కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్
x
Source: Twitter

కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్

జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిని పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయినా కాకినాడ ఎంపీ పవన్ పోటీపై వీడని సందిగ్దత.



ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంలో త్వరపడుతున్నాయి. తాజాగా జనసేన చీఫ్ వపన్ కల్యాణ్ కూడా కాకినాడ ఎంపీ సీటుకు తమ పార్టీ నుంచి పోటీ పడే అభ్యర్థిని ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ సమావేశమయ్యారు. అనంతరం తమ పార్టీ తరపున కాకినాడ ఎంపీ బరిలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నిలబడనున్నట్లు పవన్ ప్రకటించారు. ‘‘ఉదయ్ నాకోసం ఎంతో త్యాగం చేశారు. అతనిని ఎంపీ బరిలో భారీ మెజార్టీతో గెలిపించాలి’’అని కోరారు పవన్. ఆ దిశగా కార్యకర్తలందరూ ఉదయ్‌కి మద్దతు తెలిపాలని, ఆయన విజయానికి సహకరించాలని కోరారు. అనంతరం పిఠాపురంలో పరిస్థితులపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మొదలైన కులాల ఐక్యత
పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని జనసేనాని పవన్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆయన నియోజకవర్గంలోని పరిస్థితులపై మాట్లాడారు. ‘‘పిఠాపురంలో కేవలం నేను గెలవాలని పోటీ చేయట్లేదు. గాజువాక, భామవరంతో పాటు పిఠాపురం కూడా నాకు ముఖ్యమైన నియోజకవర్గమే. నేను ఇక్కడి నుంచే పోటీ చేయాలని అనేక మంది విజ్ఞప్తి చేశారు. అలాగే చాలా మంది నన్ను అసెంబ్లీకి పంపిస్తానని హామీ ఇచ్చారు. అందుకే ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నాను. ఇకపై పిఠాపురాన్ని నా స్వస్థలంగా భావిస్తా. రాష్ట్ర భవిష్యత్తు మార్చడానికి ఇక్కడి నుంచే తొలి అడుగు వేస్తా’’అని పవన్ భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే సత్తా ఏంటో చూపిస్తా
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా మారుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ‘‘ఒక ఎమ్మెల్యే తలచుకుంటే నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ది చేయొచ్చో అంతా అభివృద్ధి చేస్తా. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను పెంచి చూపిస్తా. పిఠాపురం రైతు కంట కన్నీరు రానివ్వను. నన్ను ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండో చోట్ల నుంచి పోటీ చేయాలని కేంద్రం కోరింది. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయడమే నాకిష్టం. తొలుత రాష్ట్రం కోసం పనిచేసి తర్వాత దేశం కోసం పని చేయడం ప్రారంభిస్తా. పిఠాపురంలో నన్ను ఓడించాలని వందల కోట్లు ఖర్చు చేస్తూ ప్రయత్నిస్తున్నారు. పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తా. వ్యవస్థపై ఉన్న కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దు. సరైన నేతనే ఎన్నుకోండి’’అని విజ్ఞప్తి చేశారు పవన్.
అప్పుడే ఎంపీగా పోటీ చేస్తా
అయితే పవన్.. కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. తాజాగా కాకినాడ నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్‌ను ప్రకటించిన పవన్.. తన ఎంపీ అభ్యర్థిత్వంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘‘ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబితే అప్పుడు ఈ విషయంపై ఆలోచిస్తా. ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడు నేను కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు’’అని వెల్లడించారు. దీంతో కాకినాడ ఎంపీ సీటు అభ్యర్థిపై నెలకొని ఉన్న సందిగ్దత ఇంకా వీడనట్లే మారింది.


Read More
Next Story