా హైలెట్ అయింది. ఈ సందర్భంగా తాను జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను వెన్ను నొప్పితోనే ఇంకా బాధపడుతున్నట్లు వెల్లడించారు.
తర్వాత తన భార్య అనా కొణెదల, కొడుకు అకీరా, సినీ దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి కుంభమేళాకు వెల్లారు. వారందరితో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని జనసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే దాదాపు జనవరి నెలాఖరు నుంచి వైరల్ జ్వరం, తీవ్ర వెన్ను నొప్పితో ఇబ్బందులు పడుతున్న పవన్ కల్యాణ్ వాటిని భరిస్తూనే ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చారు. చివరకు శనివారం ఆయనకు తీరిక దొరకడంతో దీక్షా వస్త్రాల్లోనే వెళ్లి హైదరాబాద్‌లోని తన బంధువులకు చెందిన అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటికి సిద్ధమయ్యేందుకు ఈ పరీక్షల చేయించుకున్నట్లు జనసేన శ్రేణులు చెబుతున్నారు.