పవన్ ఎదుట ఎడతెగని తిరుపతి పంచాయితీ!
కూటమిలో సమన్వయం తీసుకురావడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చారు. మాట్లాడారు. తిరిగి వెళ్లారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: కూటమిలో చర్చలు, మాటల శస్త్ర చికిత్స ద్వారా అసంతృప్తి నేతలను సమన్వయం చేయడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రెండు రోజుల తిరుపతి పర్యటన శనివారం ఉదయం ముగిసింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి కూటమి నాయకులతో చర్చించారు.. తిరిగి వెళ్లారు. ఏడు గంటలు జరిగిన ఈ సుదీర్ఘ చర్చల్లో 14 మంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బిజెపిలో ఓ వర్గం, జనసేనలో మరో వర్గం నిరసన స్వరం వినిపించాయి. రాత్రి జరిగిన ఎపిసోడ్ అది. జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశానికి వెళ్లిన బిజెపి మిత్రపక్ష నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ఇది మరో అసంతృప్తికి దారి తీసింది.
శనివారం ఉదయం:
పవన్ కళ్యాణ్‌ను కలిసిన మిత్రపక్ష కూటమి నాయకులు అందరితో ఐక్యత రాగాన్ని మమ అనిపించారు. మాటలు కలిపిన నేతల.. మనసులు కలుస్తాయా.. కలిసి సాగుతాయా? అనేది సమాధానం దొరకని ప్రశ్న. రాష్ట్రంలో జనసేన- టిడిపి- బిజెపి కూటమిగా ఏర్పడిన తర్వాత సీట్ల సర్దుబాటు వ్యవహారం అసమ్మతి, అసంతృప్తులకు బీజం వేసింది. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న తిరుపతి సీట్‌పై జనసేన పట్టుపట్టి సాధించి, వైఎస్ఆర్సిపి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులును తిరుపతిలో జనసేన అభ్యర్థిగా రంగంలో నిలిపింది.
దీంతో "ఐదేళ్లపాటు అధికార పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేశాం" టికెట్ తనకే రావాలంటే టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పట్టు పట్టారు. ఆమెకు మద్దతు తెలిపే రీతిలో టిడిపి నాయకులు కూడా అండగా నిలిచారు. స్థానికేతరుడికి టికెట్ ఇచ్చారంటూ.. తిరుపతి జనసేన నాయకులు తిరగబడ్డారు. ఈ ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిని రంగంలోకి దించింది. జనసేన-టిడిపి వ్యవహారాలు టిడిపికి తలనొప్పిగా మారాయి.
ఈ పరిణామాలు అధికార వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజులుగా వివిధ స్థాయిలో టిడిపి, జనసేన నాయకులు ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా అభ్యర్థిని మార్చడానికి జనసేన ససేమిరా అంటుంటే, టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కూడా అదే సూచించారు. ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు తిరుపతి అభ్యర్థి ద్వారా స్థానిక నాయకులను బుజ్జగించడానికి రంగంలో దిగారు. కొంత ఫలితం కనిపించినా పూర్తిస్థాయిలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదనే విషయం టిడిపి, జనసేన అధినాయకత్వం గ్రహించింది. ఇక గత్యంతరం లేని స్థితిలో..
జనసేనాని ఫోకస్...
తిరుపతిలో కూటమి పరిస్థితి అదుపులోకి రాని స్థితిలో గత్యంతరం లేక జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన పర్యటన కూడా ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఎక్కడ జరుగుతుందనేది సమాచారం లేదు. మొదట అందిన సమాచారం మేరకు సీనియర్ సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ నివాసానికి వస్తారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. ఆయన అన్న కొణిదెల నాగబాబు మరో సీనియర్ నేత కూడా తిరుపతికి వచ్చారు. ఓ ప్రైవేట్ హోటల్లో వారంతా.. టిడిపి, జనసేన, బిజెపి నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు.
ఏడు గంటల చర్చలు
తిరుపతిపై జనసేన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జనసేన ప్రధాన కార్యదర్శి, సోదరుడు కొణిదెల నాగబాబుతో కలిసి కూటమిలోని పార్టీ నేతలతో వేరువేరుగా సమావేశం అయ్యారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మతో పాటు జి నరసింహ యాదవ్ కీలక నాయకులు ఎన్‌వి ప్రసాద్, ఆర్సి మునికృష్ణ, మబ్బు దేవ నారాయణ రెడ్డి, వూకా విజయ్ కుమార్, జేపీ శ్రీనివాస్, వూట్ల సురేంద్ర నాయుడు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. " టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు, నేను స్వయంగా మాట్లాడుకున్న తర్వాతే జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించాం" పవన్ కళ్యాణ్ వారందరికీ గుర్తు చేశారు. " మీ అందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఇక్కడ రాజకీయ శత్రువును ఎదుర్కోవాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలి" అని పవన్ కళ్యాణ్ కోరారు.
"రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని కోరుకునే.. నేను కూడా టిడిపి కోసం కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది" అని పవన్ కళ్యాణ్ టిడిపి నాయకులకు కర్తవ్య బోధ చేశారు. అంతిమంగా మనకు రాష్ట్ర, ప్రయోజనాలు, సమైక్యత అవసరమంటూ మనసులు మార్చే ప్రయత్నం చేసి అందరూ కలిసి పని చేస్తామని మాట తీసుకున్నారు. ఈ అంతర్గత సమావేశంలో "చేతులు జోడించి నమస్కరించడం ద్వారా చేసిన అభ్యర్థన ఆలోచనలో పడేసింది" అని తెలుస్తోంది. ఇదే సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు మాట్లాడారు. "నేను కూడా అనకాపల్లిలో పోటీ చేయాలని ప్రచారం చేశా. చివరికి కూటమి ఐక్యత. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. తప్పుకున్నా" అని కొణిదెల నాగబాబు కూడా గుర్తు చేశారు. మొదట రాష్ట్రం ఆ తర్వాత పార్టీ ప్రయోజనాలను కూడా అర్థం చేసుకోవాలని ఆయన.. కూటమి నాయకులను కోరారు.
బిజెపి నేతల అలక
కూటమి నేతలతో మాట్లాడడానికి తిరుపతికి వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి భాను ప్రకాష్ రెడ్డి, నాయకుడు సామంచి శ్రీనివాస్ దాదాపు 10, 15 మంది నాయకులతో.. ప్రైవేట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని అక్కడ సెక్యూరిటీ, పవన్ కళ్యాణ్ బౌన్సర్లు అడ్డుతగిలారు. ఎంత చెప్పినా వినకపోవడంతో.. బీజేపీ నేత భాను ప్రకాష్ ఆయన వర్గం నిరసన వ్యక్తం చేస్తుండగా, సహచరులు నినాదాలు చేసినట్లు సమాచారం. అనంతరం వారంతా హోటల్ నుంచి వెనితిరిగారు. "రాత్రి పొద్దు పోయింది కదా భోజనం చేసి మళ్ళీ వస్తాం" అంటూ మీడియా వద్ద భాను ప్రకాష్ రెడ్డి కవర్ చేయడానికి ప్రయత్నించారు.
ఉదయం సత్కారం
శనివారం ఉదయం భాను ప్రకాష్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధి బృందం వెళ్లి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలిసింది. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు, చట్టబద్ధంగా చేస్తున్న పోరాటంపై భాను ప్రకాష్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించినట్లు సమాచారం. తిరుపతిలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులుకు సహకారం అందిస్తామని, బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ రావుకు కూడా అండగా నిలవాలని చెప్పి నిష్క్రమించినట్లు సమాచారం.
పవన్ నోట.. బాబు మాట
పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలో.. వారు కాస్త శాంతించిన తర్వాత ఇచ్చిన హామీ ఒకటే.. " మీ రాజకీయ భవిష్యత్తుకు పూచీ నాది" మీకు ఎప్పుడు ఏం చేయాలో అది కచ్చితంగా చేస్తా" అని హామీ ఇచ్చారని చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల వేళ, టికెట్ దక్కని వారికి లభించే సాంత్వన మాటలు ఇవి. ఈ మాటలు ఎక్కువగా టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు నుంచి వినిపిస్తుంటాయి. అదే రీతిలో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనలో.. టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్’తో వేరువేరుగా మాట్లాడి వారిని శాంతింపజేశారు. ఆ తర్వాత టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, ఆ పార్టీ నాయకులు, జనసేన నేత కిరణ్ రాయల్ ఐక్యత రాగం ఆలపించి ఇకపై జనసేన తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెంట నడిచి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటామని భరోసా ఇచ్చారట.
దీంతో సంతృప్తి చెందిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తిరిగి బయలుదేరి వెళ్లారు. వేరువేరుగా ఆ తర్వాత ఒకటిగా మాటవరసకు హామీ ఇచ్చిన కూటమి నేతలు ఎన్నికల ప్రచార సరళి, బోల్ మేనేజ్మెంట్లో జనసేన తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు ఎంత మాత్రం అండగా నిలుస్తారనేది పోలింగ్ తర్వాత తేలనున్నది. ఓటర్లు కూడా వీరిని ఎలా ఆదరిస్తారనేది వేచి చూద్దాం.
ఆ సీట్ల కోసమే.. పిఠాపురంలో..
ఈ అంతర్గత సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో తిరుపతికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు, కీలక నేత మబ్బు దేవనన్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలిసింది. " మీరు ( పవన్ కళ్యాణ్) తిరుపతి నుంచి పోటీ చేసి ఉండొచ్చు. ఎమ్మెల్యేగా పంపించేవాళ్ళం ఇక్కడ నుంచి" అని టిడిపి సీనియర్ నాయకుడు మబ్బు దేవ నారాయణ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అప్పుడు తిరుపతిలో ఇంతటి అలజడి నాయకుల మధ్య సమన్వయం చక్కగా ఉండేది కదా అని అన్నట్లు తెలిసింది. ఈ మాటలతో స్పందించిన పవన్ కళ్యాణ్ అసలు విషయాన్ని చెప్పారని తెలిసింది.
" తిరుపతిలో పోటీ చేయడం నాకు ఇష్టమే. పార్టీ కూటమి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న. చంద్రబాబు సూచన మేరకు పిఠాపురం నుంచి పోటీ చేయాల నిర్ణయించుకున్నా. అని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారని తెలిసింది. కోస్తా ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లలో జనసేన పోటీ చేస్తోంది. టిడిపి అభ్యర్థులకు కీలకంగా ఉంది. నా అవసరం అక్కడ ఎక్కువ ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే తిరుపతి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారని తెలిసింది.